
మాజీ మిస్ పూణే, ప్రముఖ నటి ట్విషా శర్మ(Twisha sharma)అనుమానాస్పద మృతి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం ఐదు నెలల క్రితం, అంటే 2025 డిసెంబర్‌లో భోపాల్ కి చెందిన లాయర్ సమర్థ్ సింగ్‌ని వివాహం చేసుకున్న ట్విషా, మే 12 రాత్రి భోపాల్‌లోని కటారా హిల్స్ నివాసంలో విగతజీవిగా కనిపించింది. వరకట్న వేధింపుల వల్లే జరిగిన హత్య అంటూ తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. మరో వైపు ట్విషా శర్మ అత్త, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్ ప్రెస్‌మీట్ లో మాట్లాడుతు ట్విషా కి డ్రగ్స్ అలవాటు ఉందని, గంజాయి తీసుకునేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) భోపాల్ ఫొరెన్సిక్ నిపుణులు విడుదల చేసిన పోస్ట్‌మార్టం నివేదిక ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపుగా మారింది. ట్విషా శర్మ మృతికి గల అసలు కారణాలను ఈ పోస్ట్‌మార్టం నివేదిక వివరంగా వెల్లడించింది.
ఎయిమ్స్ భోపాల్ పోస్ట్‌మార్టం నివేదిక ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేసింది. ట్విషా శరీరంలో ఎలాంటి డ్రగ్స్ లేదా నార్కోటిక్ పదార్థాల ఆనవాళ్లు లేవని నివేదికలో స్పష్టమైంది. మే 12వ తేదీ రాత్రి 10 గంటల 26 నిమిషాల ప్రాంతంలో ఇంటి టెర్రస్‌పై ఉన్న జిమ్నాస్టిక్ రింగ్ తాడుకు ట్విషా వేలాడుతూ కనిపించిందని నివేదిక పేర్కొంది. అనంతరం అర్ధరాత్రి దాటాక మే 13 తెల్లవారుజామున ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గొంతు పైభాగంలో రెండు ఎర్రటి తాడు గుర్తులు (ligature marks) స్పష్టంగా ఉన్నాయని, మెడ వెనుక భాగంలో ఈ గుర్తు పూర్తి కాలేదని నివేదిక స్పష్టం చేసింది. ఇది సాధారణంగా ఉరి వేసుకున్నప్పుడు జరిగే ప్రక్రియను సూచిస్తుంది.
అంతేకాకుండా, ఊపిరి ఆడకపోవడం (asphyxia) వల్ల ముఖం ఉబ్బిపోవడం, గోళ్లు, చెవులు నీలిరంగులోకి మారడం వంటి లక్షణాలను వైద్యులు గుర్తించారు. అయితే, ట్విషా శరీరంలో కేవలం ఉరి గుర్తులు మాత్రమే కాకుండా, మొండి వస్తువుల వల్ల తగిలిన కొన్ని సాధారణ గాయాలు (blunt force injuries) కూడా ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదికలో రికార్డ్ కావడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ట్విషా మరణానికి ముందు తీవ్రమైన మానసిక వేధన అనుభవించిందని, ఆమె భర్త కుటుంబం అదనపు కట్నం కోసం వేధించిందని ఆమె తండ్రి నవనిధి శర్మ ఆరోపిస్తున్నారు. స్థానిక భోపాల్ పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, అందుకే ఢిల్లీ ఎయిమ్స్‌లో రెండోసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలని వారు కోర్టును ఆశ్రయించారు.
Also read: Dragon: ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు LUGER వెనుక ఉన్న రహస్యం ఇదేనా! అసలు టార్గెట్ ఎవరు
ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కోసం పోలీసులు ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న భర్త సమర్థ్ సింగ్ కోసం 6 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అతనిపై పోలీసులు 10,000 రివార్డు కూడా ప్రకటించారు. అతను దేశం విడిచి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని కూడా సంప్రదించారు. సీసీటీవీ ఫుటేజీలో ట్విషా ఒంటరిగా టెర్రస్ పైకి వెళ్లడం, ఆ తర్వాత 57 నిమిషాల అనంతరం ఆమెకు సీపీఆర్ (CPR) చేయడానికి ప్రయత్నించిన దృశ్యాలు బయటపడ్డాయి.





