ట్రాన్స్ జెండర్లను పెళ్లికి పిలిచిన ఉపాసన!
on Dec 3, 2021
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఏ పని చేసినా ఏదో ఒక విశేషం ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉపాసన.. కుటుంబానికి సంబంధించిన విషయాలతో పాటు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే అనేక విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు తన ట్రాన్స్ జెండర్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన బెస్ట్ ఫ్రెండ్ ఒక ట్రాన్స్ జెండర్ అని చెప్పి ఆశ్చర్యపరిచారు ఉపాసన. అంతేకాదు వారూ మనుషులేనని, వారిని గౌరవించాలని చెప్పారు. ఇక తాజాగా తన ట్రాన్స్ జెండర్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు ఉపాసన. తమ బంధువు అనుష్ పాల పెళ్లి వేడుకలకు తన ఫ్రెండ్ లక్ష్మీనారాయణ్ ను ఉపాసన ఆహ్వానించారు. ఆ సందర్భంగా ట్రాన్స్ జెండర్ లక్ష్మీనారాయణ్ తో కలిసి తీసుకున్న ఫొటోలు ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ పెళ్లి వేడుకలో లక్ష్మీనారాయణ్ తో పాటు మరికొందరు ట్రాన్స్ జెండర్లు కూడా పాల్గొన్నారు.
జీవితాన్ని పరిపూర్ణంగా ఎలా బతకాలో నేర్పించావ్ అంటూ ట్రాన్స్ జెండర్ లక్ష్మీనారాయణ్ ను ఉద్దేశించి ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు. "హైదరాబాద్ ట్రాన్స్ జెండర్లు అంటే నాకు నిజంగా అపారమైన గౌరవం ఉంది. వారిలో జీవితాల నుంచి తెలుసుకోవాల్సిన అద్భుతమైన జీవిత కథలు ఉంటాయి. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీతో ఇంత సన్నిహితంగా మెలిగే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది" అన్నారు. ట్రాన్స్ జెండర్ లక్ష్మీనారాయణ్ తో ఉపాసన తీసుకున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read