ప్రి-వెడ్డింగ్ సెలబ్రేషన్స్: కుర్రాళ్లయిపోయిన సింగర్ సునీత, రామ్!
on Dec 22, 2020
ఆ ఇద్దరూ నలభైలలో ఉన్నవాళ్లే.. అయినా కుర్రాళ్లను మించిపోయి సందడి చేశారు. ఆ ఇద్దరిలో ఒకరు సింగర్ సునీత, మరొకరు ఆమె కాబోయే భర్త రామ్ వీరపనేని. జనవరిలో ఆ ఇద్దరూ పెళ్లిబంధంతో ఒకటి కాబోతున్నారు. ఇటీవల వారి నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. కాగా రెండు రోజుల క్రితం ఆ ఇద్దరూ ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ వేడుకలో టాప్ యాంకర్ సుమ, పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి-దర్శకురాలు రేణు దేశాయ్, సునీత సహ గాయనీ గాయకులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ స్టార్ హోటల్ ఈ ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు వేదికగా నిలిచింది. ఈ సెలబ్రేషన్స్‌లో సునీత, రామ్ కలిసి కేక్ కట్ చేశారు. సింగర్ దినకర్ లైవ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో కుర్రాళ్ల మాదిరిగా సునీత, రామ్ డాన్స్ చేశారు. మొదట సునీత డాన్స్ చేయడానికి మొహమాటపడగా, రామ్ డాన్స్ చేస్తూ, ఆమెను ప్రోత్సహించారు. దాంతో ఆమె కూడా నవ్వుతూ ఆయనతో కాలు కదిపారు. ఈ వివాహం విషయంలో సునీత చాలా ఆనందంగా ఉన్నట్లు ఆమె ముఖంలో వెల్లివిరుస్తున్న నవ్వులు తెలియజేస్తున్నాయి.
ఆ ఇద్దరికీ ఇది ద్వితీయ వివాహం కానుండటం గమనార్హం. ఇద్దరూ తమ మొదటి జీవిత భాగస్వాములకు విడాకులిచ్చి, కొంత కాలంగా సింగిల్‌గా ఉంటున్నారు. 42 సంవత్సరాల సునీతకు టీనేజ్ దాటిన ఇద్దరు పిల్లలున్నారు.