ENGLISH | TELUGU  

తెలుగు సినిమా 9 వండర్స్

on Oct 31, 2017

తెలుగు చిత్రసీమలో చరగని అద్భుతాలు కొన్ని ఉన్నాయ్. ఏళ్లు గడుస్తున్నా... వాటి పరిమళాలు మాత్రం పదిలంగానే ఉన్నాయ్. అలాంటి 9 వండర్స్ గురించి గురించి మనం చెప్పుకుందాం. 

1. తెలుగు చిత్రసీమలో 1947వ సంవత్సరంలో ఓ వింత జరిగింది. అదేంటంటే.. చిత్తూరు నాగయ్య ‘యోగి వేమన’  చిత్రం ఆ ఏడాదే విడుదలైంది. కె.వి.రెడ్డి దర్శకుడు. ఆ సినిమాను ఓ కుర్రాడు చూసి... అలా నడుచుకుంటూ వెళ్లిపోయి ఓ చోట కూర్చున్నాడు. అలాగే ఉండిపోయాడు. యోగిలా మారాడు. భక్తులతో పూజలందుకున్నాడు. అక్కడ ఆ కుర్రాడికి భక్తులు దేవాలయం కూడా నిర్మించారు. ఆ కుర్రాడే ‘బాలయోగి’ ఆ ఊరే ఉమ్మడివరం. ఇది తెలుగు సినిమా చరిత్రలో జరిగిన ఓ వింత. 

2. అక్కినేని ‘బాలరాజు’  సినిమా విడుదలైంది. జనాలు తండోపతండాలుగా సినిమా చూడటానికి ఎగబడ్డారు. ఆ రోజుల్లో తెలుగునేలపై సినిమా థియేటర్ల సంఖ్య తక్కువ. దాంతో ‘బాలరాజు’ విజృంభణ ముందు... ఉన్న కొద్ది థియేటర్లు తట్టుకోలేకపోయాయ్. దాంతో కేవలం ఆ సినిమా కోసమే కొన్ని థియేటర్లు కట్టడం జరిగింది. ఇది తెలుగు చిత్ర చరిత్రలో చరగని అపూర్వ ఘట్టం. 

3. ‘లవకుశ’ నేటికీ తెలుగువాళ్లు మరవలేని క్లాసిక్. తెలుగు చిత్ర చరిత్రలో జనాదరణతో అత్యధిక రోజులు ప్రదర్శించిన రికార్డ్ ఈ సినిమాదే. విడుదలైన ప్రతి థియేటర్లో శతదినోత్సరం జరుపుకోవడమే కాక.. అపూర్వ జనాదరణతో 450 రోజులు ప్రదర్శితమైందీ సినిమా. బళ్లు కట్టుకొని మరీ ఈ సినిమా చూసి పులకరించిపోయారు జనాలు. ఈ మధ్య రెండు సినిమాలు వెయ్యి రోజులు ప్రదర్శితమయ్యాయని పేపర్ ప్రకటనలు ఇచ్చారు. థియేటర్లలో కూడా డబ్బులిచ్చి ఆడించారు. ‘లవకుశ’ అలాంటి ఆడించిన బాపతు కాదు. నిఖాసైన రికార్డ్. చెరగని రికార్డు. 

4. ఇప్పుడున్న హీరోలందరూ ఏడాది ఒక సినిమానో.. లేక రెండు సినిమాలో చేస్తున్నారు. కానీ.. ఆ రోజుల్లో హీరోలు ఏడాది పది సినిమాలైనా చేసేవారు. ఆ విధంగా ఒకే ఏడాదిలో ఏకంగా 8 శతదినోత్సవ చిత్రాల్లో నటించిన ఘనత సొంతం చేసుకున్నారు మహానటుడు ఎన్టీయార్. ఇది భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఏ హీరో సాధించని రికార్డ్. 1965లో జరిగిన అద్భుతం ఇది. 

5. ఒకే ఏడాది ఒకే హీరో నటించిన మూడు సినిమాలు గోల్డెన్ జూబ్లీలు జరుపుకున్నాయ్. అంటే ఒక్కో సినిమా 365 రోజులు ఆడిందన్నమాట. ఇంతకీ ఆ హీరో ఎవరో చెప్పనేలేదు కదూ.. ఆయనే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీయార్. ఆ సినిమాలే దానవీరశూరకర్ణ, అడవిరాముడు, యమగోల. 1977లో జరిగిన వింత ఇది. 

6. విడుదలైన సినిమాలే సరిగ్గా ఆడని రోజులివి. ఒక వేళ హిట్ అయినా.. ఆ హడావిడంతా ఓ నెలనాళ్ల ముచ్చటే. కానీ.. ఒకప్పుడు అలా కాదు.. రిపీట్ రన్ లో కూడా బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమాలున్నాయ్. కన్యాశుల్కం, వరకట్నం, కంచుకోట, శ్రీకృష్ణ పాండవీయం, దానవీరశూరకర్ణ, బొబ్బిలిపులి..  ఇవన్నీ  రీపిట్ రన్ లో శతదినోత్సవాలు జరుపుకున్న సినిమాలే. ఇవన్నీ ఎన్టీయార్ సినిమాలే కావడం విశేషం. అలాగే.. కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం కూడా రిపీట్ రన్ లో వందరోజులు  ఆడింది. కానీ... రిపీట్ రన్ లో ఎక్కువ శతదినోత్సవాలు జరుపుకున్న హీరోగా ఎన్టీయార్ ది మాత్రం చెరిగిపోని రికార్డ్.

7. తాను సృష్టించిన రికార్డులను తానే బద్దలు చేయడం... అనేది చిరంజీవి స్పెషాలిటీ. ఈ ఫీట్ చిరంజీవి ఎన్నిసార్లు చేశాడో చూద్దాం. 1990లో ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ చిత్రం అప్పటి రికార్డులన్నింటినీ తిరగరాసి.. వసూళ్ల పరంగా,  కేంద్రాల పరంగా నంబర్ వన్ గా నిలిచింది. ఆ సినిమా రికార్డులన్నింటినీ ‘గ్యాంగ్ లీడర్’(1991)తో చిరంజీవే బద్దలు చేసేశాడు. మళ్లీ ఆ రికార్డులను ‘ఘరానా మొగుడు’(1992)తో బద్దలు బద్దలు చేసి.. మెగాస్టారా.. మజాకా! అనిపించాడు. ఇదే ఫీట్ ని మళ్లీ.. 1997 నుంచి కొనసాగించాడు మెగాస్టార్. ‘హిట్లర్’ చిత్రం అప్పటివరకూ చెరగకుండా ఉన్న ‘ఘరానా మొగుడు’ రికార్డును బద్దలు చేసింది. దాన్ని అదే ఏడాది వచ్చిన  ‘మాస్టర్’తో చిరంజీవే బ్రేక్ చేశాడు. ‘మాస్టర్’ రికార్డులన్నింటినీ.. ‘బావగారూ బాగున్నారా’తో చిరంజీవి బద్దలు చేయగా... ఆ సినిమా రికార్డులను కూడా ‘చూడాలని ఉంది’తో చిరంజీవే బ్రేక్ చేశాడు. ఇది నిజంగా చెరగని రికార్డు. 

8. 2001లో ‘నువ్వేకావాలి’ అనే సినిమా విడుదలైంది. ఉషాకిరణ్ మూవీస్ వారి ఈ సినిమా 19 కేంద్రాల్లో విడుదలై విడుదలైన అన్ని కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. 18 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ఆడింది. 17 కేంద్రాల్లో 200 రోజులు ఆడింది. దాదాపు 5 కేంద్రాల్లో ఏడాది ఆడింది. చిన్న సినిమాల్లో ఇదొక చరగని రికార్డ్. 

9. దక్షిణాదిలో తెరకెక్కిన ఓ ప్రాంతీయభాషా చిత్రం... బాలీవుడ్ చిత్రసీమను కూడా ఉలిక్కిపడేలా చేసింది. ఆ మాటకొస్తే.. ప్రపంచం మొత్తం ఆ సినిమా వంక చూసింది. 1750 కోట్ల వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా స్టామినాను ప్రపంచ యవనికపై నిలబెట్టింది. ఆ సినిమా ‘బాహుబలి ది కన్‌క్లూజన్’. తెలుగు సినిమా ముందెన్నడూ చూడని అద్భుతం ఇది. 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.