బజ్ అదిరిపోతోంది.. అయినా ఆ సినిమా కంటే తక్కువే!
on Dec 18, 2019
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తయారవుతున్న 'అల.. వైకుంఠపురములో' మూవీకి బజ్ అదిరిపోతోంది. ఇంతదాకా ఈ రేంజ్ బజ్ బన్నీ సినిమాకు మనం చూడలేదు. తమన్ మ్యూజిక్ ఇచ్చిన 'సామజవరగమన', 'రాములో రాములా' పాటలు రెండూ.. ఒకదాన్ని మించి మరొకటి రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో యూట్యూబ్ చానల్లో హల్‌చల్ చేస్తుండగా, ఆ మూవీపై అంతకంతకూ అంచనాలు పెరిగిపోతూ వస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఓవర్‌లోడ్ లాంటి హైప్ ఆ సినిమాకి క్రియేట్ అయ్యింది. వారం క్రితం వచ్చిన టీజర్ సైతం ఫ్యాన్స్‌ను అలరించింది. అయితే 'సరిలేరు నీకెవ్వరు' మూవీతో పోల్చుకుంటే ప్రి రిలీజ్ బిజినెస్ విషయంలో 'అల.. వైకుంఠపురములో' వెనుకబడి ఉండటం గమనార్హం. ఇప్పటికే 'సరిలేరు నీకెవ్వరు'కు ప్రి బిజెనెస్ క్లోజ్ అయిపోయింది కూడా. కానీ బన్నీ సినిమాకు ఇంతదాకా ఆంధ్రా ఏరియా బిజినెస్ పూర్తి కాలేదు. బయ్యర్ల ఆఫర్లను మించి నిర్మాతలు భారీ రేట్లను ఆశిస్తున్నందునే ఆ ప్రాంతానికి బిజినెస్ ఇంకా పెండింగులో ఉందనే మాట వినిపిస్తోంది.
నైజాంలో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు 20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. సీడెడ్ హక్కులు 12 కోట్లకు అమ్ముడవగా, ఓవర్సీస్ బిజినెస్ 9 కోట్ల రూపాయల మేర జరిగిందని సమాచారం. ఆంధ్రాకి సంబంధించి ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు, నెల్లూరు ప్రాంతాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏరియాలకు సంబంధించి నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ బయ్యర్ల నుంచి వచ్చిన ఆఫర్ల కంటే మరింత ఎక్కువ రేట్లు ఆశిస్తున్నారు. అలాగే కర్నాటక ప్రాంతానికి కూడా ఎక్కువ ధరను వారు ఆశిస్తున్నారు. ఇంత బజ్ వచ్చినా 'సరిలేరు నీకెవ్వరు' బిజినెస్‌ను ఈ సినిమా అందుకొనే అవకాశాలు లేవు.
ఎందుకంటే మహేశ్ కరిష్మాకి తగ్గట్లు 'సరిలేరు నీకెవ్వరు' ప్రి బిజినెస్ 100 కోట్లు దాటినట్లు చెప్పుకుంటున్నారు. 'భరత్ అనే నేను' తర్వాత ఆ ఫీట్ సాధించిన సినిమా ఇది. మహేశ్ మునుపటి మూవీ 'మహర్షి' ప్రి బిజినెస్ 100 కోట్ల మార్కును చేరుకోవడంలో ఫెయిలైంది. అయినప్పటికీ 'ఎఫ్2'తో డైరెక్టర్ అనిల్ రావిపూడి హైలో ఉండటం, అతని డైరెక్షన్‌లో మహేశ్ చెయ్యడంతో బయ్యర్లు 'సరిలేరు నీకెవ్వరు' హక్కుల కోసం పోటీపడ్డారు. ఫలితంగా విడుదల ఇంకా రెండు నెలలు ఉందనగానే ఆ సినిమాకి బిజినెస్ అయిపోయింది. 'అల.. వైకుంఠపురములో' పాటలతో పోలిస్తే, 'సరిలేరు నీకెవ్వరు' పాటలు ఆ రేంజిలో పాపులర్ కాకపోయినా ఆ సినిమాపై బయ్యర్లు నమ్మకం ఉంచడానికి కారణం.. మహేశ్ మునుపటి రెండు సినిమాలూ బాక్సాఫీసు దగ్గర మంచి ఫలితాల్ని రాబట్టడం.
మరోవైపు అల్లు అర్జున్, త్రివిక్రమ్.. ఇద్దరి సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. బన్నీ మునుపటి మూవీ 'నా పేరు సూర్య' ఫ్లాపవగా, త్రివిక్రమ్ సినిమా 'అజ్ఞాతవాసి' డిజాస్టర్ అయ్యాయి. అయినప్పటికీ నైజాం, సీడెడ్ ఏరియాలకు మంచి రేట్లే వచ్చాయి. కారణం తమన్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్ కావడం. అయితే అంతిమంగా బాక్సాఫీస్ విజయానికి మూలమయ్యేది మ్యూజిక్ కాదు, సినిమా ఎలా ఉందనేదే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'అల.. వైకుంఠపురములో' మూవీని తీర్చిదిద్దుతున్నాడు త్రివిక్రమ్.
ఇప్పటికే 'దువ్వాడ జగన్నాథం' సినిమాలో బన్నీ జోడీగా ఆకట్టుకున్న పూజా హెగ్డే ఈ మూవీలో అతనికి 'మేడమ్'గా అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉందో పాటలు, టీజర్ చెప్పకనే చెప్పాయి. 'సామజవరగమన' సాంగ్‌లో సో క్యూట్ పెయిర్‌గా వారు కనిపించారు. టబు, జయరామ్, సముద్రకని, మురళీశర్మ, సచిన్ ఖేడ్‌కర్, సుశాంత్, నవదీప్, రాహుల్ రామకృష్ణ, నివేదా పేతురాజ్, ఈశ్వరీరావు వంటి హేమాహేమీలు నటిస్తోన్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్, రాం-లక్ష్మణ్ ఫైట్స్, పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణలు. ఈ నేపథ్యంలో జనవరి 12న బాక్సాఫీస్ బద్దలవుతుందా? చూద్దాం.