ఎలాంటి రానా ఎలా అయిపోయాడు?
on Oct 6, 2019
భల్లాలదేవా పాత్రలో కండలు తిరిగిన దృఢకాయుడిగా, బలిష్టంగా కనిపించిన రానా దగ్గుబాటి.. 'బాహుబలి'కి కరెక్ట్ విలన్ అనిపించుకున్నాడు. ఆ సినిమా 2017 ఏప్రిల్లో వచ్చింది. కాల గమనంలో కేవలం రెండేళ్లు గడిచాయి. ఇప్పుడు అదే రానా రూపురేఖలు చూసి అందరూ షాకవుతున్నారు. ఆ బలిష్ఠమైన దేహా దారుఢ్యం ఏమైంది? ఒక జబ్బుపడ్డ మనిషిలా రానా ఎందుకు కనిపిస్తున్నాడు? అని అందరూ ఆరాలు తీసేవాళ్లే. అంతగా రానా రూపం మారిపోయింది.
చాలా రోజులుగా రానా ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు, వదంతలు ప్రచారంలోకి వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. నిజానికి ఈసరికి 'విరాటపర్వం 1992' సినిమా షూటింగ్ సగ భాగం అయిపోయుండాలి. కానీ నిన్నటి దాకా ఆయన అమెరికాలో గడిపివచ్చాడు. రానా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడనీ, చికిత్స నిమిత్తమే అమెరికా వెళ్లాడనీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అయితే తాను బాగానే ఉన్నాననీ, అలాంటి గాసిప్స్ నమ్మవద్దనీ కొన్ని రోజుల క్రితం అమెరికా నుంచే ట్వీట్ చేశాడు రానా.
మరోవైపు 'విరాటపర్వం'లో రానా కాంబినేషన్ లేని సీన్స్‌ని సాయిపల్లవితో చిత్రీకరిస్తూ వస్తున్నాడు, ఆ మూవీ డైరెక్టర్ వేణు ఊడుగుల. రానా చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన 'యన్.టి.ఆర్: మహానాయకుడు' మూవీలో నారా చంద్రబాబునాయుడు కేరెక్టర్‌లో కనిపించాడు. అందులో ఆయన ఆరోగ్యవంతంగానే కనిపించాడు. ఆ తర్వాతే ఆయన అనారోగ్యానికి గురయ్యాడని ఫిలింనగర్‌లో వినిపించే మాట.
'విరాటపర్వం' నిర్మాణ కార్యక్రమాలు జూన్‌లో లాంఛనంగా మొదలైనప్పుడు రానా హైదరాబాద్‌లోనే ఉన్నాడు. ఆ సమయంలోనే మనిషి బరువు తగ్గిపోయి పీలగా కనిపించాడు. జూలైలో అమెరికా వెళ్లాడు. అప్పట్నుంచీ ఆయన ఆరోగ్య స్థితి గురించి భిన్న రకాలుగా ప్రచారమవుతూ వస్తోంది. అక్టోబర్ 3న "మరో 72 గంటల్లో ఇండియాకు తిరిగొస్తున్నా" అంటూ తన ట్విట్టర్ పేజీలో రానా షేర్ చేసిన ఫొటో చూసినవాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఫుల్ బియర్డ్‌తో ఉన్నప్పటికీ ఆయన ముఖంలో చాలా మార్పు కనిపిస్తున్నదని అందరూ ఫీలయ్యారు. "ఏంటి అలా అయిపోయావ్? సరిగా తినట్లేదా?" అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెట్టారు. ఎంతలా మారిపోతే అలా అడుగుతారు?
మొత్తానికి రానా ఇండియా వచ్చేశాడు. అయితే లేటెస్ట్‌గా ఆయన హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఉండకుండా, ముంబైకి మకాం మారుస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రానా కోసం ఒక ఇల్లు సిద్ధమయ్యిందనీ, అక్కడ రానాతో పాటు ఆయన మేనత్త, నాగచైతన్య తల్లి లక్ష్మి కూడా ఉంటారని ఇంగ్లీష్ టాబ్లాయిడ్స్ రిపోర్ట్ చేశాయి.
ఇంతకీ ఈ మూడు నెలలు రానా అమెరికాలో ఎందుకున్నాడనే విషయంపై ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరూ పెదవి విప్పడం లేదు. కానీ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ నిమిత్తమై రానా అక్కడకు వెళ్లాడనే ప్రచారం నడుస్తోంది. ఇలాంటి వందంతులు వినీ వినీ తనకు బోర్ కొట్టేసిందనీ, గుణశేఖర్ డైరెక్షన్‌లో తాను చేయబోయే 'హిరణ్యకశిప' సినిమా ప్రి-ప్రొడక్షన్ వర్క్ కోసమే తాను యు.ఎస్. వచ్చాననీ రానా ఇదివరకు ఓసారి తెలిపాడు. అయితే 'విరాటపర్వం' షూటింగ్ మానుకొని, వచ్చే ఏడాదెప్పుడో మొదలయ్యే 'హిరణ్యకశిప' వర్క్ గురించి యు.ఎస్. వెళ్లాడంటే నమ్మబుద్ధి కావడంలేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఏదేమైనా రానా అమెరికా పర్యటన వెనుక ఉన్న అసలు కారణం ఇవాళ కాకపోయినా రేపైనా వెల్లడికాక తప్పదు. అది ఆయన చెప్పిన కారణమే కావచ్చు, మరోటి కావచ్చు. అయితే.. ఆయన హైదరాబాద్‌లో కాకుండా ముంబైలో ఉండబోతున్నాడనేదే ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోన్న వార్త. అదే నిజమైతే.. దాని వెనుకా ఒక కారణం ఉంటుంది. అదేమిటన్నది త్వరలోనే వెల్లడి కావచ్చు.