‘బాహుబలి’తో సరిలేరు...‘బాహుబలి 2’తో అల...
on Jan 16, 2020
సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో పందెం కోళ్లకు కట్టిన కత్తులు తీసి పక్కన పెట్టేసి ఉంటారు. సంక్రాంతి బరిలో, ప్రచార పోటీలో ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల... వైకుంఠపురములో’ సినిమా యూనిట్స్ కట్టిన కత్తులు ఇంకా తీయలేదు. థియేటర్లలోకి రావడానికి ముందు విడుదల తేదీ విషయంలో పోటీ పడ్డారు. ప్రచారంలో పోటీ పడ్డారు. థియేటర్లలోకి వచ్చిన తర్వాత ‘మా సినిమా టాక్ బావుందంటే... మా సినిమా టాక్ బావుంది’ అనే చెప్పుకోవడంలో పోటీ పడ్డారు. ‘అల.... వైకుంఠపురములో’ కంటే ఒక్క రోజు ముందు థియేటర్లలోకి వచ్చింది ‘సరిలేరు నీకెవ్వరు’. ఆ రోజు సాయంత్రమే ‘బ్లాక్‌బస్టర్ కా బాప్’ అని పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఆ తర్వాతి రోజు థియేటర్లలోకి వచ్చింది ‘అల... వైకుంఠపురములో’. ఆ రోజు సాయంత్రం ‘సంక్రాంతి విన్నర్’ అని పోస్టర్ వచ్చింది. దీనికి కౌంటర్‌గా ‘సరిలేరు...’ టీమ్ నుండి ‘రియల్ సంక్రాంతి విన్నర్’ అని మరో పోస్టర్ వచ్చింది.
‘మొగుడు’ వర్సెర్ ‘రంకు మొగుడు’
‘సంక్రాంతి విన్నర్’, ‘రియల్ సంక్రాంతి విన్నర్’ పోస్టర్లతో గొడవ ఆగలేదు. పబ్లిసిటీలో ఈ కోల్డ్ వార్ ప్రోమోల వరకూ వచ్చింది. విడుదలకు ముందు ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ నుండి ఒక టీజర్ వచ్చింది. అందులో ప్రకాష్‌రాజ్ చేత ఒక డైలాగ్ చెప్పించారు. ‘ప్రతిసారీ సంక్రాంతికి అల్లుడు వస్తాడు. ఈసారి మొగుడు వచ్చాడు’ అని! ‘సంక్రాంతి విన్నర్’ అంటూ ‘అల... వైకుంఠపురములో’ యూనిట్ నుండి వచ్చిన ప్రొమో ఆ టీజర్‌కు కౌంటర్ అనుకోవాలేమో. ఎందుకంటే... ఆ ప్రోమోలో ‘వాళ్ళకు కరెక్ట్ మొగుడిని నేను తగిలిస్తా’ అని సచిన్ ఖడేకర్ చెప్పడం... చివర్లో సునీల్ ‘బాబోయ్! ఈడు ఉత్త మొగుడు కాదు. రంకు మొగుడు’ అని చెప్పడం రెండు సినిమాల మధ్య కోల్డ్ వార్‌ను చెప్పకనే చెప్పింది. ఈ కోల్డ్ వార్ కలెక్షన్లు ప్రకటించడంలోనూ బయట పడుతోంది.
ఎవరికి వారివే రికార్డ్స్
కలెక్షన్లు ప్రకటించడంలో ‘బాహుబలి’తో ‘సరిలేరు నీకెవ్వరు’, ‘బాహుబలి 2’తో ‘అల... వైకుంఠపురములో’ దూకుడు చూపిస్తున్నాయి. తమ సినిమా కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ సృష్టించిందని ఒకరు... నాన్ బాహుబలి2 రికార్డ్స్ సృష్టించిందని మరొకరు ఎప్పటికప్పుడు ప్రకటనలు గుప్పిస్తున్నారు. పైకి, సంక్రాంతికి నాలుగైదు సినిమాలు హిట్ అయ్యే స్కోప్ ఉందని ఎవరికి వారు చెప్తున్నా... లోపల మాత్రం పోటీతత్వాన్ని అలాగే ఉంచుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
