'సర్కారు వారి పాట' షూటింగ్‌పై 'మేజర్' ఎఫెక్ట్!
on Aug 21, 2020
మహేశ్ హీరోగా నటించే 27వ సినిమా 'సర్కారు వారి పాట' షూటింగ్ ప్రారంభానికి బ్రేకులు పడ్డాయి. పరశురామ్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చెయ్యాలని మహేశ్ బృందం భావించింది. కరోనా మహమ్మారి కారణంగా మార్చి నెల మధ్య నుంచి షూటింగ్‌లు నిలిచిపోయాయి. కొన్ని నిబంధనలతో ప్రభుత్వాలు షూటింగ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ బిగ్ స్టార్స్ ఎవరూ షూటింగ్‌లకు ఆసక్తి చూపించలేదు. చిన్న సినిమాలు, అతి తక్కువ టీమ్‌తో పనిచేసే సినిమాలు రెండు మూడు మాత్రమే షూటింగ్స్ జరుపుతున్నాయి. అలాగే టీవీ సీరియళ్ల షూటింగ్స్ కూడా.
ఈ నేపథ్యంలో జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మహేశ్ నిర్మిస్తోన్న 'మేజర్' సినిమా షూటింగ్‌ను కూడా ఇటీవల పునరుద్ధరించారు. అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ మూవీకి శశికిరణ్ తిక్కా డైరెక్టర్. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ జరుపుతున్నా.. ఈ సినిమా యూనిట్‌లోని కొంతమందికి కరోనా లక్షణాలు కనిపించడంతో, టెస్ట్ చేయించుకున్నారు. వారిలో పలువురికి పాజిటివ్ రావడంతో యూనిట్ మొత్తం షాక్ తింది. దీంతో వెంటనే షూటింగ్ నిలిపి వేశారు. పాజిటివ్ వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు మహేశ్ వాకబు చేస్తున్నాడనీ, వారికయ్యే ఖర్చును సైతం నిర్మాతగా ఆయనే భరిస్తున్నాడనీ సమాచారం.
ఈ అనుభవంతో 'సర్కారు వారి పాట' షూటింగ్ ప్రారంభించాలనే ఆలోచనను మహేశ్ పక్కన పెట్టేశాడని తెలిసింది. భారీ బడ్జెట్ సినిమా కావడం, సెట్స్‌పై ఎక్కువ మంది క్యాస్ట్ అండ్ క్రూ అవసరం ఉండటంతో షూటింగ్ జరిపితే, అనవసరంగా అందరినీ రిస్క్‌లో పెట్టినట్లు ఉంటుందని మహేశ్ భావించాడు. అందుకే కరోనా ప్రభావం తగ్గిన తర్వాతే 'సర్కారు వారి పాట'ను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నాడు.