టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్ బాక్సాఫీస్ ఫైట్.. ఎన్నిసార్లు తలపడ్డారు? ఎవరిది పైచేయి?
on Feb 9, 2026
.webp)
వచ్చే సంక్రాంతి బరిలో నలుగురు సీనియర్ స్టార్లు
గతంలో ఈ ఫోర్ పిల్లర్స్ ఎన్నిసార్లు తలపడ్డారు?
ఎవరు పైచేయి సాధించారు?
ఒక్క హిట్ కూడా చూడని స్టార్ ఎవరు?
సీనియర్ స్టార్స్ చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna), వెంకటేష్ (Venkatesh), నాగార్జున(Nagarjuna)లను టాలీవుడ్ కి నాలుగు స్తంభాలుగా భావిస్తుంటారు. అలాంటి ఈ నలుగురు స్టార్స్.. ఒకేసారి బాక్సాఫీస్ బరిలో దిగితే ఎలా ఉంటుంది. 2027 సంక్రాంతికి అలాంటి అద్భుతమే జరిగేలా ఉంది.
బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిరంజీవి 158వ సినిమా (Mega 158), గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న బాలకృష్ణ 111వ సినిమా (NBK 111) సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకున్నాయి. ఇక వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రానున్న నాలుగో సినిమాని కూడా సంక్రాంతికి తీసుకురానున్నారు. నాగార్జున సైతం 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వెల్ తో 2027 సంక్రాంతి బరిలో దిగుతున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాని.. 2027 జనవరి 15న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
మొత్తానికి వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్ బాక్సాఫీస్ బరిలో దిగడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో గతంలో వీరు ఎన్నిసార్లు బాక్సాఫీస్ వార్ కి దిగారు? ఆ పోరులో ఎవరు పైచేయి సాధించారు? అనే చర్చ జరుగుతోంది.
టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్ ఇప్పటిదాకా మూడుసార్లు మాత్రమే క్లాష్ కి రావడం విశేషం. మొదటిసారి 1986లో వీరి మధ్య బాక్సాఫీస్ వార్ జరిగింది. నాగార్జున, వెంకటేష్ అప్పుడప్పుడే కెరీర్ ప్రారంభించగా.. బాలకృష్ణ, చిరంజీవి అప్పటికే హీరోలుగా నిలదొక్కుకున్నారు. ఆగస్టు 7, 1986న బాలకృష్ణ 'దేశోద్ధారకుడు' విడుదలవ్వగా.. ఆ తర్వాత వారం వారం గ్యాప్ తో వెంకటేష్ 'కలియుగ పాండవులు', చిరంజీవి 'చంటబ్బాయ్', నాగార్జున 'కెప్టెన్ నాగార్జున' సినిమాలు విడుదలయ్యాయి. మొదటి పోరులో బాలకృష్ణ, వెంకటేష్ విజయాలు చూడగా.. చిరంజీవి, నాగార్జున పరాజయాలు చూశారు. ఆ తర్వాతి కాలంలో 'చంటబ్బాయ్' కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్నప్పటికీ.. థియేటర్లలో మాత్రం కమర్షియల్ సక్సెస్ చూడలేదు.

రెండోసారి 1987లో ఈ నలుగురు హీరోలు తలపడ్డారు. 1987, జూలై 23న 'పసివాడి ప్రాణం'తో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రాగా.. జూలై 31న 'రాము'తో బాలకృష్ణ, ఆగష్టు 12న 'అగ్ని పుత్రుడు'తో నాగార్జున, ఆగష్టు 14న 'విజేత విక్రమ్'తో వెంకటేష్ రంగంలోకి దిగారు. ఈ పోరులో చిరంజీవి ఇండస్ట్రీ హిట్ అందుకోగా, బాలకృష్ణ సాధారణ హిట్ తో సరిపెట్టుకున్నారు. నాగార్జున, వెంకటేష్ మాత్రం ఫ్లాప్స్ ని చూశారు.
.webp)
పదేళ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి 1997లో ఈ నలుగురు స్టార్స్ బాక్సాఫీస్ ఫైట్ కి దిగారు. 1997 అక్టోబర్ 3న చిరంజీవి 'మాస్టర్' విడుదలవ్వగా.. అక్టోబర్ 9న వెంకటేష్ 'పెళ్లి చేసుకుందాం', అక్టోబర్ 23న బాలకృష్ణ 'దేవుడు', అక్టోబర్ 30న నాగార్జున 'రక్షకుడు' రిలీజ్ అయ్యాయి. ఈ పోరులో చిరంజీవి, వెంకటేష్ సక్సెస్ చూడగా.. బాలకృష్ణ, నాగార్జునలకు నిరాశ ఎదురైంది.

ఇలా మొత్తం మూడుసార్లు తలపడగా.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తలా రెండు విజయాలను ఖాతాలో వేసుకున్నారు. నాగార్జునకు మాత్రం మూడుసార్లూ నిరాశే ఎదురైంది.
ఏకంగా మూడు దశాబ్దాల తర్వాత.. 2027 సంక్రాంతికి టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్ మళ్ళీ బాక్సాఫీస్ వార్ కి సై అంటున్నారు. ఈ నలుగురూ ఒకేసారి సంక్రాంతి బరిలో నిలవడం ఇదే మొదటిసారి. సంక్రాంతి సెంటిమెంట్ కలిసొచ్చి నాగార్జున ఈసారైనా విజయాన్ని ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



