ఏఎన్నార్ అవార్డ్స్ లో 'తెలుగు మాష్టారు'కి దక్కిన గౌరవం
on Feb 3, 2020
యువ కళావాహిని, సారిపల్లి కొండలరావు, ఏవీకే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అక్కినేని లఘు చిత్రోత్సవాల పోటీలు శనివారం సారధి స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఎందరో యువకులు తమ ప్రతిభను నిరూపించుకోవడం కోసం ఈ పోటీలో పాల్గొన్నారు. తమ ప్రతిభతో మెప్పించిన వారిని అవార్డులు వరించాయి. అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె నాగ సుశీల చేతుల మీదుగా.. యువ దర్శకులు, కళాకారులు అవార్డులు అందుకున్నారు. ఈ పోటీలలో ఉత్తమ్ లఘు చిత్రంగా 'బ్యూటిఫుల్ లైఫ్', ఉత్తమ ద్వితీయ చిత్రంగా 'తెలుగు మాష్టారు', ఉత్తమ తృతీయ చిత్రంగా 'అడుగు' చిత్రాలు ఎంపికయ్యాయి.
ఉత్తమ ద్వితీయ చిత్రంగా ఎంపికైన 'తెలుగు మాస్టారు' షార్ట్ ఫిల్మ్ ని తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్ నిర్మించగా.. సురేష్ రాజ్ భోగమోని దర్శకత్వం వహించారు. తెలుగుభాష కొనఊపిరితో కన్నీళ్లు పెట్టుకుంటున్న వేళ.. ఓ తెలుగుమాస్టారు పడే ఆవేదనను.. దర్శకుడు మనస్సుకి హత్తుకునేలా చూపించాడు. 'తెలుగు బాష చనిపోయేరోజు వస్తే అంతకన్నా ముందే నేను చచ్చిపోతాను' అంటూ పిల్లజమీందార్ మూవీలో తెలుగు లెక్చరర్ గా నటించిన ఎంఎస్ నారాయణ కన్నీళ్లు పెట్టిస్తారు. అలాంటి అనుభూతినే ఈ షార్ట్ ఫిల్మ్ పంచుతుంది. ప్రస్తుతం తెలుగు బాష పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. రోజురోజుకి తెలుగుని మర్చిపోతున్నారు. దీంతో తెలుగుని ప్రేమించేవారు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తెలుగుమాష్టార్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కళ్ళముందే అమ్మలాంటి బాష మరుగున పడిపోతుంటే తట్టుకోలేకపోతున్నారు. అలాంటి ఒక తెలుగుమాష్టారు ఆవేదననే.. దర్శకుడు కళ్ళకి కట్టినట్టు చూపించాడు. 'తెలుగుమాస్టారు' షార్ట్ ఫిల్మ్ ద్వారా 'భాష బ్రతికుంటేనే జాతికి గౌరవం' అనే అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు.