ENGLISH | TELUGU  

సు ఫ్రమ్ సో మూవీ రివ్యూ

on Aug 8, 2025

సినిమా పేరు: సు ఫ్రమ్ సో 
తారాగణం:  షానీల్ గౌతమ్, జెపి తుమినాడ్, సంధ్య అరికేరే, రాజ్ బి శెట్టి, ప్రకాష్ తుమినాడ్,  దీపక్ రాజ్ తదితరులు  
సంగీతం: సుమేద్ కె 
ఎడిటర్: నితిన్ శెట్టి 
రచన, దర్శకత్వం: జె పి తుమినాడ్,
సినిమాటోగ్రాఫర్: ఎస్ చంద్రశేఖరన్ 
బ్యానర్: లైటర్ బుద్ధ ఫిలింస్
నిర్మాతలు:శశిధర్ శెట్టి, రవిరాయ్ కలస,రాజ్ బి.శెట్టి 
విడుదల తేదీ: అగస్ట్ 8 ,2025 

ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా గత నెల 25 న కన్నడ నాట విడుదలై, విశేష ప్రేక్షకాదరణని సొంతం చేసుకున్న మూవీ 'సు ఫ్రమ్ సో'(Su from so). నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి, ఇప్పటి వరకు అరవై ఐదు కోట్ల వరకు వసూలు చేసింది. ఇంతటి ఘన విజయాన్ని అందుకున్న సు ఫ్రమ్ సో' ని మేకర్స్  ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.  మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
రవి( షానీల్ గౌతమ్),పేరుకి తాపీమేస్తి పని చేసుకునే వ్యక్తి అయినా, తన విలేజ్ లో ఉండే వాళ్ళకి లీడర్ తో సమానం. ప్రతి ఇళ్లల్లో జరిగే మంచి చెడులకి పెద్దగా వ్యవహరిస్తుంటాడు. ఒక రకంగా దేవుడుతో సమానం. నాలుగు పదుల వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు. ఒక అమ్మాయి ప్రేమలో మునిగిన అశోక(జెపి తుమినాడ్) ఒక తప్పు చేస్తాడు. దాని నుంచి తప్పించుకోవడానికి తన ఒంట్లో దెయ్యం ప్రవేశించినట్టుగా నాటకంగా ఆడతాడు. రవితో సహా ఊరు వాళ్ళందరు అది నిజమని చెప్పి భయపడుతుంటారు. దెయ్యాన్ని పోగొట్టడానికి ఒక స్వామీజీని (రాజ్ బి శెట్టి)  తీసుకొస్తారు. రవి ఒంట్లో పక్క ఊరు సోమేశ్వరంకి చెందిన సులోచన అనే పెద్దావిడ ఆత్మ ప్రవేశించిందని స్వామీజీ చెప్తాడు.  సులోచన కూతురు భాను ( సంధ్య అరికేరే)ని అశోక దగ్గరకి తీసురావడంతో, భాను తన బాధలన్నీ అశోక ఒంట్లో ఉన్న తల్లికి చెప్పుకుంటూ ఉంటుంది. విడో అయిన భానుని పదిహేనేళ్ల క్రితం రవి పెళ్లి చూపుల్లో చూసి వద్దని చెప్తాడు. తన ఒంట్లో దెయ్యం లేదని అశోక ఎంత చెప్తున్నా ఎవరు వినరు. ఈ క్రమంలో దెయ్యం నాటకాన్ని అశోక నిజం చేస్తాడు. దెయ్యం నాటకాన్ని అశోక ఎందుకు నిజం చేసాడు? అసలు దెయ్యం పట్టినట్టు నాటకం ఆడటానికి అశోక చేసిన తప్పేంటి? రవి పెళ్ళికి, సులోచన ఆత్మకి ఏమైనా సంబంధం ఉందా? చివరకి అశోక పరిస్థితి ఏంటి? ఊరి వాళ్ళ భయం పోయిందా లేదా అనేదే ఈ చిత్ర కథ.

ఎనాలసిస్ 
భారీ బడ్జెట్, భారీ లొకేషన్స్, భారీ గ్రాఫిక్స్ ,భారీ ఆర్ఆర్ లు లేకుండా కేవలం కథ, కథనాలతో ప్రేక్షకులని రంజింప చేయవచ్చని 'సు ఫ్రమ్ సో' మరోసారి నిరూపించింది. 'బలగం' మూవీ లాగా మరో మంచి మెసేజ్ ని చెప్పిన చిత్రం అని కూడా చెప్పుకోవచ్చు . ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే మొదటి ఇరవై నిముషాలు శుభకార్యం, అశుభకార్యం కి సంబంధించిన ఫంక్షన్స్ , వాటిల్లో ఆల్కహాల్ సీన్స్   కామెడి లాంటివి వచ్చి, కొంచం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ అశోక తన ఒంట్లోకి దెయ్యం ప్రవేశించిందనే నాటకం మొదలు పెట్టిన దగ్గర్నుంచి, కథలోకి లీనమైపోతాం. మనకి తెలిసిన వాళ్ళ కథని మనం చూస్తున్నాం అనేలా సీన్స్ వచ్చి నవ్వుల్లో ముంచెత్తుతాయి. తనకి దెయ్యం పట్టలేదని అశోక ఎంత చెప్తున్నా, రవితో పాటు ఊరి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. పల్లెటూరిలోఎక్కువ శాతం మందిలో ఉండే  కల్మషం, అమాయకత్వంతో నిండిన మనుషులని కళ్ళ ముందు ఉంచింది. ముఖ్యంగా స్వామీజీని పిలవడం,ఈ సందర్భంగా వచ్చిన సీన్స్ అయితే సూపర్. ఇంటర్వెల్ ట్విస్ట్  బాగుంది. సెకండ్ హాఫ్ లో కూడా ఇదే కథ రన్ అవుతుందిలే అని అనుకుంటాం. కానీ అశోక కి ఒక లక్ష్యాన్ని క్రియేట్ చేసి కథకి మంచి అర్దాన్ని తెచ్చారు. భాను, రవి మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అంతే కాకుండా ఫస్ట్ హాఫ్ ని మించి సెకండ్ హాఫ్ నవ్వులు పూయించింది. ఎవరు ఊహించని విధంగా క్లైమాక్స్ ఉండటం ఈ సినిమా స్పెషాలిటీ. అదే ఈ చిత్రానికి బలం కూడా. కాకపోతే హర్రర్ ఎక్కువగా భయపెట్టలేదు. ఆ దిశగా మరిన్ని సీన్స్ ని క్రియేట్ చేసుండాల్సింది. సోమేశ్వరం లో నిజమైన సులోచన ఆత్మగా తిరుగుతుందని చూపిస్తూ సీన్స్ ని క్రియేట్ చేసుండాల్సింది. హర్రర్ ఎక్కువగా కోరుకునే వాళ్ళకి కొంచం డిజప్పాయింట్ ఉండవచ్చు.  

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు
రవి క్యారక్టర్ లో చేసిన షానీల్ గౌతమ్(Shaneel Gautham)తన కోసమే ఆ క్యారక్టర్ పుట్టినట్టుగా జీవించాడు. తన క్యారక్టర్ లో ఉన్న అన్ని ఎలివేషన్స్ ని ఎక్కడ ఓవర్ గా చెయ్యకుండా, ఎంత వరకు నటించాలో అంతవరకు నటించాడు. అశోక గా చేసిన జెపి తుమినాడ్(Jp Thuminad)కూడా అంతే. మనకి తెలిసిన పక్కింటి కుర్రోడులా తన క్యారక్టర్ లో ఒదిగిపోయాడు. లేడీ గెటప్ లో ఎక్కువగా పెర్ఫార్మ్ చేసే అవకాశం లేకపోయినా పర్లేదనిపించాడు. రచయిత, దర్శకుడు  తనే కాబట్టి ఈ విషయంలో నటుడుగా కంటే ఆ రెండిటిలో  ఎక్కువ మార్కులు వెయ్యవచ్చు .సరికొత్త స్క్రీన్ ప్లే తో కట్టిపడేసాడు. మిగతా క్యారెక్టర్లలో చేసిన భానుతో పాటు, అందరు చక్కని నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా స్వామిజీ  క్యారక్టర్ లో చేసిన రాజ్ బి శెట్టి(Raj B shetty)అద్భుతమైన పెర్ఫార్మ్ తో రెట్టింపు నవ్వులని పూయించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు పర్లేదు. ఎడిటింగ్  ప్లస్ పాయింట్. ఇలాంటి చిత్రాలకి నిర్మాణ విలువలు కనపడవు. కన్నడ నటులు డైలాగ్స్ చెప్తునట్టుగా లేదు. అంతలా ప్రతి ఒక్కరికి తెలుగు డబ్బింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది. . 

ఫైనల్ గా చెప్పాలంటే 'సు ఫ్రమ్ సో' కామెడీ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కినా,హర్రర్ పెద్దగా భయపెట్టదు. ఎంటర్ టైన్ మెంట్ మాత్రం చాలా బాగుంది. 


రేటింగ్ 2 .75 /5                                                                                                                                                                                                                                                           అరుణాచలం

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.