ప్రచారంలో 'వెంకీమామ' వెనకబడ్డాడా?
on Nov 29, 2019
'వెంకీమామ' రిలీజ్ డేట్ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ కోసం అటు వెంకటేశ్ ఫ్యాన్స్, ఇటు నాగచైతన్య ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా నిర్మాత డి. సురేశ్‌బాబు విడుదల తేదీ విషయంలో ఎలాంటి ప్రకటనా చేయకపోవడం వాళ్లను అసహనానికి గురిచేస్తోంది. వెంకటేశ్ బర్త్‌డే అయిన డిసెంబర్ 13న సినిమా విడుదల అవుతుందని కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చింది. నిర్మాతల నుంచి ఎలాంటి స్పందనా కనింపించలేదు. దానికి తగ్గ ప్రమోషన్స్ కూడా లేకపోవడంలో ఆరోజు రిలీజ్ లేదనే విషయం అందరికీ అర్థమైంది. ఆ తర్వాత డిసెంబర్ 25న విడుదలవుతుందనే ప్రచారమూ, కాదు.. కాదు.. జనవరి 14న 'వెంకీమామ' ప్రేక్షకుల ముందుకు వస్తాడనే ప్రచారమూ.. సోషల్ మీడియాలో నడుస్తోంది. అయినా కూడా ప్రొడ్యూసర్స్ నుంచి రెస్పాన్స్ కనిపించకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా తను చేసే పని విషయంలో నిక్కచ్చిగా, క్లారిటీగా ఉండే సురేశ్‌బాబు 'వెంకీమామ' విషయంలో ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.
ఎక్స్‌పెక్ట్ చేసిన రీతిలో బిజినెస్ ఎంక్వైరీలు రాకపోవడం వల్లే రిలీజ్ డేట్ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారనే వదంతి ఒకటి వినిపిస్తోంది. నిజ జీవితంలో మేనమామ మేనల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య.. సినిమాలోనూ అవే తరహా క్యారెక్టర్స్ పోషిస్తోన్న సినిమాకి ఈజీగా బిజినెస్ అవుతుందని ఎవరైనా ఊహిస్తారు. పైగా 'ఎఫ్2'తో వెంకీ, 'మజిలీ'తో చైతూ.. ఇద్దరూ హిట్ల మీద ఉన్నారు. అలాంటప్పుడు ఆశించిన రీతిలో బిజినెస్ అవకుండా ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నదేమంటే, 'వెంకీమామ' బడ్జెట్ ఊహించిన దానికి మించి చాలా ఎక్కువైందనీ, ఆ రేంజిలో సినిమాని కొనడానికి బయ్యర్లు వెనుకా ముందూ ఆడుతున్నారనీ! ఆ వర్గాల ప్రకారం సినిమాకైన ఖర్చు 55 కోట్ల రూపాయల పైమాటే. కశ్మీర్‌లో షూటింగ్ జరిగినప్పుడు ఖర్చుపై నియంత్రణ తప్పిందనీ, దీనికి కారణం.. అప్పుడు సురేశ్‌బాబు షూటింగ్ లొకేషన్‌లో లేకపోవడమేననీ అంటున్నారు. రానా అమెరికాలో ఉన్నప్పుడు, కొడుకు కోసం సురేశ్‌బాబు కూడా అక్కడికి వెళ్లారు. ఆ సమయంలోనే కశ్మీర్ షెడ్యూల్ జరిగింది. అప్పుడే బడ్జెట్ అదుపు తప్పిందనే విషయం బయటకు వచ్చింది.
అందులో నిజానిజాల విషయం అలా ఉంచితే, ప్రమోషన్స్ విషయంలో 'వెంకీమామ' ఇంకా వెనుకబడి ఉన్నాడనే అభిప్రాయం ఫ్యాన్స్‌లో బాగా ఉంది. సోషల్ మీడియాలో కామెంట్ చూస్తుంటే, వాళ్లెంత అసహనంతో ఉన్నారో గ్రహించవచ్చు. అక్టోబర్ 8న 'ఫస్ట్ గ్లింప్స్' పేరుతో రిలీజ్ చేసిన వీడియోకు మంచి స్పందన వచ్చింది. అందులో వెంకీ క్యారెక్టర్ ఎలా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చెయ్యబోతోందో స్పష్టమైంది. ఆ తర్వాత నవంబర్ 7న రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోకు 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 'అల.. వైకుంఠపురములో' సాంగ్స్‌కు వచ్చిన వ్యూస్‌తో పోల్చి, ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. 'వెంకీమామ' మ్యూజిక్ డైరెక్టర్ కూడా తమనే కావడం గమనార్హం. 'మామా మామా మామా నే పలికిన తొలి పదమా' అంటూ రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శ్రీకృష్ణ ఆలపించాడు. సాకీని మోహన భోగరాజు పాడింది.
ఆ తర్వాత నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 23న 'అల్లుడు బర్త్‌డే గ్లింప్స్' పేరిట రిలీజ్ చేసిన వీడియోకు సైతం 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇందులో చైతూ క్యారెక్టర్ ఏమిటనేది రివీల్ చేశారు. కెప్టెన్ కార్తీక్ శివరాం వీరమాచనేని అనే ఆర్మీ ఉద్యోగిగా చైతూ కనిపిస్తాడని చెప్పారు. మరోవైపు జనవరి 11న వస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' మూవీకి సంబంధించి నవంబర్ 22న రిలీజ్ చేసిన టీజర్ ఎంత హంగామా సృష్టించిందీ మనం చూశాం. ఇప్పటికే అది 25 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. ఇలా 'అల.. వైకుంఠపురములో', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతూ రావడం, అంచనాలూ అంబరాన్ని చుంబిస్తుండటంతో, ప్రచారం విషయంలో 'వెంకీమామ' వెనుకంజలో ఉన్నాడనే అభిప్రాయం ఫ్యాన్స్‌లో కలగడంలో తప్పేముంది? త్వరలోనే అన్ని సందేహాలకూ నిర్మాతలు తెరదించుతారనీ, పబ్లిసిటీలో స్పీడు పెంచుతారనీ ఆశిద్దాం. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో వెంకీ జోడీగా పాయల్ రాజ్‌పుత్, చైతూ జంటగా రాశీ ఖన్నా.. ఒకర్ని మించి ఒకరు గ్లామర్ కురిపిస్తున్నారు.
Also Read