రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన సినీ ప్రముఖులు!
on Oct 5, 2024
తెలుగు చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న విషాద ఘటనపై సినీ ప్రముఖులంతా స్పందిస్తున్నారు. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి అకాల మరణం అందర్నీ కలచివేసింది. 38 సంవత్సరాల అతి చిన్న వయసులో మృత్యువు ఒడిలోకి చేరడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 10 ఏళ్ళ వయసులోనే తల్లిని కోల్పోయిన రాజేంద్రప్రసాద్.. కూతురు పుట్టిన తర్వాత ఆమెలోనే తన తల్లిని చూసుకుంటున్నారు. ప్రాణానికి ప్రాణంగా భావించే కన్నకూతురు కళ్ళముందే కడతేరి పోవడాన్ని తట్టుకోలేకపోతున్నారా తండ్రి. అందరూ శ్రేయోభిలాషిగా భావించే రాజేంద్రప్రసాద్ ఇంట్లో జరిగిన విషాదాన్ని చూసి పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు స్వయంగా రాజేందప్రసాద్ నివాసానికి వెళ్లి ఆయన్ని పరామర్శిస్తున్నారు.
చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, ఎస్.వి.కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, రేలంగి నరసింహారావు, నాగ్ అశ్విన్, రఘుబాబు, సాయికుమార్, శివాజీ రాజా వంటి ప్రముఖులు రాజేంద్రప్రసాద్ నివాసానికి వెళ్ళి ఆయన్ను పరామర్శించారు. పవన్‌కళ్యాణ్, మహేష్, నాగార్జున, ఎన్టీఆర్‌లతోపాటు మరికొందరు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
Also Read