శ్రీహరికి హీరోగా హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు కె.ఎస్. నాగేశ్వరరావు మృతి!
on Nov 27, 2021

సీనియర్ డైరెక్టర్ కె.ఎస్. నాగేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. కొంత కాలంగా ఆయన మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఏలూరు నుంచి హైదరాబాద్‌కు వస్తూ, మార్గమధ్యంలో ఆకస్మికంగా ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుటుంబసభ్యులు సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం దగ్గర్లోని స్వస్థలం పోతవరంలో నాగేశ్వరరావు అంత్యక్రియలు జరగనున్నాయి.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా రాణిస్తూ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ కె.ఎస్. నాగేశ్వరరావు తీసిన యాక్షన్ ఫిల్మ్ 'పోలీస్' ఘన విజయం సాధించింది. అదే ఊపులో శ్రీహరి హీరోగా నటించిన తర్వాత రెండు సినిమాలు 'దేవా', 'సాంబయ్య'కు కూడా నాగేశ్వరరావే దర్శకుడు. ఆ ఇద్దరి కాంబినేషన్‌లో అలా హ్యాట్రిక్ హిట్స్ నమోదయ్యాయి. ఆ తర్వాత శ్రీహరితోటే 'శ్రీశైలం', లేడీ అమితాబ్ విజయశాంతి టైటిల్ రోల్‌లో 'వైజయంతి' సినిమాలను నాగేశ్వరరావు తీసి, యాక్షన్ సినిమాల డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు. రెండేళ్ల క్రితం వచ్చిన 'బిచ్చగాడా మజాకా' ఆయన చివరి చిత్రం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



