మన హీరోల సొంత కుంపట్లు తెలుసా..?
on May 17, 2016
హిట్స్ లో ఉన్నప్పుడు ఉన్న క్రేజ్, ఫ్లాపుల్లో ఉంటే ఉండదు. సినిమాలు అడకపోతే, ఆ హీరోతో ఒక్క నిర్మాత పెట్టుబడి పెట్టే సాహసం చేయడు. అలాంటి సమయంలో మళ్లీ హిట్టు కొట్టి ప్రూవ్ చేసుకోవాలనుకుంటే సొంత నిర్మాణ సంస్థ మాత్రమే ఏకైక ఆప్షన్. అందుకే నేటి హీరోలు చాలా తెలివిగా అంతా ముందే ప్లానింగ్ చేసుకుని అడుగు ముందుకేస్తున్నారు రెమ్యునరేషన్ అయినా, డేట్స్ అయినా, ఫ్యామిలీ టైం అయినా, అంతా పక్కా ప్రొఫెషనల్ అండ్ ప్లానింగ్ గా వ్యవహరిస్తున్నారు. తమకంటూ సొంత నిర్మాణ సంస్థ స్థాపించుకుని సినిమాలు నిర్మిస్తున్నారు. హిట్స్ ఉన్నప్పుడు చుట్టూ తిరిగే వాళ్లే రెండు ఫ్లాపులు వస్తే కాలర్ వెనుక ముఖం దాచుకుని పోతుంటారు. అందుకే తమకంటూ సొంత ప్రొడక్షన్ తో ముందే జాగ్రత్త పడుతున్నారు మన హీరోలు. ఒక్కసారి మన స్టార్ హీరోల ప్రొడక్షన్ వెంచర్స్ చూస్తే...
1. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్వయంగా తన పేరు మీదే స్థాపించిన బ్యానర్ ఇది. తన సినిమాల్లో తాను కూడా నిర్మాణ భాగస్వామి అవ్వాలనే ఉద్దేశ్యంతోనే పవన్ ఈ సంస్థను స్థాపించారు.
2. జి మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి ఎంటరయ్యారు. సినిమా కథ నేనే నిర్మించాలి అనేంత నచ్చితే, తప్పని సరిగా నిర్మాణంలో భాగస్వామినౌతాను అని మహేష్ కూడా ఇప్పటికే ప్రకటించారు.
3. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
ప్రతిష్టాత్మక మెగా 150 సినిమాతో, నిర్మాతగా అడుగుపెడుతున్నాడు రామ్ చరణ్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అన్న పేరుతో, చిరు 150 వ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే అంజనా ప్రొడక్షన్స్ అనే సొంత సంస్థ ఉన్నా, తమకంటూ సెపరేట్ గా కొణిదెల నిర్మాణసంస్థను స్థాపించడం విశేషం.
4. ఎన్టీఆర్ ఆర్ట్స్
పెద్ద ఎన్టీఆర్ పేరు మీద స్థాపించిన ఈ బ్యానర్ కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ల హోం బ్యానర్. ఈ బ్యానర్లో తాము నటించడమే కాకుండా, బయటి హీరోలతో కూడా సినిమాలు తీస్తున్నారు నందమూరి వారసులు.
5. గీతా ఆర్ట్స్
అల్లు అర్జున్ తో లేటెస్ట్ గా సరైనోడు తీసి వందకోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఆయన సొంత సంస్థ. బన్నీ హీరోయే అయినప్పటికీ, తను కూడా సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటుంటాడు. సరైనోడు ఆడియో ఫంక్షన్లో, కొడుక్కి కాకపోతే ఇంకెవరికి ఖర్చు పెడతారు బాస్ అంటూ తమ సంస్థ మీదే బన్నీ చమత్కరించడం విశేషం.
6. శ్రేష్ట్ మూవీస్
యంగ్ హీరో నితిన్ హోం బ్యానర్ శ్రేష్ట్ మూవీస్. కేవలం తను నటించడమే కాక ఈ బ్యానర్లో బయటి హీరోలతో సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు నితిన్. ఇప్పటికే అక్కినేని వారసుడు అఖిల్ తో సినిమా తీశాడు కూడా. ఆ సినిమా ఫలితం కాస్త అటూ ఇటూ గా వచ్చినా, మళ్లీ తర్వాత సినిమా తన బ్యానర్లోనే చేస్తున్నాడు నితిన్.
7. యువీ క్రియేషన్స్
బాహుబలి ప్రభాస్ సొంత సంస్థ ఇది. తన పెదనాన్న కృష్ణంరాజు స్థాపించిన గోపీ కృష్ణా బ్యానర్ కూడా సొంతదే అయినప్పటికీ, తనకంటూ ఉండేలా, ఫ్రెండ్స్ తో కలిసి యువీ క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించాడు ప్రభాస్. సొంత సంస్థే అయినా, నిర్మాణ బాధ్యతల్ని పూర్తిగా స్నేహితులకే ఇచ్చాడు.ఈ బ్యానర్లోనే మిర్చి లాంటి కెరీర్ బ్లాక్ బస్టర్ ను కొట్టాడు మన బాహుబలి.
ఇది ఈ జనరేషన్ కు వచ్చిన కొత్త ఐడియా కాదు. చిరంజీవికి అంజనా ప్రొడక్షన్స్, నాగార్జున కు అన్నపూర్ణ, వెంకటేష్ కు సురేష్ ప్రొడక్షన్స్ తో సొంత సంస్థల్లో సినిమాలు చేశారు. తమ తమ బ్యానర్లకు భారీ హిట్స్ ఇచ్చి అండగా నిలబడ్డారు. వాళ్లను ఆదర్శంగా తీసుకుని మన కుర్రహీరోలు కూడా సినీ నిర్మాణంలో ముందుకు దూసుకుపోతున్నారు.