ENGLISH | TELUGU  

అది నా మాజీభర్త కొనిచ్చిన ఇల్లు కాదు: రేణూ దేశాయ్ ఫైర్

on Feb 15, 2020

 

నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ తనపై మీడియా సృష్టిస్తున్న ప్రచారంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధపు ప్రచారాలతో తన ఆత్మ గౌరవాన్ని, తన నిజాయితీని దెబ్బతీస్తున్నారని బాధపడ్డారు. పవన్ కల్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత తన నివాసాన్ని స్వస్థలం పూణేకు మార్చిన ఆమె, ఇటీవలే హైదరాబాద్‌లో ఒక ఇల్లు కొన్నారు. అయితే రూ. 5 కోట్లు పెట్టి ఆ ఇంటిని ఆమెకు పవన్ కల్యాణ్ కొనిచ్చారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారంలోకి తెచ్చాయి. దీంతో ఈ విషయంపై ఆరా తీయడానికి పలువురు ఆమెకు ఫోన్లు చెయ్యడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతూ వస్తున్నారు. సహజంగానే ఇది రేణూ దేశాయ్‌కి ఇబ్బందికరంగానే మారింది. తన కష్టార్జితంతో ఇల్లు కొనుక్కుంటే, అది తన మాజీ భర్త కొనిచ్చాడంటూ జరుగుతున్న ప్రచారం ఆమెను కలవరపెట్టింది. దాంతో ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టే ఉద్దేశంతో ఫేస్‌బుక్ వేదికగా ఆ ప్రచారాన్ని ఖండిస్తూ, సుదీర్ఘ వివరణ ఇచ్చారు రేణు. ఆమె ఆవేదనకు అద్దం పట్టిన ఆ పోస్ట్...

"నేను ఇప్పుడు మీ అందరికీ ఈ విషయం గురించి వివరణ ఇవ్వడానికి ఒకే ఒక్క కారణం, నిన్నటి నుండి నాకు మీడియా వాళ్ళ నుండి, స్నేహితుల నుండి వస్తున్న ఎన్నో మెసేజెస్, ఫోన్ కాల్స్ ఆధారంగా నాకు ఈ విషయం చాలా సీరియస్ అయింది అని అర్థమయ్యింది. వాళ్ళు చెప్పింది విని నాకు చాలా బాధ వేసింది. అందుకే ఈ వివరణ...
ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన ఆత్మగౌరవం..
ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన నిజాయితీ..
ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన అస్తిత్వం..
ఇది మీకు తెలియనిదా..?
నేను, నా జీవిత మనుగడ కోసం ఒంటరిగా, తీవ్రంగా, నిబద్ధతతో ఎంతగానో శ్రమిస్తున్నాను… శ్రమిస్తూనే పోరాడుతున్నాను. ఇప్పటి వరకూ కనీసం మా తండ్రి గారి దగ్గర్నుంచి కూడా ఏ రకమైన ఆర్థిక సహాయం ఆశించలేదు, పొందలేదు. అలాగే, నేనిప్పటివరకూ నా మాజీ భర్త దగ్గర్నుంచి కూడా ఎలాంటి అన్యాయపూరితమైన భరణాన్నీ ఆశించలేదు, పొందలేదు. అది నా వ్యక్తిత్వం!!! అయినప్పటికీ మీరు నా గురించి అన్యాయంగా, అసంబద్ధమైన అబద్ధపు వార్తలను ప్రచారం చేస్తూనే ఉన్నారు! మీరందరూ అనుకుంటున్నట్టు, ప్రచారం చేస్తున్నట్టు ఇప్పుడు హైదరాబాద్‌లో నేను కొన్న ఫ్లాట్ నిజంగా మాకెవరూ కొనివ్వలేదు.

అది నా కష్టార్జితంతో ఒక్కో రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న నా సొంత ఇల్లు. అది నా మాజీ భర్త మాకు కొనిచ్చారన్న అసత్య ప్రచారాల వల్ల నా నిజాయితీకీ, ఆత్మగౌరవానికీ, నా అస్తిత్వానికీ, చివరగా నా ఉనికికే ప్రమాదం సంభవిస్తుందనే చిన్న ఆలోచన మీకెవ్వరికీ రాలేదా? నాకు తెలిసినంతవరకూ.. ఈ వార్తకూ, నా మాజీ భర్తకూ ఎలాంటి సంబంధం ఉండి ఉండదు. కనీసం ఈ ప్రచారం ఆయన దృష్టికి కూడా వెళ్ళి ఉండదు. అలాంటిది, ఒక వార్తను రాసేటప్పుడు, అది నిజమో కాదో నిర్ధారించుకోకుండానే, అత్యుత్సాహంతోనో, తొందరపాటుతోనో, లేక మీ సంస్థల మనుగడ కోసమో, ఒక ఒంటరి స్త్రీ మనుగడను ప్రమాదంలో నెట్టడం ఎంతవరకూ సమంజసం? 

ఇలాంటి వార్తలు ఎంత వేగంగా ప్రజల్లోకి వెళ్తాయో మీకు తెలియదా? ప్రజలు ఈ అబద్దపు వార్తను నిజమని నమ్మితే, సంఘంలో నాకున్న గౌరవం మసకబారదా? ఏది జరిగినా చెక్కు చెదరని నా అస్తిత్వం, వ్యక్తిత్వం, నా ఆత్మగౌరవం, నేను అనే ఒక నిజం అసత్యం అయిపోదా? నా ఆత్మ ఎంత ఘోషిస్తుంది! ఎంతలా చితికిపోతుంది!? దయచేసి ఆలోచించండి.. నా ఈ జీవితంలో ఇప్పటివరకూ ఏ మగవాడి సాయం లేకుండా సాగుతున్న నాలాంటి ఒంటరి తల్లి జీవన గమనానికీ, పోరాటానికీ గౌరవం ఇవ్వకపోయినా సరే… దయచేసి, ఇలా కించపరచకండి. నేను మీతో పంచుకుంటున్న ఈ బాధను సరిగ్గా అర్థం చేసుకోకుండా మళ్ళీ నాకూ, నా మాజీ భర్త అభిమానులకూ మధ్య, దయచేసి ఎలాంటి గొడవలూ సృష్టించకండి.
మీ
రేణూ దేశాయ్"

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.