వెండితెర ప్రేమకావ్యాలు (వాలంటైన్స్ డే స్పెషల్)
on Feb 13, 2017
ప్రేమ నిర్వచనానికి అందని పదం..ఎవరికి..? ఎప్పుడు..? ఎక్కడ కలుగుతుందో తెలియని అనుభూతుల సమ్మేళనం..మనిషి మనసులోని ఆలోచనల అంతరంగం నుంచి అంకురించిందే ప్రేమ..ప్రతి పురుషుడు, స్త్రీని చూసి ఆమె కోసం పరితపించడమన్నది ప్రకృతి సిద్ధమైనది..ఇందుకోసం ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడం, ఒకరి ఆలోచనల్ని మరొకరు పంచుకోవడం, ఇవన్నీ ఒక్కటైతే దానినే ప్రేమగా మనం చెప్పుకోవడం జరుగుతుంది.
కానీ ప్రతి మనిషికి గుండె గుప్పెడంత ఉంటుంది..తను ఎంతగా ప్రేమించినా అది గుప్పెడులోనే ఇముడుతుంది. చారిత్రక, పౌరాణిక గాథల్ని ఇలా ఏ సందర్భాన్ని వదలని మన దర్శకనిర్మాతలు ఎన్నో ప్రేమకథల్ని వెండితెర కావ్యాలుగా మలిచారు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఇలాంటి ఎన్నో కథల్ని మనం చూసి..ఆ కథలో మనల్ని మనం ఊహించుకున్నాం..తెలుగు సినిమా కూడా ఇలాంటి ఎన్నో అపురూపమైన కథల్ని మనకు అందించింది. నాటి దేవదాసు నుంచి నేటి ప్రేమమ్ వరకు ఇలాంటివి ఎన్నో..ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వాటిలో కొన్ని మీకోసం.
దేవదాసు:
తెలుగునాట ప్రేమకథా చిత్రాల్లో శిఖరంగా చెప్పుకునే సినిమా దేవదాసు..ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్‌చంద్ర రాసిన నవల ఆధారంగా వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆల్‌టైమ్ హిట్. దేవదాసుగా ఏఎన్నార్, పార్వతిగా సావిత్రిల నటన అద్భుతం. మందుసీసా పట్టుకుని, భుజం మీద కండువాతో, తోడుగా కుక్కపిల్లతో విషాద గీతం పాడే సన్నివేశాన్ని తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మరచిపోరు.
అనార్కలి:
ప్రేమను పెద్దలు కాదనడం ఇప్పుడే కాదు..చరిత్రలో ఇందుకు ఉదాహరణలు ఎన్నో..అలాంటి వాటిలో ఒకటి సలీం-అనార్కలి కథ ఒకటి. అంజలీ పిక్చర్స్ బ్యానర్స్‌పై ఆదినారాయణరావు నిర్మాణంలో..వేదాంతం రాఘవయ్య తెరకెక్కించిన అనార్కలి తెలుగువారికి మరో ప్రేమ కావ్యంగా నిలిచింది. 1953లో హిందీలో వచ్చిన అనార్కలికి తెలుగు రీమేక్‌గా రూపొందించిన ఈ సినిమా ఇక్కడ కూడా విజయ ఢంకా మోగించింది. అక్బర్‌గా ఎస్వీఆర్, సలీమ్‌గా ఏఎన్నార్, అనార్కలిగా అంజలీ దేవి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ప్రేమనగర్:
అక్కినేని నాగేశ్వరరావు, మూవీ మొగల్ రామానాయుడులను టాలీవుడ్‌లో నిలబెట్టిన సినిమా ప్రేమ్‌నగర్. ఎంతటి మగాడినైనా మార్చగల శక్తి స్త్రీకి ఉందని చాటిచెప్పింది ఈ సినిమా. అక్కినేని, వాణిశ్రీల నటన, కేవీ మహాదేవన్ బాణీలు, కేఎస్ ప్రకాశ్‌రావ్ దర్శకత్వ ప్రతిభ సినిమాను సూపర్‌హిట్ చేశాయి.
గీతాంజలి:
వరుస సూపర్‌హిట్లతో దూసుకుపోతున్న నాగార్జునను లవర్‌బాయ్‌గా మార్చిన సినిమా గీతాంజలి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను రోటీన్‌కు భిన్నంగా, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే ప్రేమ కావ్యంగా మలిచాడు. నాగ్, గిరిజా షెట్టర్ నటన, పాటలు ఈ సినిమాకు మేజర్ అడ్వాంటేజ్‌గా నిలిచాయి.
మజ్ను:
నాగార్జునలోని నటుడిని పూర్తి స్థాయిలో బయటకు తీసిన సినిమా మజ్ను. విషాదంతో కూడిన ఆ ప్రేమకథా చిత్రంలో నాగ్ జీవించారు. ఒకదశలో సినిమాలకు పనికిరాడు అని నాగార్జునను విమర్శిస్తున్న సమయంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌హిట్టై..నాగ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఈ చిత్రంలోని ఊర్వశి రావే సాంగ్ ఇప్పటికీ వినిపిస్తుంటుంది.
ప్రేమ:
ఫ్యామిలి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విక్టరీ వెంకటేశ్ ప్రేమ సినిమాలో తనలోని భగ్నప్రేమికుడిని బయటకు తీశారు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాటలు ఆల్‌టైమ్ సూపర్‌హిట్
తొలి ప్రేమ:
కరుణాకరన్ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్, కీర్తిరెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన తొలిప్రేమ అప్పట్లో ఒక సెన్షేషన్. చదువులో వెనుకబడ్డ కుర్రాడు అనుకోకుండా ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు..ఇలా వీరిద్దరి మధ్య కథ, కథనం ఎన్నో మలుపులు తిరిగి చివరికి బాలుకి అను తన ప్రేమను తెలియజేయడంతో కథ సుఖాంతం అవుతుంది.
ప్రేమికుల రోజు:
కదిర్ దర్శకత్వంలో కునాల్, సోనాలి బెంద్రే హీరో హీరోయిన్లుగా వచ్చిన ప్రేమికుల రోజు..వాలెంటైన్స్ డే అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది ఈ సినిమానే. చదువుకోవడానికి ముంబై వచ్చిన కుర్రాడు ప్రేమలో పడి చివరికి తనకు ఇష్టమైన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడా అన్నదే కథ. ఈ సినిమాలోని సాంగ్స్ ఆల్‌టైమ్ హిట్.
తాజ్ మహల్:
అప్పుడప్పుడే అడుగులు వేస్తోన్న శ్రీకాంత్‌ను హీరోగా నిలదొక్కుకునేలా చేసిన సినిమా తాజ్‌మహల్. మూవీమొగల్ రామానాయుడు గారు ఈ సినిమా ద్వారా ముప్పలనేని శివను దర్శకుడిగా, మౌనిక బేడిని హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేశారు. ఒక గొప్పింటి అబ్బాయి..పేదింటి అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడన్నదే కథ.
ప్రేమదేశం:
ట్రయాంగిల్ లవ్‌స్టోరిస్‌లో ట్రెండ్ సెట్టర్ లాంటి సినిమా ప్రేమదేశం. ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రాణాలకన్నా ప్రేమించడం..స్నేహాం, ప్రేమల యొక్క గొప్పదనాన్ని అద్బుతంగా ఆవిష్కరించాడు దర్శకుడు కదిర్. అబ్బాస్, వినీత్, టబూల నటన, పాటలు అప్పటి యువతరాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.