నాపై దాడిచేసి, చంపడానికి ప్రయత్నించారు.. రాకేశ్ మాస్టర్ కంప్లయింట్!
on May 4, 2021
ఆమధ్య రాకేశ్ మాస్టర్ తన వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచారు. ఎవరి మీదనైనా కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాలు తెలియజేస్తూ రావడం వల్ల వివాదాలు కూడా తలెత్తాయి. ఇటీవల వాటిని పక్కనపెట్టి జబర్దస్త్‌లో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. లేడీ గెటప్పులతోనూ ఆకట్టుకుంటూ, తనలో మంచి నటుడు కూడా ఉన్నాడని ప్రపంచానికి తెలియజేశారు. లేటెస్ట్‌గా ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తనపై కొంతమంది దాడిచేసి, హత్యాయత్నం చేశారంటూ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.
రాకేశ్ మాస్టర్ అసలు పేరు ఎస్. రామారావు. కొంతమంది వ్యక్తులు తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి, తనను నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, కిటికీలు ధ్వంసం చేశారనీ, తనను చంపేందుకు ప్రయత్నించారనీ పేర్కొంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. సాయి యాదవ్, ఇమ్రాన్ అనే వ్యక్తులు, మరికొంతమందిని వెంటపెట్టుకొని కృష్ణానగర్‌లోని దేవేందర్ గౌడ్ అపార్ట్‌మెంట్స్‌లోని తన ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి దాడి చేశారని తన ఫిర్యాదులో ఆయన ఆరోపించారు.
వారు తనపై ఎందుకు దాడిచేశారనే కారణాన్ని కూడా తన ఫిర్యాదులో ఆయన వెల్లడించారు. తొమ్మిది నెలల క్రితం ఓ యూట్యూబ్ చానల్‌కు తాను ఇంటర్వ్యూ ఇచ్చాననీ, దానికి సంబంధించే వారు తనపై దాడి చేశారనీ రాకేశ్ మాస్టర్ తెలిపారు. తనపై దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read