రణబీర్ కపూర్, అల్లు అర్జున్ మల్టీస్టారర్.. చర్చలు మొదలయ్యాయి?
on Apr 1, 2025
ఇండియన్ టాకీ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు కొన్ని వేల సినిమాలు వచ్చాయి. వాటిలో ఒక హీరో నటించిన సినిమాలు కాకుండా ఒకరికి మించి హీరోలు నటించిన సినిమాలు కూడా ఎన్నో వచ్చాయి. ఇలా ఎక్కువ మంది హీరోలు కలిసి నటించిన సినిమాలు హిందీలోనే ఎక్కువ వచ్చాయని చెప్పొచ్చు. ముగ్గురు, నలుగురు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించిన సందర్భాలు కూడా మనం చూశాం. అయితే అది రాను రాను తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు హిందీలో మల్టీస్టారర్స్ లేవనే చెప్పాలి. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్, ఎఎన్నార్ ఇద్దరూ కలిసి దాదాపు 15 సినిమాల్లో నటించారు. అలాగే కృష్ణ, శోభన్‌బాబు కలిసి 12 సినిమాలు చేశారు. అలాగే కృష్ణంరాజు కూడా మల్టీస్టారర్స్ చేశారు. ఆ తర్వాత తెలుగులో కూడా ఇద్దరు హీరోలు కలిసి నటించే సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. శ్రీకృష్ణార్జునయుద్ధం కారణంగా ఎన్టీఆర్‌తో కలిసి సినిమా చేయకూడదని ఎఎన్నార్ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత 14 ఏళ్ళకు చాణక్య చంద్రగుప్త చిత్రంలో మళ్ళీ ఇద్దరూ కలిసి నటించారు. ఇక కృష్ణ, శోభన్‌బాబు కలిసి నటించిన చివరి సినిమా మహాసంగ్రామం. ఆ సినిమాలో తన క్యారెక్టర్‌ని తక్కువ చేసి చూపించారన్న కారణంతో శోభన్‌బాబు మల్టీస్టారర్స్ చెయ్యకూడదని డిసైడ్ అయ్యారు. అలా తెలుగులో మల్టీస్టారర్స్‌కి తెరపడింది.
చాలా సంవత్సరాల తర్వాత 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో మల్టీస్టారర్స్‌కి శ్రీకారం చుట్టారు వెంకటేష్, మహేష్. ఆ తర్వాత వెంకటేష్, పవన్‌కళ్యాణ్ గోపాల గోపాల చేశారు. ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు టాప్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారంటే వారి క్యారెక్టర్స్‌కి సమానమైన ప్రాధాన్యం ఇవ్వాలని ఆ హీరోల అభిమానులు కోరుకుంటారు. అయితే ఈమధ్యకాలంలో ఒకే భాషకు చెందిన హీరోలు కాకుండా వివిధ భాషలకు చెందిన హీరోలు కలిసి సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన సలార్ చిత్రంలో మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన విషయం తెలిసిందే. మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలోనూ పృథ్విరాజ్ నటిస్తున్నారు. అలాగే తమిళ, కన్నడ హీరోలు కూడా తెలుగు హీరోలతో కలిసి సినిమాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా బాలీవుడ్ హీరో రణబీర్‌కపూర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దానికి కారణం.. నందమూరి బాలకృష్ణ. ఆయన సారధ్యంలో నడుస్తున్న అన్‌స్టాపబుల్ షోలో దీని ప్రస్తావన వచ్చింది. అల్లు అర్జున్ ఈ షో సీజన్ 4కి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ షోలో రణబీర్ కపూర్ ఫోటో చూపించి అతనిపై అభిప్రాయం చెప్పమని బన్నీని అడిగారు బాలయ్య. దానికి బన్నీ సమాధానమిస్తూ మా జనరేషన్‌లో గొప్ప ఆర్టిస్ట్ రణబీర్ అని సమాధానం చెప్పారు. వెంటనే బాలయ్య స్పందిస్తూ.. ‘మరి ఇద్దరూ కలిసి ఒక సినిమా చెయ్యొచ్చు కదా’ అని అడిగారు. దానిపై బన్నీ స్పందించకపోవడంతో ‘మీ ఇద్దరికీ సరిపోయే కథను ఎవరూ చేయలేకపోతే నేనే స్టోరీ ఇస్తాను. అంతేకాదు, అవసరమైతే డైరెక్షన్ కూడా నేనే చేస్తాను’ అన్నారు బాలయ్య. దానికోసం ఆరు నెలల టైమ్ ఇస్తున్నానని, ఆలోచించుకొని చెప్పమని అన్నారు. అన్‌స్టాపబుల్ షోలో ఈ ప్రస్తావన వచ్చిన నాటి నుంచి రణబీర్ కపూర్, అల్లు అర్జున్ మల్టీస్టారర్‌పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ షో జరిగి ఇప్పటికి 5 నెలలు అయింది. కానీ, ఈ మల్టీస్టారర్ గురించి మళ్ళీ ఎవరూ ప్రస్తావించలేదు. మరి ఆరునెలలు టైమ్ ఇచ్చిన బాలయ్య దీని గురించి మాట్లాడతారో, లేక బన్నీ ఏదైనా అప్‌డేట్ ఇస్తారో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా రణబీర్ కపూర్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సినిమా అంటే అది ఒక రేంజ్‌లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు కలెక్షన్లపరంగా ఉన్న అన్ని రికార్డులను ఈ ప్రాజెక్ట్ చెరిపేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇద్దరూ కలిసి సినిమా చేస్తారో లేదో తెలీదుగానీ, సోషల్ మీడియాలో మాత్రం అప్పుడే ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు మొదలయ్యాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
