'ప్రస్థానం'తో దేవా కట్టా బాలీవుడ్‌లో పాగా వేస్తాడా?
on Aug 25, 2019
మరో తెలుగు దర్శకుడు బాలీవుడ్‌లో తన పరిచయాన్ని ఘనంగా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. అతను.. దేవా కట్టా. యు.ఎస్.లో ఐటీ నిపుణుడిగా పనిచేస్తూ 2005లో వచ్చిన 'వెన్నెల' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన దేవా, ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలిపెట్టి, హైదరాబాద్ వచ్చేసి 2010లో 'ప్రస్థానం' రూపొందించాడు. బాక్సాఫీస్ వద్ద ఆశించిన రీతిలో ఆడకపోయినా, ఒక డైరెక్టర్‌గా ఆ మూవీ దేవాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. సాయికుమార్, శర్వానంద్, సందీప్ కిషన్, వెన్నెల కిశోర్ వంటి వాళ్ల నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత దేవా 'ఆటోనగర్ సూర్య', 'డైనమైట్' సినిమాల్ని రూపొందించినా అవి ఆడలేదు.
అయితే తనకెంతో నచ్చిన, పేరు తెచ్చిన 'ప్రస్థానం'ను బాలీవుడ్‌లో రీమేక్ చెయ్యాలనే తలంపుతో సంజయ్ దత్‌కు ఆ సినిమా చూపించాడు. ఆయనకు మూవీతో పాటు సాయికుమార్ కేరెక్టర్ బాగా నచ్చేసింది. వెంటనే దేవా డైరెక్షన్‌లో ఆ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు సంజయ్. పైగా ఆ సినిమాని తనే ప్రొడ్యూస్ చెయ్యడానికి ముందుకు వచ్చాడు. అలా సంజయ్ ఎస్ దత్ ప్రొడక్షన్స్ బేనర్‌పై మాన్యతా దత్ నిర్మాతగా 'ప్రస్థానం' మొదలైంది. శర్వానంద్ కేరెక్టర్‌ను అలీ ఫజల్, పవిత్రా లోకేశ్ పాత్రను మనీషా కొయిరాలా చేస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌గా అమైరా దస్తూర్ చేస్తోంది. జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, సత్యజీత్ దూబే కీలక పాత్రలు చేస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందిస్తుండటం ఈ మూవీకి సంబంధించిన మరో విశేషం. సెప్టెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇటీవలే 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్'తో సందీప్ రెడ్డి వంగా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి తెలుగు డైరెక్టర్ సత్తా ఏమిటో చూపించాడు. ఇప్పుడు 'ప్రస్థానం'తో దేవా కట్టా కూడా ఆ వరుసలో నిలుస్తాడేమో చూడాలి.