'సిరివెన్నెల' సినీ ప్రయాణం.. 11సార్లు నంది అవార్డు.. వరుసగా మూడు సార్లు!
on Nov 30, 2021

సిరివెన్నెల సీతారామశాస్త్రి.. తెలుగు సినీ పరిశ్రమలోని పాటల పూదోటలో ఆయనో మహావృక్షం. తన కలంతో ఎన్నో హృదయాలను కదిలించారు. తన పాటలతో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశారు. ఆయన లేని తెలుగు సినీ పాటల ప్రపంచాన్ని ఊహించుకోలేం. ఆయన లేకపోయినా ఎన్నో గొప్ప పాటల రూపంలో ఆయన బ్రతికే ఉంటారు. మూడు దశాబ్దాల పైగా సాగిన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో గొప్ప పాటలు అందించారు. మరే గేయ రచయితకు సాధ్యం కానీ అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు.
కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'జననీ జన్మభూమి(1984)'తో గేయ రచయితగా టాలీవుడ్ కి పరిచయమయ్యారు చంబోలు సీతారామశాస్త్రి. ఆ తర్వాత 1986 లో విశ్వనాథ్ దర్శకత్వంలోనే వచ్చిన 'సిరివెన్నెల' సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని పొందారు సీతారామశాస్త్రి. ఆ సినిమాలో ఆయన రాసిన అన్ని పాటలూ ఆణిముత్యాలు. 'విధాత తలపున' పాట అయితే ఆయనకి గేయ రచయితగా మొదటి నంది అవార్డు తెచ్చిపెట్టింది. 'సిరివెన్నెల'నే తన ఇంటిపేరుగా చేసుకుని సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారిన ఆయన ఆ తర్వాత వెనక్కి తిరిగి చేసుకున్నది లేదు. సిరివెన్నెల(1986) తర్వాత.. శ్రుతిలయలు(1987) లోని 'తెలవారదేమో', స్వర్ణకమలం(1988)లోని 'అందెల రవమిది' పాటలకు ఆయనకు నందులు వరించాయి. గేయ రచయితగా వరుసగా మూడు సార్లు నంది అవార్డు గెలుచుకోవడం విశేషం. ఆ తర్వాత గాయం(1993)లోని సురాజ్యమవలేని, శుభలగ్నం(1994) లోని చిలకా ఏ తోడులేక, శ్రీకారం(1995)లోని మనసు కాస్త కలత, సింధూరం(1997)లోని అర్ధ శతాబ్దపు, ప్రేమకథ(1999) లోని దేవుడు కరుణిస్తాడని, చక్రం(2005)లోని జగమంత కుటుంబం నాది, గమ్యం(2008)లోని ఎంతవరకూ ఎందుకొరకూ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(2013) లోని 'మరీ అంతగా' పాటలకు ఆయన నందులు గెలుచుకున్నారు. ఆయన సినీ కెరీర్ లో మొత్తం 11 నంది పురస్కారాలను అందుకున్నారు.
కెరీర్లో ఉత్తమ గేయరచయితగా నంది అవార్డులతో పాటు నాలుగు ఫిలింఫేర్ అవార్డులు కూడా గెలుచుకున్నారు సిరివెన్నెల. వీటితో పాటు కళాసాగర్, మనస్విని వంటి ఎన్నో పురస్కారాలు ఆయన అందుకున్నారు. సినీ పరిశ్రమకు సిరివెన్నెల చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



