'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ ఈ ఏడాది లేనట్లే!
on Jan 29, 2020
యస్.యస్. రాజమౌళి ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీని 2021 సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్రణాళిక వేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇది రాజమౌళి, తారక్, చరణ్, 'ఆర్ ఆర్ ఆర్' అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసే అంశం. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను ఆధారం చేసుకొని కల్పిత కథతో, 20వ శతాబ్దం తొలినాళ్ల నేపథ్యంతో రాజమౌళి రూపొందిస్తోన్న 'ఆర్ ఆర్ ఆర్'ను మొదట జూలై 30న విడుదల చేయనున్నట్లు నిర్మాత డీవీవీ దానయ్య 2019లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తారక్, చరణ్.. ఇద్దరూ గాయాల పాలవడం, తారక్ సరసన నటించే హీరోయిన్ మారడం వంటి కారణాలతో షూటింగ్‌లో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో అనుకున్న ప్రకారం జూలైలో ఈ సినిమా విడుదలవడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమైంది. అందుకు తగ్గట్లే 'ఆర్ ఆర్ ఆర్' జూలైలో కాకుండా, అక్టోబరులో దసరా సీజన్‌లో సినిమా రిలీజ్ అవుతుందని అనధికర వర్గాలు కొద్ది రోజుల క్రితం వెల్లడించాయి. దీనిపై మేకర్స్ మాత్రం పెదవి విప్పలేదు.
కాగా సినిమాలో హీరోలకు గురువు పాత్ర చేస్తోన్న అజయ్ దేవగణ్‌కు సంబంధించిన సన్నివేశాలు ఇటీవలే మొదలయ్యాయి. ఆయన భార్యగా శ్రియ నటిస్తున్న విషయం కూడా వెల్లడైంది. మరోవైపు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా తారక్‌కు సంబంధించిన సీన్లు, ఆయన గెటప్స్ ఆన్‌లైన్‌లో లీకవుతుండటం సినిమా యూనిట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఈ లీకులపై ఒక బృందం సీరియస్‌గా పనిచేస్తోంది. లీకులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతోంది.
ఇదివరకు ఏప్రిల్ లోగా షూటింగ్ అంతా పూర్తవుతుందనీ, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌కు నాలుగైదు నెలల సమయం తీసుకొని, అక్టోబరులో సినిమాని విడుదల చెయ్యాలని దర్శక నిర్మాతలు భావించారు. అయితే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్‌కు మరింత ఎక్కువ సమయం పట్టేట్లు ఉందనే విషయం అంతర్గత వర్గాల ద్వారా తెలిసింది. షూటింగ్ సైతం ఏప్రిల్ లోగా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదనీ, ఇప్పటికి 60 శాతం సన్నివేశాలే పూర్తయినందున, మిగతా 40 శాతం సన్నివేశాలకు మూడు నెలల కాలం సరిపోదని వినిపిస్తోంది. దసరా సీజన్ దాటితే, మరో పెద్ద సీజన్ సంక్రాంతే కాబట్టి, అప్పుడే ఆ మూవీని రిలీజ్ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం.
ఏదేమైనా నిర్మాతలు ఏ విషయం త్వరగా ఫైనలైజ్ చేస్తే, మిగతా సినిమాలకు ఇబ్బంది ఉండదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. గతంలో 'బాహుబలి' రిలీజ్ విషయంలో జరిగిన దోబూచులాట వల్ల పలువురు ఇతర సినిమాల నిర్మాతలు ఇబ్బందులు పడ్డారు. రాజమౌళి సినిమా అంటే నిస్సందేహంగా ప్రేక్షకుల దృష్టంతా ఆ సినిమా మీదే ఉంటుంది. కాబట్టి ఆయన సినిమా మీద తమ సినిమా రిలీజ్ చెసి, నలిగిపోవాలని ఏ నిర్మాతా అనుకోవట్లేదు. కాకపోతే రిలీజ్ డేట్‌లో క్లారిటీ ఉంటే, అందుకు తగ్గట్లు తమ సినిమాల్ని విడుదల చేసుకోవచ్చని వాళ్లు భావిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నిర్మాతలు వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసుకొని సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' సంక్రాంతికి వస్తుందని ముందే తెలిస్తే, వాళ్లు ముందుగానో, లేక తర్వాతో వచ్చే విధంగా ప్లాన్ చేసుకొనే వీలుంటుంది.
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ మూవీని ఆగస్టులో రిలీజ్ చేయ్యాలని దాని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి 'ఆర్ ఆర్ ఆర్'తో ఆ సినిమాకొచ్చే పేచీ ఏమీ లేదు. అయితే పవన్ కల్యాణ్-క్రిష్ మూవీ, మహేశ్-వంశీ పైడిపల్లి మూవీ, ప్రభాస్ సినిమా, అల్లు అర్జున్-సుకుమార్ మూవీ సహా మరికొన్ని సినిమాలపై 'ఆర్ ఆర్ ఆర్' విడుదల తేదీ ప్రభావం పడే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఒక ప్రణాళిక ప్రకారం తమ సినిమా పనులు పూర్తిచేసి, సినిమా రిలీజ్ డేట్‌పై మేకర్స్ ముందుగానే స్పష్టమైన సంకేతాలు పంపించాలని అంతా కోరుకుంటున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' అక్టోబరులో రాదనే విషయాన్ని తెలియజేస్తే, గాంధీ జయంతి, దసరా సెలవుల్లో తమ సినిమాల్ని తీసుకువద్దామని భావిస్తున్న వాళ్లకు పన్నీరు పోసినట్లవుతుంది.
మొత్తానికి.. 'ఆర్ ఆర్ ఆర్' విడుదలలో జాప్యం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ఇప్పటికే 2019లో తమ హీరో సినిమాని మిస్సయిపోయిన వాళ్లు, ఇప్పుడు 2020లోనూ ఆ సినిమా రాదంటే.. ఆ విషయాన్ని జీర్ణం చేసుకోవడం కాస్త కష్టమే. కానీ.. రాజమౌళి సినిమా కాబట్టి, ప్రభాస్‌కు 'బాహుబలి' మూవీ తరహాలో తారక్‌కు 'ఆర్ ఆర్ ఆర్' దేశవ్యాప్తంగా మహా ఇమేజ్‌ను తీసుకు వస్తుందని వాళ్లు ఆశిస్తున్నారు. తారక్‌పై తీసిన ఇంట్రడక్షన్ ఫైట్ అద్భుతంగా ఉంటుందని ఇప్పటికే అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. లుక్స్ పరంగా చూస్తే.. ఇప్పటి దాకా కనిపించని రీతిలో తారక్ కొత్త రూపంలో కనిపించబోతున్నాడు. అతనికీ, చరణ్‌కూ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకుంటాయని వినిపిస్తోంది. చూద్దాం.. 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ డేట్ విషయంలో దర్శక నిర్మాతలు త్వరలోనే ఏదైనా అనౌన్స్‌మెంట్ చేస్తారేమో...