అఫిషియల్: సింగర్ సునీత రెండో పెళ్లికి రెడీ!
on Dec 7, 2020
గాయని సునీత వైవాహిక జీవితంలోకి మరోసారి అడుగు పెట్టబోతున్నారు. డిజిటల్ మీడియా ఎంట్రప్రెన్యూర్, మ్యాంగో మ్యూజిక్ అధినేత అయిన రామ్‌తో ఆమె వివాహం జరగనుంది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఆమె వెల్లడించారు. సోమవారం వారి వివాహ నిశ్చితార్ధం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఆమె రెండో వివాహానికి సంబంధించి ప్రచారం జరుగుతున్న విషయాన్ని తెలుగు వన్ సైతం ఇదివరకు తెలియజేసింది. ఇప్పుడు ఆ ప్రచారాన్ని 42 సంవత్సరాల సునీత నిజం చేశారు.
తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తన కాబోయే భర్త రామ్‌తో పాటు, తమ ఇద్దరి కుటుంబ సభ్యులు కలిసున్న ఫొటోలను ఆమె షేర్ చేశారు. వాటితో పాటు ఒక ఎమోషనల్ నోట్‌ను కూడా ఆమె పంచుకున్నారు. "ప్రతి తల్లి మాదిరిగానే, నా పిల్లలు బాగా స్థిరపడాలని నేను కలలు కంటున్నాను. అదే సమయంలో, నేను జీవితంలో బాగా సెటిలవడం చూడాలని ఎప్పుడూ కోరుకొనే అద్భుతమైన, ఆలోచనాత్మకమైన పిల్లలు, తల్లిదండ్రులను కలిగి ఉండటం నా భాగ్యం. ఆ క్షణం ఎట్టకేలకు వచ్చింది. రామ్ నా జీవితంలోకి ఒక కేరింగ్ ఫ్రెండ్‌గా, వండర్ఫుల్ పార్టనర్‌గా అడుగుపెట్టారు. అతి త్వరలోనే వైవాహిక బంధంలోకి ప్రవేశిస్తుండటం మా ఇద్దరికీ ఆనందంగా ఉంది. నా జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచుతున్నానని అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ థాంక్స్. దయచేసి ఎప్పటిలాగే నాకు మద్దతునిస్తూ, నాతో ఉండండి" అని ఆమె రాసుకొచ్చారు.
టీనేజ్ వయసులోనే టీవీ ప్రొడ్యూసర్ కిరణ్ అలియాస్ లక్కీతో సునీత్ వివాహం జరిగింది. పదేళ్ల క్రితం ఆ ఇద్దరూ విడిపోయారు. ఆమెకు శ్రేయ అనే కుమార్తె ఉంది. మరోవైపు రామ్ సైతం తన మొదటి భార్య నుంచి చాలా కాలం క్రితమే విడాకులు తీసుకున్నారు. సునీత, రామ్‌ల పెళ్లి ఈ నెలలోనే జరగనున్నట్లు సమాచారం.