సరిలేరు నీకెవ్వరు: 'సూర్యుడివో చంద్రుడివో' సాంగ్ రివ్యూ
on Dec 9, 2019
"సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరీ కలయికవో
సారధివో వారధివో మా ఊపిరీ కన్న కలవో
విశ్వమంత ప్రేమ పండించగా పుట్టుకైన రుషివో
సాటివారికై నీ వంతుగా ఉద్యమించు కృషివో
మా అందరిలో ఒకడైన మనిషివో"..
అంటూ సాగే ఈ పాట సూపర్‌స్టార్ మహేశ్ నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోనిది. సరిగ్గా వారం క్రితం టి-సిరీస్ రిలీజ్ చేసిన మాస్ సాంగ్ 'మైండ్ బ్లాక్' లిరికల్ వీడియో ఇప్పటి దాకా 11 మిలియన్ వ్యూస్ సాధించగా, ఇప్పుడు రెండో పాటను లహరి మ్యూజిక్ యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. మెలోడియస్‌గా సాగిన 'సూర్యుడివో చంద్రుడివో' పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, బి. ప్రాక్ పాడాడు. విన్నకొద్దీ బాగున్నట్లనిపించే ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన బాణీలు మొదటి పాటకంటే బాగున్నాయనిపిస్తోంది. మహేశ్ క్యారెక్టరైజేషన్ ఏమిటనేది ఈ పాట సాహిత్యం తెలియజేస్తోంది. ఆ పాత్ర గుణగణాల్నీ, గొప్పదనాన్నీ ఈ పాట తెలియజేస్తోంది. అటు సూర్యుడితోనూ, ఇటు చంద్రుడితోనూ పోలుస్తూ ఆ ఇద్దరి కలయికలా ఉన్నాడని చెప్పడం చూస్తుంటే.. సూర్యుడిలోని తీక్షణత, చంద్రుడిలోని చల్లదనం.. రెండూ ఉన్న అసామాన్యుడిగా మహేశ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. అంటే ప్రేమించేవారికి చల్లదనం పంచే ప్రేమమూర్తిగా, దుషుటుల పాలిట చండ్రనిప్పులు కురిపించే ధీరుడిగా ఆ క్యారెక్టర్‌ను డైరెక్టర్ మలుస్తున్నాడన్న మాట. అంతేనా.. అందరిలో ఒకడిగా ఉంటూనే సాటివారికోసం ఉద్యమించే బాధ్యత ఉన్న యువకుడు కూడా.
"గుండెలోతులో గాయం నువ్వు తాకితే మాయం
మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం
పొలమారే ఆశల కోసం పొలిమేరలు దాటొచ్చావు
తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు
అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే
మాలో పలికే మాటలు చాలవు"..
అనే పల్లవి ప్రకారం గాయపడ్డ హృదయాలకు ఆపన్న హస్తాన్నందించే మానవతా మూర్తిగా అతను దర్శనమిస్తున్నాడు. ఆశలు వదిలేసుకున్న వాళ్లకు వెలుగులు పంచడానికి పొలిమేరలు దాటి వచ్చాడని, అడగకుండానే వాళ్ల అవసరాలు తీరుస్తున్నాడనీ ఈ పాట తెలియజేస్తోంది. అతడిలోని మంచిని పొగిడేందుకు కూడా వాళ్లకు మాటలు చాలడం లేదని చెప్పడమంటే.. నాయకుడిగా వాళ్ల హృదయాలను అంతగా గెలుచుకున్నాడని అర్థం.
"దేవుడెక్కడో లేడూ వెరె కొత్తగా రాడూ
మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకు లాగా
ఏ లోక కల్యాణాన్ని ఆశించి జన్మిచ్చిందో
నిను కన్న తల్లి కడుపు నిండార పండింది
నీ లాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం
నీ పయనానికి జయహో అన్నదీ"..
అనే పల్లవితో మహేశ్ పాత్ర గొప్పదనాన్ని మహోన్నత స్థాయికి తీసుకుపోయాడు రచయిత. దేవుడనే వాడు ఎక్కడో ఉండడనీ, అతడిలాగా గొప్ప మనసున్న మనిషిలాగా దర్శనమిస్తాడనీ చెబుతున్నారు. ఏదో గొప్ప ఉద్దేశంతోనే అతడి తల్లి అతడికి జన్మనిచ్చిందనీ, అలాంటి కొడుకును మోసే భరత భూమి సైతం అతడి జర్నీకి జై కొడుతుందనీ ఈ పాటతో జేజేలు పలికారు. అయితే ఈ పల్లవిలో 'జన్మిచ్చిందో' అనే ప్రయోగం సరైనదేనా? మనకు తెలిసినంతవరకు 'జన్మనిచ్చిందో' అనే ప్రయోగం సరైనది. ట్యూన్‌కు తగ్గట్లు ఆ మాటను అలా కుదించారనుకోవాలి.
సాంగ్ స్టార్టింగ్‌లో "మా ఊపిరి కన్న కలవో" అనేటప్పుడు సింగర్ ప్రాంక్ వాయిస్ కాస్త ఇబ్బందిగా అనిపించింది. క్రమేణా తన బేస్ వాయిస్‌తో అతడు ఆకట్టుకున్నాడు. కీబోర్డ్, రిథం, బాస్, గిటార్, షెహనాయి, సితార్, ఫ్లూట్ వంటి వాద్య పరికరాలతో ఈ పాటను కంపోజ్ చేశాడు దేవి. 'రంగస్థలం' తర్వాత ఆ స్థాయిలో ట్యూన్స్ రావట్లేదనే ఫిర్యాదును దేవి ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో 'సూర్యుడివో చంద్రుడివో' సాంగ్ అతడికి ఊరటనివ్వవచ్చని భావించవచ్చు. సాహిత్యపరంగా ఉన్నత స్థాయిలో ఉన్న ఈ పాటను తెలుగు గాయకుడు పాడితే గొంతులో భాషాదోషాలు దొర్లకుండా మరింత న్యాయం జరిగేదనిపించింది.
మొత్తానికి ఈ పాటతో 'సరిలేరు నీకెవ్వరు' అంటే టైటిల్‌కు తగ్గట్లే అతని క్యారెక్టర్ ఒక గొప్ప వ్యక్తిత్వంతో అందర్నీ ఆకట్టుకుంటుందనేది స్పష్టం. ఈ పాటను విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో, పచ్చని పొలాలు, మండువా ఇళ్ల మధ్య, నిండుగా కళకళలాడే పందిమంది మనుషుల మధ్య చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ పాటలో మహేశ్‌తో పాటు విజయశాంతి, రాజేంద్రప్రసాద్ కూడా కనిపించనున్నారు. తొలి పాట తరహాలోనే ఈ పాటలోనూ మనకు హీరోయిన్ దర్శన భాగ్యం లభించలేదు. సెట్స్‌పై దృశ్యాలనూ కలిపి ఈ లిరికల్ సాంగ్ వీడియోను రూపొందించారు. తొలి పాటకంటే మరింత వేగంగా శ్రోతల్ని ఆకట్టుకొనే ఈ పాటకు భాను కొరియోగ్రఫీ అందించాడు.
రష్మికా మందన్న నాయికగా నటిస్తోన్న ఈ మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న విషయం మనకు తెలుసు. జనవరి 11న విడుదలవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని సాధిస్తుందని మహేశ్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.