తిండితిని పారిపోవడమేంటండీ...చండాలంగా?
on Aug 3, 2017
డా.డి.రామానాయుడు తొలి సూపర్ హిట్ ‘రాముడు-భీముడు’(1964). ఎన్టీయార్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా... నిర్మాతగా నాయుడిగారికి బలమైన పునాది వేసింది. ఆ సినిమా రీమేక్ హక్కులను విజయా సంస్థ వారికి అమ్మేశారు నాయుడుగారు. దాంతో తమిళంలో ఆ కథను రీమేక్ చేయడానికి విజయావారు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇది 53ఏళ్ల నాటి ముచ్చట.
తెలుగులో ఎన్టీయార్ చేసిన సినిమా అంటే... తమిళంలో చేయాల్సింది ఎమ్జీయారే కదా!. ఆయనకు కూడా కథ నచ్చేసింది. షూటింగ్ మొదలయింది. రాముడు సన్నివేశాలన్నీ ఎమ్జీయార్ పూర్తి చేసేసి... భీముడు పాత్ర లోకి ఎంటరయ్యారు.
ఆ రోజు షూటింగ్ లో చేయాల్సిన తొలి సన్నివేశాన్ని ఎమ్జీయార్ కి వివరించారు దర్శకుడు తాపి చాణక్య. భీముడు ఓ హోటల్ కెళ్లి గొంతుదాకా తిని డబ్బులివ్వకుండా పారిపోతాడు. ఇది సీన్. సన్నివేశం విన్న ఎమ్జీయార్ చిరాగ్గా మొహం పెట్టి.. ‘ఏంటి?... డబ్బులివ్వకుండా తిని పారిపోతాడా?.. ఇదెక్కడి చండాలవయ్యా..? నేను చేయను. ఇలాంటివి చేస్తే నా ఫ్యాన్స్ ఊరుకోరు’అని నిర్మొహమాటంగా చెప్పేశారు.
‘భీముడి పాత్ర తీరుతెన్నులు అలాగే ఉంటాయండీ... వాడు కొంచెం గాలి రకం. అలాగే చేయాలి’అని దర్శకుడు ఎంత చెప్పినా ఎమ్జీయార్ వినలేదు. సరికదా... ‘రైటర్ గారిని ఓ సారి రమ్మనండి మాట్లాడాలి’అని ఆర్డర్ వేసి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఇక చేసేది లేక కథా రచయిత డి.వి.నరసరాజును పిలిపించారు.
నరసరాజు రాగేనే... ఎమ్జీయార్.. ‘ఏమండీ కవిగారూ... తిండితిని పారిపోవడం ఏంటండీ? నేను ఇలాంటివి చూస్తే... అభిమానులు ఒప్పుకుంటారా? నేను చేస్తానన్నప్పుడైనా... ఇలాంటి సన్నివేశాలు ఉంటే మార్చొచ్చు కదా’అనడిగారు చిరాగ్గా. నరసరాజు తడుముకోకుండా.. ‘ఎందుకు చూడరండీ? తెలుగులో చూడలేదా! అక్కడ చేసింది ఎన్టీయార్. ఇక్కడ మీరెంతో... అక్కడ ఆయనా అంతే కదా. ఇక సమస్య దేనికి?’అనేశారట . ఎమ్జీయార్ కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ‘సరే... ఆ సీన్ ని ఇంకోలా మార్చండి. చేస్తా’ అన్నారట. ‘లేదండీ... నా కథలో పాత్రల ప్రవర్తన అలాగే ఉంటుంది. ఒకరి కోసం నేను మార్చలేను. క్షమించండి’అని అక్కడ్నుంచి వెళ్లిపోయారట నరసరాజు.
లొకేషన్ అంతా సైలెంట్ గా ఉంది. ఎమ్జీయార్ కాసేపు ఆలోచించారు. చివరకు ఆయనే డైరెక్టర్ ని పిలిచి,‘లొకేషన్ రెడీ చేయండి’అన్నారు. షూటింగ్ మొదలైంది. ఎమ్జీయార్ హోటల్ లోకి వెళ్లారు. గొంతు దాకా తిన్నారు. డబ్బులివ్వకుండా బయటకు వచ్చేశారు. అయితే... దొంగలా కాదు... దొరలా. బయటకొచ్చి ‘అరెరె... డబ్బులివ్వకుండా వచ్చేశానే... సర్లే.. తర్వాత ఇచ్చేద్దాం’ అని ఓ డైలాగ్ హావభావాలతో సహా చెప్పేసి షాట్ ఓకే చేశారు. కర్రా విరగలేదు... పామూ చావలేదు.
ఇక దర్శకుడు చాణక్య నవ్వుతూ... ‘మొత్తానికి అనుకున్నది చేశారు’ అన్నారట నవ్వుతూ... ‘మీకు కావల్సింది కూడా చేశానుగా’ అని సమాధానమిచ్చారట ఎమ్జీయార్. ఇంతకీ ఆ సినిమా పేరు చెప్పనేలేదు కదూ... సినిమా పేరు ‘ఎంగ వీట్టు పిళ్లై’. 1965 సంక్రాంతి విడుదలైన ఈ సినిమా తమిళ నాట పెద్ద హిట్.
ఇక అసలు విషయం ఏంటంటే... హీరో అయినప్పట్నుంచీ ఎమ్జీయార్ కి ఓ నియమం ఉండేది. సినిమాలో సిగరెట్లు , మద్యం తాగుతూ కనిపించకూడదు, చిల్లర దొంగతనాలు చేసే పాత్ర చేయకూడదు.... ఇది ఆయన నియమం. తమిళ తెరను ఏలినన్ని రోజులూ ఆ నియమాన్ని తూ చ తప్పక పాటించారాయన. ఆ హోటల్ సీన్ చేయననడానికి కారణం కూడా అదే.
నిజంగా ఎమ్జీయార్ గ్రేట్ కదా!
-నరసింహ బుర్రా