‘జడ పదార్థం’ అన్నారు ఇప్పుడేమైంది?
on Aug 3, 2017
సినిమా రంగంలో ఎవరి విషయంలోనూ త్వరగా ఓ అభిప్రాయానికి వచ్చేయకూడదు. ఇక్కడ ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం. రాజే కింకరుడవొచ్చు... కింకరుడే రాజవ్వొచ్చు. సినిమా రంగం అనేది పరమపద సోపానపటం. ఎవరు నిచ్చెన ఎక్కుతారో తెలీదు.. ఎవర్ని పాములు కరుస్తాయో తెలీదు. ఇదంతా ఎందుకు చెబుతున్నట్లు... అనుకుంటున్నారా? ‘లీడర్’సినిమా చూసి రానాను ఏమన్నారంతా...? ‘జడ పదార్థం లా ఉన్నాడే’ అని విమర్శించలా? తర్వాత ఏమైందీ?
‘కృష్ణంవందే జగద్గురుమ్’లో బీటెక్ బాబుగా ప్రేక్షకుల మెప్పును పొందేశాడు. ‘ఘాజీ’తో మల్టీప్లెక్స్ ప్రేక్షకుల మనసుల్ని దోచేశాడు. ఇక ‘బాహుబలి’గురించి చెప్పేదేముంది? అందులో భల్లాలదేవుడిగా రానా అభినయం శిఖరాగ్ర చుంబనమే. ప్రస్తుతం రానా ఇండియాలోని స్టార్ హీరోల్లో ఒకరు. అందులో ఏమన్నా అనుమానమా?
రానా నిజంగా అదృష్టవంతుడు. ఎందుకంటే... ఇప్పుడున్న హీరోల్లో ఎవరికీ దక్కనటువంటి వైరైటీ పాత్రలు రానాను వరిస్తున్నాయి. త్వరలో ఆయన ‘హిరణ్యకశిప’గా కనిపించనున్నాడు. భారీ బడ్జెట్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు. భల్లాలదేవునిగా విశ్వరూపం చూపించిన రానాకు హిరణ్యకశిపుని అలరించడం పెద్ద పనేం కాదని పలువురి అభిప్రాయం. చూశారా?.. అంతలోనే ఎంత మార్పో! మరి అందుకే అనేది... ఎవరి విషయంలోనూ త్వరగా ఓ నిర్ణయానికి వచ్చేయకూడదు అని.
ఈ నెల 11న ‘నేనే రాజు నేనే మంత్రి’అంటూ జోగేంద్రగా రాబోతున్నాడు రానా. తొలి సినిమా ‘లీడర్’లో ముఖ్యమంత్రిగా కనిపించిన రానా... ఈ సినిమాలో మరోసారి సీఎంగా అలరించనున్నాడు. తెలుగు తెరవేల్పు, మహానాయకుడు నందమూరి తారక రామారావు తనకు దైవం లాంటివారనీ... ఎన్టీయార్, ఎమ్జీయార్ ఫిలాసఫీ... తన జోగేంద్ర పాత్రలో ఉంటుందనీ తెలిపి సినిమాపై అంచనాలు పెంచేశాడు రానా.
‘వందమంది ఎమ్మెల్యేలను రిసార్ట్స్ లో పెడితే... నేను అవుతా ముఖ్యమంత్రి’అన్న ఆ సినిమాలో డైలాగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. బాహుబలి, ఘాజీ విజయాలతో మంచి జోష్ మీదున్న రానాకు ఈ సినిమా ఎలాంటి అనుభూతినిస్తుందో తెలుసుకోవాలంటే... ఇంకో ఓ వారం ఆగాల్సిందే.