సూసైడ్ నోట్ రాసి కాశీకి వెళ్లిపోయిన నిర్మాత..!
on May 31, 2016
మొన్నీ మధ్యే ఒక మళయాళ నిర్మాత, తన సినిమా రషెస్ చూసుకుని బాగా రాలేదని ఆత్మహత్య చేసుకున్న సంగతి ఇంకా సినీజనాలు మర్చిపోక ముందే, ఇప్పుడు మరో తమిళ నిర్మాత ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు. నిర్మాత ఒక లేఖ రాసి, కాశీకి వెళ్లిపోవడం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వేందార్ మూవీస్ బ్యానర్లో అనేక సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేశాడు మదన్. తమిళంలో అనేక భారీ సినిమాలకు పంపిణీ దారుడిగా పనిచేయడంతో పాటు కొన్ని సినిమాల్ని నిర్మించాడు. వేందార్ మూవీస్ పారి వేందార్ అనే ఆయనకు సంబంధించిన గ్రూప్ లో భాగం.
అయితే మదన్ తో గత కొన్నాళ్లు గా సంస్థ అధినేత మాట్లాడట్లేదని, ఆయన కుటుంబసభ్యులు తనను తప్పు చేసినట్టుగా చూస్తున్నారని లేఖలో పేర్కొన్నాడు మదన్. ఈ మనోవేదన తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని సూసైడ్ నోట్ రాశాడు. తాను ఏ తప్పూ చేయలేదని, మరో జన్మ వద్దనుకుంటున్నాను కాబట్టి కాశీకి వెళ్తున్నానని మదన్ లేఖలో చెప్పుకొచ్చాడు. ప్ర్తస్తుతం ఆయన్ను వెతుక్కుంటూ కుటుంబ సభ్యులు కాశీకి చేరారు. సినీ ఫీల్డ్ సెన్సిటివ్ గా ఉండేవాళ్లకు ఎంత వేదనను కలిగిస్తుందో ఈ సంఘటనే ఉదాహరణ. ప్రస్తుతం తమిళ సినీ జనాలు మదన్ గురించి ఆందోళన చెందుతున్నారు. ఆయన మనసు మారి తిరిగి రావాలని కోరుకుంటున్నారు.