వేణుమాధవ్ కామెడీగా చెప్పాడు.. ప్రశాంత్ నీల్ సీరియస్‌గా తీసుకొని బ్లాక్‌బస్టర్ కొట్టాడు!
on Jul 23, 2024
కన్నడ హీరో యష్‌ను స్టార్ హీరోను చేసిన సినిమా ‘కెజిఎఫ్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత సీక్వెల్‌గా వచ్చిన ‘కెజిఎఫ్2’ కూడా ఘనవిజయం సాధించింది. 2018లో రిలీజ్ అయిన ‘కెజిఎఫ్’ గురించి ఇప్పుడు కొత్తగా చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ సినిమా విషయమై ఓ కొత్త పాయింట్‌ని తెరపైకి తెచ్చారు. దీంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘నేనింతే’ సినిమాలో డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్‌గా చేరేందుకు రకరకాల ప్రయత్నాలు చేసే కుర్రాడిగా వేణుమాధవ్ కనిపిస్తాడు. ఫీల్డ్‌లో వున్న అసిస్టెంట్ డైరెక్టర్లకు రకరకాల కథలు చెబుతాడు. కానీ, ఎవరూ అతన్ని ఎంకరేజ్ చెయ్యరు. తెలుగు వారికి తెలుగు వారి సపోర్ట్ ఉండదన్న ఉద్దేశంతో తన పేరును సెంథిల్‌గా మార్చుకొని తమిళ డైరెక్టర్‌గా అందర్నీ పరిచయం చేసుకుంటాడు. ఆ సినిమాలో హీరో మల్లిక్‌గా నటించిన సుబ్బరాజుకు కథ వినిపించడానికి రెడీ అవుతాడు. తమిళ్, తెలుగును మిక్స్ చేస్తూ ఓ కథ నేరేట్ చేస్తాడు. ‘కన్నులెంది ఒరూ జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్...’ అంటూ ఆ కథలోని కొన్ని సీన్స్‌ని చెబుతాడు. ఆ సీన్‌లో కామెడీ అద్భుతంగా పండిరది. ఇక్కడ విషయం ఏమిటంటే.. వేణుమాధవ్ కామెడీగా చెప్పిన ఆ కథే ‘కెజిఎఫ్’ స్టోరీ. ఆ కథలో చెప్పిన సీన్స్ అన్నీ కెజిఎఫ్‌లో ఉన్నాయి. ఈ కామెడీ షాట్‌ను, కెజిఎఫ్ విజువల్స్‌ని మిక్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ నెటిజన్. అది ఇప్పుడు వైరల్‌గా మారింది. వేణుమాధవ్ వాయిస్‌లో కెజిఎఫ్ విజువల్స్ చూస్తుంటే అతను చెప్పిన స్టోరీ కరెక్ట్‌గా సరిపోయింది అనిపిస్తుంది.
ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. వేణుమాధవ్ కామెడీ కోసం చెప్పిన ఆ స్టోరీని ప్రశాంత్ నీల్ సీరియస్‌గా భారీగా తీసేశాడన్నమాట అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ‘నేనింతే’ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలోని కామెడీ సీన్స్‌ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మరోసారి సినిమాలోని ఆ పర్టిక్యులర్ సీన్‌ను వైరల్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.