ENGLISH | TELUGU  

కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’, విష్ణు ‘కన్నప్ప’ మధ్య ఉన్న తేడా అదే!

on Mar 13, 2025

పురాణ ఇతిహాసాల్లో భక్త కన్నప్పది ఒక ప్రత్యేక స్థానం. ఒక మారుమూల గూడేనికి చెందిన తిన్నడు అనే అడవి మనిషి.. శివభక్తుడుగా మారి చరిత్ర పుటల్లో తనకంటూ ఓ పేజీని ఎలా సృష్టించుకున్నాడు అనేది అందరికీ ఆసక్తిని కలిగించే అంశం. మహాకవి దూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం నుంచి భక్త కన్నప్ప జీవిత చరిత్రను సేకరించి దానిపై ఎన్నో పుస్తకాలు రాశారు. తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లో కన్నప్ప చరిత్రను తెరకెక్కించారు. మనకు తెలిసి ఇప్పటివరకు కన్నప్ప పాత్రలో జీవించిన వారు రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌. బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు నటించి, నిర్మించిన ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అలాగే కన్నడలో రూపొందిన ‘శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం’ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేశారు. ఆ చిత్రంలో రాజ్‌కుమార్‌ నటనను తెలుగు వారు సైతం ప్రశంసించారు. భక్తి సినిమాల్లో కన్నప్ప చిత్రానికి ఓ విశిష్టమైన స్థానం ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

దర్శకనిర్మాతల మాటల్లో చెప్పాలంటే.. అద్భుతమైన క్లాసిక్స్‌గా పేరు తెచ్చుకున్న సినిమాలను రీమేక్‌ చెయ్యాలని ప్రయత్నించకూడదు. అసలు దాన్ని టచ్‌ చేయకూడదు అంటారు. కానీ, ఆ సాహసాన్ని తెలుగు హీరో మంచు విష్ణు చేశారు. కన్నప్ప జీవితాన్ని మరోసారి తెరకెక్కించాలన్న ఆలోచన పది సంవత్సరాల క్రితమే అతనిలో మొదలైంది. కన్నప్ప జీవితాన్ని పరిశీలించారు. మరింత సమాచారం కోసం పరిశోధన చేశారు. తనే సొంతంగా కథ రాసుకున్నారు. దానిపై ఎంతో మంది రచయితలు రీసెర్చ్‌ చేసి కథకు ఒక రూపాన్ని తీసుకొచ్చారు. అంతేకాదు, స్క్రీన్‌ప్లే విషయంలో కొందరు హాలీవుడ్‌ రచయితల సహకారాన్ని కూడా తీసుకున్నారు. మంచు విష్ణు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న సినిమా ‘కన్నప్ప’. అంతేకాదు, విష్ణు తొలిసారి పాన్‌ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని సినిమాలో పలు భాషలకు చెందిన స్టార్స్‌ని ఇన్‌వాల్వ్‌ చేశారు. ప్రభాస్‌, అక్షయ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, శరత్‌కుమార్‌ వంటి స్టార్స్‌ ‘కన్నప్ప’ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడ్డాయి. ఇప్పటికే ఇండియాలోని పలు భాషల్లో కన్నప్ప జీవితం గురించి 6 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా వస్తున్న ‘కన్పప్ప’లో ఏం చెప్పబోతున్నారు? తెలుగులో ఓ క్లాసిక్‌గా చెప్పబడుతున్న ‘భక్త కన్నప్ప’కి, ‘కన్నప్ప’కి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఈ సినిమాలో కొత్తగా చూపించబోతున్న అంశాలేమిటి? అనే విషయాల గురించి తెలుసుకుందాం. 

1976లో కృష్ణంరాజు, బాపు కాంబినేషన్‌లో ‘భక్త కన్నప్ప’ చిత్రం వచ్చింది. ఈ సినిమా విడుదలై దాదాపు 50 సంవత్సరాలు కావస్తోంది. అప్పటికి అందుబాటులో ఉన్న సమాచారంతో బాపు, రమణలు కన్నప్ప జీవితాన్ని తెరపై ఆవిష్కరించారు. ఇప్పటి తరం ప్రజలకు కన్నప్ప గురించి సరైన అవగాహన లేదు. పైగా ఈ 50 సంవత్సరాల్లో ఆయన చరిత్రకు సంబంధించిన అనేక కొత్త అంశాలు బయటికి వచ్చాయి. ఆ అంశాలను ‘కన్నప్ప’ సినిమాలో ప్రస్తావించబోతున్నారు. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో కన్నప్ప జీవించాడని చరిత్ర చెబుతోంది. అయితే కొత్తగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే.. 7వ శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్య రచించిన శివానందలహరిలో మాంసాన్ని నైవేద్యంగా పెట్టిన అడవి మనిషి అనే విషయాన్ని ఒక శ్లోకంలో ప్రస్తావించారు. దాన్ని బట్టి కన్నప్ప 7వ శతాబ్దానికి ముందు వాడని అర్థమవుతుంది. అలాగే శివాలయంలో పూజారిగా ఉన్న కైలాసనాథ శాస్త్రి అవినీతి పరుడని, స్త్రీ లోలుడని ప్రచారంలోకి తీసుకొచ్చారు. చరిత్రలో దొర్లిన పొరపాటుల్లో అది కూడా ఒకటని తెలుస్తోంది. నిజానికి అతను పరమభక్తుడని, నిజాయితీ పరుడని కన్నప్పలో చూపించబోతున్నారు. 

‘భక్త కన్నప్ప’ చిత్రంలో తిన్నడు ఒక గూడేనికి పరిమితమైనవాడిగా చూపించారు. కన్నప్పలో ఐదారు గూడేలకు సంబంధించిన కథ ఉంటుంది. తిన్నడి తండ్రి నాథనాథుడు గూడెం నాయకుడిగా చేసే కార్యక్రమాలను కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఇతర దేశాలకు చెందిన ఎంతో మంది రాజులు భారతదేశంపై దాడి చేసి మన సంపదను పలు మార్లు దోచుకెళ్లారు. ఆ క్రమంలోనే మనదేశంలో ప్రసిద్ధమైన పంచలింగాల గురించి తెలుసుకొని వాటిని హస్తగతం చేసుకునేందుకు విఫల యత్నం చేశారు. అంతేకాదు, అత్యంత మహిమ కలిగిన వాయులింగం కూడా వారి దృష్టిలో పడింది. దాన్ని తస్కరించేందుకు విదేశీయులు ప్రయత్నాలు చేశారు. ‘కన్నప్ప’ చిత్రం ఒక భక్తుడి జీవిత చరిత్రే అయినప్పటికీ కథ మొత్తం ఆ వాయులింగం చుట్టూనే తిరుగుతుంది. కన్నప్ప చిత్రానికి సంబంధించి ఇది కూడా ఒక కొత్త అంశమే. ఇలా.. భక్త కన్నప్పలో మనం చూడని, మనకి తెలియని ఎన్నో అంశాలు ఈ ‘కన్నప్ప’ చిత్రంలో చూడబోతున్నాం. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.