డిస్కో రాజా సినిమా రివ్యూ
on Jan 24, 2020
నటీనటులు: రవితేజ, బాబీ సింహా, సునీల్, పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్, 'వెన్నెల' కిషోర్, 'స్వామి రారా' సత్య తదితరులు
మాటలు: అబ్బూరి రవి
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
సంగీతం: ఎస్.ఎస్. తమన్
నిర్మాత: రజనీ తాళ్లూరి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విఐ ఆనంద్
విడుదల తేదీ: 24 జనవరి 2020
'డిస్కో రాజా' టైటిల్ విని మాస్ మహారాజా రవితేజకు పర్ఫెక్ట్ అన్నారంతా. టీజర్ వచ్చాక 'డిస్కో రాజా'గా రవితేజ ఇరగదీశాడని అన్నారు. మరి, సినిమా ఎలా ఉంది? వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న రవితేజకు విజయం అందిస్తుందా? దర్శకుడు విఐ ఆనంద్ సినిమాను ఎలా తీశాడు? రివ్యూ చదివి తెలుసుకోండి.
కథ:
లద్దాఖ్ మంచుకొండల్లో ట్రెక్కింగ్ కి వెళ్లిన కొందరు యువకులకు అక్కడ మంచులో ఫ్రీజ్ అయిన ఒక వ్యక్తి (రవితేజ) కనిపిస్తాడు. అతడిని ఎవరికీ తెలియకుండా ఒక బయో కెమికల్ ల్యాబ్ కి తీసుకొస్తారు. మరణించిన మనిషికి మళ్లీ ప్రాణం పోయడానికి ప్రయత్నాలు చేసే వైద్యుడి ప్రయోగం ఫలించడంతో రవితేజకి ప్రాణం తిరిగొస్తుంది. అయితే... తను ఎవరు? అనేది గుర్తుకు రాదు. గతం గుర్తుకు రావడానికి రవితేజ చేసిన ప్రయత్నాలు ఏంటి? అతణ్ణి వాసు అని కొందరు, డిస్కో రాజా అని కొందరు అంటారు. ఇంతకీ... వాసు ఎవరు? డిస్కో రాజా ఎవరు? ప్రేమించిన హెలెన్ (పాయల్ రాజ్ పుత్) కోసం డిస్కో రాజా ఏం చేశాడు? డిస్కో రాజాకి, బర్మా సేతు (బాబీ సింహ)కి ఉన్న వైరం ఏంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
ఇకపై బ్యాడ్ ఫిలిమ్స్ చెయ్యను. గుడ్ ఫిలిమ్స్, గుడ్ క్యారెక్టర్స్ చేస్తా. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ చేస్తా' - ఇటీవల ఇంటర్వ్యూల్లో రవితేజ చెప్పిన కామన్ డైలాగ్. ఆయన చెప్పినట్టు 'డిస్కో రాజా'లో గుడ్ కాన్సెప్ట్ ఉంది. కంటెంట్ ఉంది. కంటెంట్ కి తగ్గట్టు హీరోకి మంచి క్యారెక్టరైజేషన్ కూడా కుదిరింది. కానీ, ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా బ్యాడ్. డైరెక్షన్ వీక్. టెక్నికల్ ఎలిమెంట్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉండేలా దర్శకుడు విఐ ఆనంద్ చూసుకున్నారో... స్క్రిప్ట్ విషయంలో అంత వీక్ గా ఉన్నారు. అవసరం లేని సన్నివేశాలతో నిడివి పెంచడమే కాదు... సెకండాఫ్ కి వచ్చేసరికి అసలు కాన్సెప్ట్ పక్కన పెట్టేసి, కేవలం డిస్కో రాజాగా రవితేజ క్యారెక్టరైజేషన్ మీద డిపెండ్ అయ్యి రెగ్యులర్ రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా సినిమాను మార్చేశారు.
సినిమా స్టార్ట్ అవ్వడమే మంచి పాయింట్ తో స్టార్ట్ అవుతుంది. మరణించిన మనిషిని మళ్లీ బతికించడం అనే కాన్సెప్ట్ తో ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఒక్కసారి రవితేజ కోమాలోనుండి లేచిన తర్వాత, అంతకు ముందు సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ గురించి వివరిస్తూ సన్నివేశాల నిడివి పెంచుకుంటూ వెళ్లారు. అక్కడకీ... తన టైమింగ్ తో రవితేజ చాలా సన్నివేశాలను లైవ్లీగా మార్చేశాడు. ప్రీ ఇంటర్వెల్ ముందు డిస్కో రాజా క్యారెక్టర్ రివీల్ చేసిన విధానం బావుంది. అక్కడ ప్రేక్షకులకు ఒక హై వస్తుంది. సెకండాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కాసేపు ఆ టెంపో కొనసాగింది. మెల్లమెల్లగా సినిమా రొటీన్ ఫార్మాట్ లోకి వెళ్లింది. ఎండింగ్ కూడా మాఫియా, గ్యాంగ్ స్టార్ సినిమాల్లో చూసేదే. అందువల్ల, ట్విస్టులు పెద్దగా క్లిక్ కాలేదు. ప్రీ ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ కోసం తప్ప సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ ఎందుకూ ఉపయోగపడలేదు.
డైరెక్టర్ విఐ ఆనంద్ 100% బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వకపోయినా... సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ 100% అవుట్ పుట్ ఇచ్చారు. సినిమాలో ప్రతి ఫ్రేమ్ బావుంది. రిట్రో ఎపిసోడ్స్, మంచు కొండల్లో సీన్స్ ను కార్తీక్ ఘట్టమనేని బాగా పిక్చరైజ్ చేశాడు. ఆర్ట్ వర్క్ కూడా బావుంది. తమన్ పాటల్లో 'నువ్వు నాతో ఏమన్నావో' పాట మరికొన్ని నెలలు వినబడుతుంది. డిస్కో రాజా ఎపిసోడ్స్ కి మంచి రీ రికార్డింగ్ ఇచ్చాడు. 'ఫ్రీక్ అవుట్' సాంగ్ కూడా బావుంది. రామ్ తాళ్లూరి ఖర్చుకు వెనుకాడలేదు. ఆయన ప్రొడక్షన్ డిజైన్ బావుంది.
ప్లస్ పాయింట్స్:
డిస్కో రాజాగా రవితేజ నటన
కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ
క్లైమాక్స్ లో సునీల్ నటన, బాబీ సింహా
'నువ్వు నాతో ఏమన్నావో' సాంగ్, డిస్కో రీరికార్డింగ్
మైనస్ పాయింట్స్:
సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ తీస్తే రొటీన్ స్టోరీ
కన్‌ఫ్యూజింగ్ స్క్రీన్‌ప్లే
డైరెక్షన్
సెకండాఫ్
రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ సీన్స్
ఎడిటింగ్
నటీనటులు:
రవితేజ లేని 'డిస్కో రాజా'ను ఊహించుకోవడం కష్టం. ఈ సినిమాకు మొదలు... చివర... అంతా మాస్ మహారాజానే. తన ఇమేజ్, బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ క్యారెక్టర్ కుదరడంతో ఎక్కడా ఆగలేదు. తగ్గలేదు. క్యారెక్టర్ లోకి వెళ్లి కిక్ ఇచ్చాడు. డిస్కో రాజాగా రవితేజ నటనలో ఒక ఈజ్ కనపడుతుంది. బాడీలో ఒక మూమెంట్ ఉంటుంది. రవితేజ మేనరిజమ్స్, యాటిట్యూడ్ సినిమాను చాలావరకు లైవ్లీగా మార్చాయి. రవితేజ తర్వాత సినిమాలో చెప్పుకోవలసిన నటుడు సునీల్. డిస్కో రాజా అనుచరుడిగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సాదాసీదాగా ఉన్నప్పటికీ... పతాక సన్నివేశాల్లో చెలరేగాడు. 'అపరిచితుడు'లో విక్రమ్ తరహాలో వావ్ అనిపించాడు. బాబీ సింహా నేషనల్ అవార్డు అందుకున్న నటుడు. మంచి నటన కనబరిచాడు. నరేష్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. హీరోయిన్లలో పాయల్ రాజ్ పుత్ కి మంచి క్యారెక్టర్ దొరికింది. నభా నటేష్ ఒక పాటకు, రెండు సన్నివేశాలకు పరిమితమైంది. తాన్యా హోప్ క్యారెక్టర్ ను హీరోయిన్ రోల్ అని చెప్పలేం.
తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
లాస్ట్ రవితేజ చేసిన రెండు మూడు బ్యాడ్ ఫిలిమ్స్ తో పోలిస్తే... గుడ్ అనిపించుకోదగ్గ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. రవితేజ నటన, క్యారెక్టరైజేషన్ బావున్నాయి. అలాగని, సినిమాను గుడ్ ఫిలిమ్ అనలేం. ఎందుకంటే... 'డిస్కో రాజా'లో బ్యాడ్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి. అయితే... ఒక్కటి మాత్రం పక్కాగా చెప్పొచ్చు. రవితేజ వన్ మ్యాన్ షో చేసిన సినిమా 'డిస్కో రాజా'. మాస్ మహారాజా వీరాభిమానులకు నచ్చుతుంది.
రేటింగ్: 2.5/5
Also Read