సీతారామశాస్త్రి లేని తెలుగు సినిమా పాటను ఎలా ఊహించేది!
on Nov 30, 2021

తెలుగు పాటకు సంబంధించిన తన యుగాన్ని రాసుకున్న వేటూరి సుందరరామ్మూర్తి ఉండగానే తెలుగు చిత్రసీమలోకి గేయరచయితగా అడుగుపెట్టిన చెంబోలు సీతారామశాస్త్రి.. 'సిరివెన్నెల' (1986) సినిమాకు అందించిన పాటలతో ఒక్కసారిగా సంగీతప్రియులనందర్నీ తనవైపు దృష్టి సారించేలా చేసుకున్నారు. 'సిరివెన్నెల సీతారామశాస్త్రి'గా ప్రఖ్యాతులయ్యారు. అప్పట్నుంచీ వేటూరితో పాటు తెలుగు సినిమా పాట సాహిత్యానికి తాను కూడా ఉన్నానంటూ తన కలం ప్రభావాన్ని చూపిస్తూ వచ్చారు. తెలుగు సినిమా పాట స్థాయిని పెంచారు. వేటూరి తర్వాత తెలుగు సినిమా పాటకు తనే పెద్ద దిక్కుగా మారారు.
సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన అమృత తుల్యమైన పాటలు ఎన్నో.. ఎన్నెన్నో! వేటూరి పాటలో తీవ్రత ఎక్కువగా ఉంటే, సీతారామశాస్త్రి పాటలో ఆర్ద్రత ఎక్కువగా వినిపిస్తుంది. అలా అని శక్తివంతమైన పాటలను ఆయన రాయకుండా ఉండలేదు. 'కళ్లు' సినిమాలో "తెల్లారింది లెగండో కొక్కొరొక్కో" పాట.. రచయితగా ఆయనలోని మరో కోణాన్ని వెలికితీసింది. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వరాలు కూర్చిన ఆ పాటను సీతారామశాస్త్రి స్వయంగా ఆలపించారు. ఆయన గొంతులో ఆ పాట ఒక విలక్షణత్వాన్ని సంతరించుకుంది. ఇప్పటికీ ఆ పాట తరచూ ఎక్కడోచోట వినిపిస్తూనే ఉంది.
త్రివిక్రమ్ డైరెక్ట్ చేయగా తమన్ సంగీతం సమకూర్చిన ఇటీవలి బ్లాక్‌బస్టర్ మూవీ 'అల.. వైకుంఠపురములో'లో హీరోయిన్ పూజా హెగ్డే కాళ్ల అందాన్ని వర్ణిస్తూ ఆయన రాసిన "సామజవరగమన.. నిను చూసి ఆగగలనా" అంటూ ఆయన రాసిన పాట జనం నోళ్లలో ఎంతగా నానిందో! మూడున్నర దశాబ్దాలుగా ఆయన కలం పదును ఏమాత్రం తగ్గలేదు. ఎంతమంది గేయరచయితలు వచ్చినా, ఆయన డిమాండ్ చెక్కుచెదరలేదు. ఫలానా సందర్భానికి సీతారామశాస్త్రి అయితేనే న్యాయం చేకూరుస్తారని దర్శకులు, సంగీత దర్శకులూ ఇప్పటికీ నమ్ముతూ వచ్చారంటే ఆయన కాలాన్ని జయించిన కవి కాక మరేమిటి? ఆయన ఆకస్మిక మృతితో తెలుగు సినిమా సాహిత్యం కోలుకోలేని కుదుపుకు లోనైంది. ఆయన లేని లోటు నిజంగా ఎవరూ తీర్చలేనిది. తన పాటతో ఆయన మన తలపుల్లో ఎన్నటికీ నిలిచే ఉంటారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



