మంచు విష్ణు కనిపించుట లేదు! ఆరా తీస్తున్న టాలీవుడ్ వర్గాలు!!
on Dec 27, 2021

ఆ మధ్య జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై పోటీపడి మంచు విష్ణు విజయం సాధించిన అధ్యక్షుడిగా ఎన్నికైన ఎపిసోడ్ అంతా చాలా రోజుల పాటు వార్తల్లో నలిగిన విషయం మనకు తెలుసు. ఈ ఎన్నికల సందర్భంగా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయిందేమో అన్నంత హడావిడి జరిగింది. తను అధ్యక్షుడిగా ఎన్నికైతే మా కళాకారులకు తానేం చేస్తాడనే దానిపై విష్ణు పలు వాగ్దానాలు చేశారు. టాలీవుడ్ అభివృద్ధికి కంకణం కట్టుకున్నట్లు మాట్లాడారు.
ఈరోజున తెలుగు చిత్రపరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటోందనేది అత్యధికుల అభిప్రాయం, నమ్మకం. అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు నింగినంటుతున్న కాలంలో సినిమా బడ్జెట్ కూడా అందుకు అనుగుణంగా విపరీతంగా పెరిగిపోయింది. దానికి తగ్గట్లుగా సినిమా టికెట్ ధరలను నిర్ణయించుకొనే వెసులుబాటును కల్పించాల్సిన ప్రభుత్వం ఏపీలో అందుకు పూర్తి విరుద్ధంగా ఇప్పటిదాకా ఉన్న ధరలను పెంచుకొనే వెసులుబాటు కల్పించడం పోయి, మరింతగా తగ్గించడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు. మొత్తంగా ఇది చిత్ర పరిశ్రమ నడ్డి విరిగే చర్యగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
పేదవాడికి అందుబాటులో సినిమా వినోదాన్ని కల్పిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. కానీ మిగతా అన్ని వస్తువుల ధరలను నియంత్రించే పనిచేయకుండా, కేవలం సినిమా టికెట్ ధరల విషయంలోనే ఇలా వ్యవహరిస్తుండటంతో, కావాలనే కక్షకట్టి సినిమా ఇండస్ట్రీని సంక్షోభంలోకి నెట్టాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వ్యవహరిస్తోందనే అభిప్రాయం వ్యాపించింది. టికెట్ ధరలను భారీ స్థాయిలో తగ్గించడం వల్ల, థియేటర్ల మెయింటెనెన్స్‌కే ఆదాయం సరిపోదనీ, ఇక సినిమా ఆడించడం వల్ల తమకు లాభం అనేది గగనమైపోతోందనీ, ఈ పరిస్థితుల్లో థియేటర్లు నడపడం తమవల్ల కాదనీ ఎగ్జిబిటర్లు లబలబలాడుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా థియేటర్లు మూతపడుతున్న సమాచారం అందుతోంది. మరోవైపు ఉన్న థియేటర్లలో వైయస్ జగన్ ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు తనిఖీలు, సోదాలను ముమ్మరం చేశారు. దీంతో ములిగే నక్క మీద తాటి పండు పడిన చందంగా తయారైందని థియేటర్ల యజమానులు వాపోతున్నారు.
ఇటువంటి తనిఖీలు, ఇలాంటి తగ్గింపు రేట్లు గతంలో తామెన్నడు చూడలేదంటూ సినిమా థియేటర్ల యజమానులు బెంబేలేత్తిపోతున్నారు. ఆంధ్ర్రప్రదేశ్‌లో ఇంత జరుగుతున్నా మూవీ ఆర్టిస్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో మంచు విష్ణు ఏం చేస్తున్నారని సినిమా ప్రియులు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై మంచు విష్ణు కనీసం స్పందించ లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తండ్రి మోహన్ బాబు... టాలీవుడ్‌లో అత్యంత సీనియర్ నటుల్లో ఒకరు. ఆయన పెద్దరికం తీసుకోకుండా ఇలా సైలెంట్‌గా ఉండిపోవడం వెనుక ఆంతర్య ఏమిటని తెలుగు ప్రజలు రగిలిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి మా బావ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... తనకు మంచి స్నేహితుడు, ప్రధాని నరేంద్ర మోదీతో తమకు సన్నిహిత సంబంధాలున్నాయంటూ మూవీ ఆర్టిస్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా మంచు విష్ణు వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్వూల్లో స్వయంగా పేర్కొన్నారు. మరోవైపు 'మా' ఎన్నికల్లో గెలుపు కోసం మంచు ఫ్యామిలీ సభ్యులంతా ఎంతగా శ్రమించారో అందరికీ తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 'మా' సభ్యులందరినీ ఓ తాటిపైకీ తీసుకు రావడమే కాకుండా... వారందరినీ వివిధ మార్గాల్లో హైదరాబాద్ తీసుకు వచ్చి.. వారితో ఓటు వేయించడంలో మంచు ఫ్యామిలీ వందకు వంద శాతం సఫలీకృతమైంది. ఎన్నికల్లో గెలుపు కోసం ఇంత చేసిన వీరు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమకు చేటుచేసే పరిణామాలపై ఇంత సైలెంట్‌గా ఉండడం ఏమిటని ఈ తండ్రీ కొడుకులను ఆంధ్రప్రదేశ్ ప్రజలు బల్లగుద్ది మరీ సూటిగా ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా.. ఈ వ్యవహారం 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుకు వినపడం లేదా.. కనపడడం లేదా అంటూ తెలుగు ప్రజలు సోషల్ మీడియా సాక్షిగా కామెంట్స్ పెడుతున్నారు. 'మా' అధ్యక్షుడు అయిన తర్వాత మంచు విష్ణు టాలీవుడ్ సమస్యలపై ఒక్క సారి కూడా సమావేశం నిర్వహించిన దాఖలా లేదని ఫిలింనగర్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అసలు మంచు విష్ణు.. ఫిలింనగర్‌లోనే ఉన్నాడా లేక.. ఎక్కడికైనా వెళ్లిపోయాడా?.. ఉంటే ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటేకే స్పందించి ఉండే వాడని.. కానీ మంచు విష్ణు కనిపించుటలేదని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



