14 భారీ సినిమాలు వచ్చినా.. చెక్కు చెదరని 'బాహుబలి' రికార్డులు!
on Jan 24, 2020
ప్రభాస్ టైటిల్ రోల్ చెయ్యగా యస్.యస్. రాజమౌళి రూపొందించిన 'బాహుబలి: ద బిగినింగ్', 'బాహుబలి: ద కంక్లూజన్' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనం అసాధారణం. 2015లో వచ్చిన మొదటి భాగమే సెన్సేషనల్ రన్ సాధించిందనుకుంటే, 2017లో వచ్చిన రెండో భాగం ప్రభంజనమే సృష్టించింది. ఒకప్పుడు ఎన్టీ రామారావు సినిమా 'లవకుశ'ను చూసేందుకు జనం దూరాభారాన్ని సైతం లెక్కచెయ్యకుండా తండోపతండాలుగా థియేటర్ల వద్దకు వెళ్లేవారని చెప్పుకుంటారు. అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రేక్షకులు 'బాహుబలి 2' చూసేందుకు ఎగబడ్డారు. అందుకే తెలుగు సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని కలెక్షన్ల సునామీ ఆ సినిమాకు నమోదైంది.
'బాహుబలి 2' సాధించిన రికార్డులు ఏ స్థాయివంటే, ఆ తర్వాత వచ్చిన అనేక భారీ సినిమాలు ఆ రికార్డులపై ఎంతగా గురిపెట్టినా, దాని దరిదాపుల్లోకి రాలేక, చివరకు 'నాన్-బాహుబలి' రికార్డులతో సరిపెట్టుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఇటీవల వైజాగ్‌లో జరిగిన 'అల.. వైకుంఠపురములో' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరో అల్లు అర్జున్ తన సినిమా 'ఇండస్ట్రీ రికార్డ్' సాధించిందని ఆర్భాటంగా చెప్పుకున్నాడు. కానీ అది 'బాహుబలి 2' రికార్డులో సగం వసూళ్లు కూడా సాధించలేదు. అంటే ఆయన చెప్పింది 'నాన్-బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్' అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పటికీ ఆ సినిమా మెగాస్టార్ చిరంజీవి సినిమా 'సైరా నరసింహారెడ్డి' వసూళ్లను కూడా దాటలేదు. మనం చెప్పుకుంటున్నది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలెక్షన్ల గురించి.
ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన 'బాహుబలి 2' మూవీ 2017 ఏప్రిల్‌లో విడుదలైంది. దాని తర్వాత ప్రెజెంట్ టాప్ హీరోల సినిమాలు ఇప్పటివరకూ 14 రిలీజయ్యాయి. విడుదలకు ముందు వాటిలో ప్రతి సినిమా 'బాహుబలి 2'ని కాకపోయినా, 'బాహుబలి 1'ని అయినా దాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ అందులో వైఫల్యం చెందాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'బాహుబలి' మూవీ 113 కోట్ల రూపాయల షేర్, 'బాహుబలి 2' 203 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి, ట్రేడ్ వర్గాల్నే షాక్‌కు గురిచేశాయి. వీటిలో 'బాహుబలి 2' సెట్ చేసిన రికార్డులు మిగతా హీరోల గుండెల్ని గుభేల్మనిపించాయి. అందుకే కనీసం 'బాహుబలి 1' మూవీ కలెక్షన్లనైనా దాటాలని ప్రతి హీరో ప్రయత్నిస్తూ వస్తున్నాడు. కానీ ఇంతదాకా ఏ హీరో కూడా దాన్ని అందుకోలేకపోతున్నాడు. చిరంజీవి దగ్గర దాకా వచ్చాడు కానీ.. టార్గెట్‌ను రీచ్ కాలేకపోయాడు. ఆయన సినిమా 'సైరా.. నరసింహారెడ్డి' 103 కోట్ల షేర్ సాధించి, పది కోట్ల రూపాయల దూరంలో ఆగిపోయింది.
పవన్ కల్యాణ్ సినిమా 'అజ్ఞాతవాసి' కేవలం 40 కోట్ల రూపాయల షేర్ మాత్రమే సాధించి ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. 'బాహుబలి 2' రిలీజయ్యాక టాప్ హీరోల్లో అందరికంటే ఎక్కువగా మహేశ్ సినిమాలు నాలుగు వచ్చాయి. అయినా 'బాహుబలి 1'ని కూడా ఏ ఒక్కటీ టచ్ చెయ్యలేకపోయాయి. 'స్పైడర్' కేవలం 33 కోట్ల రూపాయలతో డిజాస్టర్ కాగా, 'భరత్ అనే నేను' మూవీ 65 కోట్ల రూపాయలు, 'మహర్షి' సినిమా 80 కోట్ల రూపాయలు, 'సరిలేరు నీకెవ్వరు' తొలివారం 81 కోట్ల రూపాయలు (ఇంకా థియేటర్లలో నడుస్తోంది) షేర్ వసూలు చేశాయి.
ఈ కాలంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు రెండు విడుదలవగా, వాటిలో 'జై లవకుశ', 57 కోట్లు, 'అరవింద సమేత వీరరాఘవ' 72 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసి టార్గెట్‌కు చాలా దూరంగా ఉండిపోయాయి. 2020లో విడుదలయ్యే 'ఆర్ ఆర్ ఆర్' మూవీతో అతను 'బాహుబలి 1' రికార్డును దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కారణం.. ఆ మూవీకి డైరెక్టర్ రాజమౌళి కావడం. ప్రభాస్ సైతం తన సినిమా రికార్డుని తనే బద్దలు కొట్టాలని 'సాహో' మూవీతో ట్రై చేశాడు కానీ 83 కోట్ల రూపాయల దగ్గరే ఆగిపోయాడు. యంగ్ మెగా హీరోల్లో రాంచరణ్ రెండు సినిమాలతో 'బాహుబలి'ని దాటాలనుకున్నాడు. వాటిలో 'రంగస్థలం'తో కాస్త దగ్గరగా 92 కోట్ల రూపాయల్ని సాధించాడు. మరో సినిమా 'వినయ విధేయరామ' 56 కోట్ల రూపాయల్ని మాత్రమే సాధించగలిగింది. తారక్ తరహాలోనే చరణ్ కూడా 'ఆర్ ఆర్ ఆర్'తో 'బాహుబలి' రికార్డును సాధిస్తాడని ఆశించవచ్చు.
మెగా హీరో అనే గుర్తింపు నుంచి 'అల్లు హీరో' గుర్తింపు కోసం తహతహలాడుతున్న అల్లు అర్జున్ మూడు సినిమాలతో రికార్డులపై కన్నేశాడు. వాటిలో 'దువ్వాడ జగన్నాథం' చిత్రం 58 కోట్ల రూపాయల దగ్గర, 'నాపేరు సూర్య' మూవీ 39 కోట్ల దగ్గరా ఆగిపోయాయి. ఇప్పుడు 'అల వైకుంఠపురములో' సినిమాతో 'బాహుబలి 1'ను దాటుతాననే ఆశాభావంతో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే 'ఇండస్ట్రీ హిట్' కొట్టాననే ఫీలింగ్‌తో ఉన్నాడు. అయితే ఆ సినిమా 'సైరా' కలెక్షన్‌ను దాటుతుందేమో కానీ, 'బాహుబలి 1' కలెక్షన్ అందుకొనే అవకాశాలు బహు తక్కువ అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికి ఆ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 95 కోట్ల రూపాయల దాకా సాధించింది. బన్నీ చెప్పిన 'ఇండస్ట్రీ రికార్డ్' ఎక్కడనుంచి వచ్చిందో మనకు తెలీదు.
ఏదేమైనా 'బాహుబలి 1' రికార్డులు ఇంటా, బయటా కూడా ఈ ఏడాదే బద్దలయ్యే అవకాశాలు 'ఆర్ ఆర్ ఆర్'తో పుష్కలంగా ఉన్నాయి. తారక్, చరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా అక్టోబరులో రిలీజవుతుందని అంటున్నారు. సినిమా బ్రహ్మాండంగా ఉందనే టాక్ వస్తే, 'బాహుబలి 2' రికార్డుల్ని కూడా అది టార్గెట్ చేసే చాన్స్ ఉంది. లేకపోతే.. ఇప్పట్లో 'బాహుబలి 2' రికార్డులు చెక్కుచెదరవు.