'వాల్మీకి' కాదు.. 'గద్దలకొండ గణేష్'!
on Sep 19, 2019
వరుణ్ తేజ్ ప్రధాన పాత్ర పోషించగా మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న 'వాల్మీకి' చిత్రానికి అనూహ్య ఆటంకం ఎదురైంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో సినిమా టైటిల్‌ను నిర్మాతలు మార్చాల్సి వచ్చింది. అవును. రేపు ఉదయం విడుదలవుతున్న వరుణ్ తేజ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ మూవీ సినిమా పేరు ఇక 'వాల్మీకి' కాదు.. 'గద్దలకొండ గణేష్'. చాలా రోజుల నుంచీ 'వాల్మీకి'గా భారీ పబ్లిసిటీ ఇస్తూ వచ్చి, విడుదలయ్యే చివరి నిమిషంలో టైటిల్ మార్చాల్సి రావడం 'గద్దలకొండ గణేష్'కు కమర్షియల్‌గా పెద్ద దెబ్బేనని చెప్పాలి. సినిమాలో వరుణ్ తేజ్ చేసిన కేరెక్టర్ పేరు గద్దలకొండ గణేష్‌నే చివరకు టైటిల్‌గా పెట్టారు.
కొన్ని రోజులుగా ఈ సినిమాకు పెట్టిన 'వాల్మీకి' టైటిల్‌ను మార్చాలంటూ బోయ సామాజిక వర్గం నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. ఒక గ్యాంగ్‌స్టర్ మూవీకి తమ మూల పురుషుడి పేరును పెట్టడంతో తామంతా మనస్తాపానికి గురవుతున్నామంటూ బోయ హక్కుల పోరాట సమితి ఆందోళనలు చేస్తూ వచ్చింది. అయితే రామాయణం రాసిన 'వాల్మీకి' తరహాలోనే ఈ సినిమాలో కథానాయకుడు కరడుగట్టిన రౌడీ నుంచి మంచివాడుగా మారతాడనీ, అందుకే ఆ టైటిల్ పెట్టామనీ హరీశ్ శంకర్ వివరణ ఇచ్చినా పోరాట సమితి తమ ఆందోళనలు విరమించలేదు.
ఇటీవల టైటిల్ డిజైన్‌లోని గన్‌ను తీసేసి కొత్త డిజైన్‌ను ప్రచారంలోకి తెచ్చింది నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్. ఈ లోగా పోరాట సమితి తమ ఆందోళనను పిటిషన్ రూపంలో హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనికి స్పందించిన న్యాయస్థానం నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. గత్యంతరం లేని స్థితిలో 'వాల్మీకి' టైటిల్‌ను మారుస్తున్నామని కోర్టుకు తెలియజేసిన నిర్మాతలు, అందుకు అనుగుణంగా అప్పటికప్పుడు 'గద్దలకొండ గణేష్'గా టైటిల్‌ను నిర్ణయించారు.
అథర్వ, మృణాళిని రవి జంటగా నటించిన ఈ సినిమాలో పూజా హెగ్డే ఒక ప్రత్యేక పాత్ర చేసింది. వరుణ్ తేజ్, పూజపై చిత్రీకరించిన 'ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మా' రీమిక్స్ సాంగ్ ఆన్‌లైన్‌లో బాగా పాపులర్ అయ్యింది.