'సరిలేరు నీకెవ్వరు' టైటిల్ సాంగ్ రివ్యూ
on Dec 23, 2019
ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'సరిలేరు నీకెవ్వరు' యాంతం.. అంటే.. టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ స్వయంగా రాసిన ఈ పాటను దీపక్ బ్లూ చేత పాడించి అప్పుడు రిలీజ్ చేశారు. ఇప్పుడే అదే పాటను సుప్రసిద్ధ గాయకుడు శంకర్ మహదేవన్ చేత పాడించి సోమవారం విడుదల చేశారు. కాకపోతే ఆర్కెస్ట్రా సైతం మారింది. ప్రఖ్యాత మెసడోనియన్ సింఫోనిక్ ఆర్కెస్ట్రాతో ఈ పాటను రికార్డ్ చేశారు. 'సరిలేరు నీకెవ్వరు' మూవీలో మేజర్ అజయ్‌కృష్ణ అనే క్యారెక్టర్‌ను మహేశ్ చేస్తున్న విషయం తెలిసిందే. సైనికుడంటే ఏమిటో, దేశం కోసం, ప్రజల కోసం అతనేం చేస్తాడో తెలిపే విధంగా ఈ పాటను దేవి శ్రీప్రసాద్‌లోని కవి రాయడం గమనార్హం.
"భగభగభగ మండే నిప్పుల వర్షమొచ్చినా
జనగణమణ అంటూనే దూకేవాడే సైనికుడూ
ఫెళఫెళఫెళమంటూ మంచు తుఫాను వొచ్చినా
వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడూ
ధడధడధడమంటూ తూటాలే దూసుకొచ్చినా
తన గుండెను అడ్డుపెట్టి ఆపేవాడే సైనికుడూ" అంటూ సైనికుడి వీరత్వాన్ని చాటుతూ పాట మొదలుపెట్టాడు దేవి. ఈ పాటలోని లైన్లకు మళ్లీ కొత్తగా అర్థాలు చెప్పాల్సిన పని లేదు కదా. ఎలాంటి ఆటంకాలెదురైనా, ఎదురుగా మృత్యువే నిల్చున్నా ఆగకుండా తన విధిని నిర్వర్తించడానికి ముందుకెళ్లేవాడుగా సైనికుడిని అతడు కీర్తించాడు.
"మారణాయుధాలు ఎన్ని ఎదురైనా
ప్రాణాన్ని ఎదురుపంపేవాడూ ఒకడే ఒకడూ వాడే సైనికుడూ
సరిలేరు నీకెవ్వరూ నువ్వెళ్లే రహదారికి జోహారూ
సరిలేరు నీకెవ్వరూ ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు" అని అతడికి జోహార్లు పలుకుతున్నాడు కవి. ఒక్క మాటలో 'సరిలేరు నీకెవ్వరు' అని కొనియాడుతున్నాడు. నిజమే. దేశంలోని ఏ ఇతర ఉద్యోగాలకన్నా గొప్ప ఉద్యోగం సైనిక ఉద్యోగం. నిజానికది ఉద్యోగం కాదు. దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించడానికి నిత్యం సిద్ధంగా ఉండే కర్తవ్యం. నిజమైన దేశభక్తుడెవరంటే.. సైనికుడిని మించినవాడు ఎవరు? అతడి త్యాగాల ముందు మిగతావాళ్ల త్యాగాలు ఏపాటివి?
దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్లూ గుండెలమీద చేయేసుకొని హాయిగా పడుకుంటున్నారంటే కారణం.. సైనికుడు మనకు కాపలాగా ఉన్నాడనే భరోసాతోటే. అందుకే..
"కోట్లమందీ గుండెల్లో ధైర్యమనే జెండానాటి
అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడూ
ఈ దేశమే నా ఇల్లంటూ అందరూ నా వాళ్లంటూ
కులం మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడూ
చెడు జరగనీ పగ పెరగనీ బెదరని గని సైనికుడూ
అలుపెరుగని రక్షణమని చెదరని ముని సైనికుడూ" అని అతడిలోని ధీరత్వాన్ని చాటిచెబుతున్నాడు కవి. శంకర్ మహదేవన్ గాత్రంలో ఈ ఉదాత్త గీతాన్ని వింటుంటే శరీరం మరింతగా గగుర్పాటుకూ, పులకరింతకూ గురవుతుందనడం అతిశయోక్తి కాదు. కాకపోతే 'తూటాలే దూసుకొచ్చినా' అని వినపడాల్సిన చోట 'తూతాలే దూసుకొచ్చినా' అని వినిపిస్తోంది. రికార్డింగ్ సమయంలో దీన్ని దేవి శ్రీప్రసాద్ గుర్తించలేకపోయాడని అనుకోవాలి. అంతేకాదు.. 'మారణాయుధాలు' అనే పదం సరైనది. దానికి బదులుగా 'మరణాయుధాలు' అని పాడాడు శంకర్ మహదేవన్. ఈ రెండు పొరపాట్లను పట్టించుకోకపోతే.. లిరికల్‌గానూ, వోకల్‌గానూ ఈ సాంగ్ గొప్పగా ఉందని చెప్పొచ్చు.
డిసెంబర్‌లో ప్రతి సోమవారం ఒక పాటను రిలీజ్ చేస్తామని దర్శక నిర్మాతలు చెప్పిన ప్రకారం.. ఈ నెలలో నాలుగో సోమవారం నాలుగో పాటగా దీన్ని 'టి-సిరీస్ తెలుగు' విడుదల చేసింది. కీబోర్డ్స్, రిథం, ట్రంపెట్, ట్రాంబోన్ వంటి వాద్య పరికరాలతో ఈ పాటను రికార్డ్ చేశారు. దానికి మెసిడోనియన్ సింఫోనిక్ ఆర్కెస్ట్రా తోడై ఈ పాటను మరింత క్వాలిటీగా తీసుకొచ్చింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా మహేశ్ సరసన రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఇప్పటికే షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. జనవరి 5న జరిగే ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా వస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను టార్గెట్‌గా చేసుకొని సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ఈ సినిమా వస్తోంది.