ప్రభాస్‌ని నేనెప్పుడు కలిశా?
on Feb 29, 2020
"ప్రభాస్‌ని నేనెప్పుడు కలిశా? ప్లీజ్... మా మీటింగ్ ఎప్పుడు జరిగింది? నేను ప్రభాస్ ని కలిశానని రాసిన వాళ్లతో నాకు చెప్పమని చెప్పండి!" అని దర్శకుడు వంశీ పైడిపల్లి అమాయకంగా అడుగుతున్నారు. ఆ అమాయకత్వపు మాటల్లో కాస్త వ్యంగ్యమూ ఉంది. మహేష్ బాబుతో వంశీ పైడిపల్లి చేయాల్సిన సినిమా అనుకోని కారణాలతో ఆలస్యంగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అందుకని, మధ్యలో మహేష్ మరో సినిమా చేయాలనుకున్నారు. అయితే... మహేష్ మరో సినిమా చేస్తుండడంతో వంశీ పైడిపల్లి సినిమాను క్యాన్సిల్ చేశారని పలువురు అభిప్రాయపడ్డారు. అటువంటి వార్తలు వండడం మానేయమని, తనకు కాస్త ప్రయివసీ ఇవ్వమని దర్శకుడు విజ్ఞప్తి చేశారు. కొంతమంది మరో అడుగు ముందుకేసి మహేష్ కాదని అనడంతో ప్రభాస్ దగ్గరకు వంశీ పైడిపల్లి వెళ్లాడని వార్తలు వండారు. వాటిపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. అటువంటిది ఏమీ జరగలేదని నవ్వుతూ చెప్పారు. మహేష్, తనది సినిమాకి అతీతమైన స్నేహం అనీ, సినిమా ఆలస్యం కావడం వల్ల మహేష్ తో తన రిలేషన్ చెడిపోలేదని వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చారు.