'మర్డర్' ట్రైలర్ రివ్యూ: మారుతీరావు చేసింది తప్పా?
on Jul 28, 2020

'పిల్లల్ని కనగలం గాని వాళ్ల మనస్తత్వాలను కనగలమా?' అని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. 'సమాధానం మీరే చెప్పండి' అని ప్రేక్షకులను అడిగారు. ప్రేక్షకులు ఏం చెబుతారో 'మర్డర్' సినిమా విడుదలైన తర్వాత తెలుస్తుంది. ట్రైలర్ ద్వారా వర్మ చెప్పిన ఈ విషయంలో ఏమాత్రం కొత్తదనం లేదు. ఇప్పటికే మీడియాలో ప్రజలు అందరూ చూసిన విషయాన్నే ఆర్జీవీ నేతృత్వంలో డైరెక్టర్ ఆనంద్ చంద్ర సినిమా తీసినట్లు అర్థమవుతూ ఉంది.
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యను ఆధారం చేసుకుని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'మర్డర్'. దీనికి 'కుటుంబ కథా చిత్రమ్' అనే ట్యాగ్‌లైన్ తగిలించారు. కన్న కూతురు అమృత వేరే కులానికి చెందిన అబ్బాయి ప్రణయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేని ఓ తండ్రి మారుతీరావు, కిరాయి రౌడీల చేత సొంత అల్లుడిని చంపిస్తాడు. మీడియాలో విస్తృతంగా ప్రచారం అయిన ఈ నిజ జీవిత ఉదంతం, అమృత-ప్రణయ్ ప్రేమ విషయాలు ప్రజలందరికీ తెలుసు. దాన్ని వర్మ కథాంశంగా తీసుకున్నారు.
ఆల్రెడీ ప్రజలకు తెలిసిన విషయాలనే ట్రైలర్ లో చూపించారు. అందులో యావత్ భారతదేశానికి షాక్ ఇచ్చిన ఒక ఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రం అని చెప్పారు. అయితే ఈ 2:13 నిమిషాల వాయిస్‌లెస్ విజువల్ ట్రైలర్‌లో పలు ప్రశ్నలను సంధించారు.
'పిల్లల్ని ప్రేమించడం తప్పా?'
'తప్పు చేస్తే దండించడం తప్పా?'
'వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా?'
ఈ ప్రశ్నలు చూస్తే 'మారుతీ రావు చేసింది తప్పా? అని వర్మ ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. మారుతీ రావుకు అనుకూలంగా సినిమాను తెరకెక్కించినట్లు వర్మ ట్రైలర్ ద్వారా పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు. విడుదలైతే గానీ ఎవరికి అనుకూలంగా ఆయన సినిమా తీశారో తెలియదు. ఇటీవల 'పవర్ స్టార్' ట్రైలర్ లో ఆయన చూపించింది ఒకటి. చివరకు సినిమాను ముగించిన విధానం మరొకటి. ఇటీవల వర్మ కంపెనీ నుంచి వచ్చిన చిత్రాలతో పోలిస్తే 'మర్డర్' కాస్త క్వాలిటీతో తెరకెక్కినట్లు కనిపించింది.
ప్రధాన పాత్రలైన తండ్రీ కూతుళ్లుగా శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి నటించారు. జగదీశ్ చీకటి సినిమాటోగ్రఫీ, డీఎస్సార్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కాస్త క్వాలిటీగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో వచ్చినవన్నీ 40 నిమిషాల లోపు షార్ట్ ఫిలిమ్సే. 'మర్డర్' కూడా అదే బాపతు అని ఊహించవచ్చు. సమాజంలో చలామణి అయిన, అవుతున్న వివాదాస్పద అంశాలనే కాన్సెప్టులుగా చిన్న సినిమాలు తీస్తూ, పెద్ద లాభాలు ఆర్జీస్తూ ఆర్జీవీ ముందుకు దూసుకుపోతున్నారు. 'మర్డర్' కూడా ఆ తానులో ఓ ముక్క.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



