ఓటీటీలోకి రామ్ సినిమా సైతం?
on Aug 21, 2020
థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేసే ట్రెండ్ టాలీవుడ్‌లో త్వరలో మొదలు కానుంది. ఆల్రెడీ 'కృష్ణ అండ్ హిజ్ లీల', 'భానుమతి రామకృష్ణ', 'పెంగ్విన్', 'జోహార్' వంటి సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. అయితే, 'వి'తో స్టార్ హీరోలు నటించిన సినిమా రిలీజులకు పునాది పడనుంది. సెప్టెంబర్ 5న ఆ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. తరవాత 'నిశ్శబ్దం' విడుదలకు సిద్ధమైంది. దీంతో రామ్ సైతం తన సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాడట.
రామ్ డ్యూయల్ రోల్‌లో నటించిన సినిమా 'రెడ్'. షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కి ఫస్ట్ కాపీ చేస్తున్న టైమ్‌లో కరోనా వచ్చి పడింది. దాంతో రిలీజ్ ఆగింది. మొదటి నుండి 'రెడ్'కి ఓటీటీ ఆఫర్లు బాగా వచ్చాయి. 'ఇస్మార్ట్ శంకర్' హిట్ తరవాత చేసిన సినిమా కావడంతో థియేటర్లలో బాగా ఆడుతుందనే నమ్మకంతో రామ్ ఓటీటీకి ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఆల్రెడీ హిందీ డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ రూపంలో బడ్జెట్ రికవరీ అయ్యింది. అందుకని, హ్యాపీగా థియేటర్లలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ, ఇప్పుడు స్టార్స్ చేసిన సినిమాలు ఓటీటీ బాట పట్టడంతో తన సినిమానూ అమ్మితే ఎలా ఉంటుందని లెక్కలు వేస్తున్నారట.