మీకో దండమండీ బాబూ...!
on Aug 14, 2017
ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూ ఉంటే అదో టైంపాస్. పైగా సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు టైంపాస్ కి కొదవేలేదు. పొగడ్తో, తెగడ్తో.. ఏదో ఒక పోస్ట్ పెట్టేసి.. కామెంట్ల కోసం చూడ్డం ప్రస్తుతం కామన్ అయిపోయింది. హీరో నిఖిల్ టైంపాస్ కోసం అలాంటి పనే చేశాడు.
వరుస విజయాలతో మంచి జోష్ మీదున్న నిఖిల్.. ‘ఎప్పుడూ షూటింగులేనా..’ అనుకున్నాడేమో! కాస్తంత ఛేంజ్ కోసం ట్విట్టరెక్కాడు. డైరెక్ట్ గా వీళ్లనీ వాళ్లనీ అని కాకుండా... అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నే టార్గెట్ చేశాడు. ఇటీవల ఉత్తర కొరియాకకు ట్రంప్ ట్విట్టర్ ద్వారా వార్నింగ్ ఇచ్చిన విషయం ఎంతమందికి తెలుసో కానీ... ఆ విషయం మన నిఖిల్ కి తెలిసింది. ‘అణుయుద్ధం ప్రారంభించడానికి ట్విట్టర్ ని కూడా వేదిక చేసుకోవచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. ట్రంప్ గారూ మీకో దండం’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
ప్రపంచ శాంతిపై తనకున్న ఆసక్తిని ఈ పోస్ట్ ద్వారా నిఖిల్ తెలియజేశాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా... తన గురించే కాకుండా.. సమాజ శ్రేయస్సు గురించి కూడా నిఖిల్ ఆలోచించడం పట్ల పలువురు అభినందనలు అందిస్తూ... ఆనందం వ్యక్తం చేస్తున్నారు.