రాజకీయ 'చదరంగం'... మంచు విష్ణు టార్గెట్ ఎవరు?
on Jan 16, 2020
తెలుగులో వెబ్ సిరీస్ ట్రెండ్ రోజురోజుకు పెరుగుతోంది. నవదీప్, జగపతిబాబు, శ్రద్దాదాస్, వరుణ్ సందేశ్ తదితర స్టార్స్ ఇప్పటికే వెబ్ సిరీస్ లు చేశారు. సమంత, శృతిహాసన్ వంటి టాప్ హీరోయిన్లు ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ఈ లిస్టులోకి హీరో శ్రీకాంత్ కూడా చేరారు. ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ 'జీ'కి చెందిన డిజిటల్ ప్లాట్ ఫామ్ 'జీ 5' కోసం మంచు విష్ణు నిర్మించిన వెబ్ సిరీస్ 'చదరంగం'లో శ్రీకాంత్ నటించారు. తెలుగు క్రాంతి సంఘం పార్టీ అధినేతగా అతడు కనిపించనున్నట్లు తాజాగా విడుదలైన ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఎవరిని టార్గెట్ చేస్తూ తీశారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
శ్రీకాంత్ గెటప్ చూస్తుంటే నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గర దగ్గరలో ఉంది. ట్రైలర్ లో అతడు చెప్పిన డైలాగ్ వింటుంటే పవన్ కళ్యాణ్ ఏమో అనే అనుమానం కలుగుతోంది.
'తెలుగు రాష్ట్రం నడిబొడ్డు మీద నుండి హెచ్చరిస్తున్నా... మీ పద్ధతులు మార్చుకోకపోతే మీకు నా తెలుగు కుటుంబం సమాధి కట్టే రోజు దగ్గరలో ఉంది' - ఇదీ 'చదరంగం'లో శ్రీకాంత్ చెప్పే డైలాగ్. 'హెచ్చరిస్తున్నా' అనే పదాన్ని పవన్ కళ్యాణ్ ఎక్కువగా తన ప్రసంగాల్లో ఉపయోగిస్తారు. ఈ ట్రైలర్ చూస్తే... శ్రీకాంత్ గెటప్ అలా లేదు.
జగన్ మోహన్ రెడ్డికి ఈ వెబ్ సిరీస్ నిర్మాత మంచు విష్ణు బంధువు. సొంత బావకు వ్యతిరేకంగా వెబ్ సిరీస్ తీసే సాహసం మంచు విష్ణు చేస్తారా? కచ్చితంగా చేయరు. నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీస్తున్న వెబ్ సిరీస్ అని చెబుతున్నారు. అందువల్ల, మంచు విష్ణు ఎవరిని టార్గెట్ చేశారని డిస్కషన్ టాపిక్ అవుతుంది. గతంలో సంపూర్ణేష్ బాబు ను హీరోగా పెట్టి కమర్షియల్ సినిమాల మీద సెటైరికల్ గా 'సింగం 123' అని మంచు విష్ణు ఒక సినిమా కూడా నిర్మించిన సంగతి గుర్తుండే ఉంటుంది.