దిల్ రాజుతో నితిన్ తండ్రి గొడవ?
on Jan 25, 2020
నితిన్, రష్మికా మందన్న జంటగా నటిస్తోన్న 'భీష్మ' సినిమా వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విషయంలో ఏం చేయాలో పాలుపోక దాని నిర్మాత తల పట్టుకుంటున్నాడు. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇది హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ సంస్థకు సిస్టర్ కంపెనీ లాంటిది. ఈ సంస్థల సినిమాలను నైజాం, ఉత్తరాంధ్ర ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్‌ను మొదట్నుంచీ దిల్ రాజు చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు 'భీష్మ' సినిమా ఉత్తరాంధ్ర హక్కుల్ని తనకు ఇవ్వాలంటూ నితిన్ తండ్రి, గ్లోబల్ సినిమాస్ అధినేత సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగడం ఇటు దిల్ రాజుకూ, అటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కూ తలనొప్పిగా మారింది. ఫిబ్రవరి 21న 'భీష్మ'ను రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మేకింగ్‌లో ఉండగానే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ వచ్చింది. బిజినెస్ సర్కిల్స్‌లోనూ దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటికే నైజాం, ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్ కోసం నిర్మాతలతో దిల్ రాజు 8.5 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇందులో నైజాం వాటా 6.5 కోట్లు కాగా, ఉత్తరాంధ్ర వాటా 2 కోట్లుగా తెలిసింది. అయితే ఇప్పుడు సుధాకర్ రెడ్డి ఉత్తరాంధ్రకు దిల్ రాజు ఇస్తానన్న అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ ఇస్తాననీ, ఆ ఏరియా హక్కుల్ని తనకు ఇవ్వాలనీ ముందుకు వచ్చినట్లు వినికిడి. దీంతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న దిల్ రాజుకే వాటిని ఇవ్వాలా లేక ఎక్కువ ధర చెల్లిస్తామంటున్న సుధాకర్ రెడ్డికి ఇవ్వాలా అని నిర్మాత నాగవంశీ డైలామాలో పడ్డాడని చెప్పుకుంటున్నారు. చివరికి ఈ వ్యవహారం ఎలా ముగుస్తుందో చూడాలి.