పిచ్చివేషాలు వేస్తే కాళ్లు విరగ్గొడతా!
on Aug 14, 2017
బాధలు తీరడమే ఓ ఆనందం. అలాంటి సమయంలో శుభం జరిగితే.. ఇక సంతోషానికి అవధులుంటాయా? ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. సంజయ్ దత్ ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నాడు. కారణం తెలుసుకోవాలనుందా? అయితే చదవేయండి.
భయంకరమైన జైలు జీవితం నుంచి బయటకొచ్చాక... సంజయ్ చేసిన సినిమా ‘భూమి’. సంజయ్ దత్, అదితీరావు హైదరీ.. తండ్రీ కూతుర్లుగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ ట్రైలరే. సంజయ్ ఆనందానికి ఇదే కారణం అనుకుంటే మీరు పొరబడ్డట్టే. ఎందుకంటే... అదే రోజున సంజయ్ కుమార్తె త్రిషాలా పుట్టిన రోజు. ఈ రెండూ విశేషాలూ ఒకేసారి కలిసిరావడంతో సంజయ్ ఆనందానికి అవధి లేకుండా పోయింది. ఆ రాత్రి కూతురి పుట్టినరోజు పార్టీలో తన భార్య మాన్యతతో కలిసి అద్భుతంగా డాన్స్ చేశాడు సంజయ్. విశేషం ఏంటంటే... ‘భూమి’ ట్రైలర్ తో పాటు, భార్యతో సంజయ్ చేసిన డాన్స్ వీడియో కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.
సంజయ్ కి తన కుమార్తె త్రిషాలా అంటే ప్రాణం. ఉద్యోగ రిత్యా అమెరికాలో ఉండే త్రిషాలా... సమయం దొరికినప్పుడల్లా వీడియో చాట్లో తండ్రితో మాట్లాడుతూనే ఉంటుంది. త్రిషాలాకు నటి కావాలనే ఆశ కూడా ఉంది. కానీ.. సంజయ్ మాత్రం ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంపై ఆ రోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ‘మీ కుమార్తె నటి కావాలనుకుంటున్నారు కదా. మీరు ఒప్పుకున్నట్టేనా?’ అని ఓ విలేకరి ప్రశ్న కూడా సంధించాడు. దానికి సంజయ్ సింపుల్ గా - ‘పిచ్చి వేషాలు వేస్తే.. కాళ్లు విరగ్గొడతా’ అని సమాధానమిచ్చారు. దాంతో ఆ విలేకరి విస్తుపోయి చూసేసరికి... సంజయ్ నవ్వుతూ ‘నిన్ను కాదు మిత్రమా.. మా అమ్మాయిని’ అన్నారు. అంతే... లొకేషన్ అంతా ఒకటే నవ్వులు.