ఎన్నో విషయాల్లో అక్కినేని నాకు ఇన్‌స్పిరేషన్ : రాజమౌళి
on Sep 20, 2023
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అక్కినేని విగ్రహాన్ని తయారు చేయించారు. సెప్టెంబర్ 20న అక్కినేని జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ ‘‘నాగేశ్వరరావుగారిని చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూడడం తప్ప ప్రత్యక్షంగా ఆయనతో నాకు ఇంటరాక్షన్ లేదు. ఒకసారి ఓ ఫంక్షన్‌కి వెళ్ళినపుడు అది లేట్ అవుతుండడంతో నేను, ఆయన ఒక రూమ్‌లో వెయిట్ చెయ్యాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయనతో కొన్ని విషయాలను షేర్ చేసుకోవడం జరిగింది. అప్పుడు నేను ఆయన్ని ఒక విషయం అడిగాను ‘‘దేవదాసు చేశారు. అప్పటికే మీరు పెద్ద స్టార్ అయిపోయారు. ఆ టైమ్‌లో ‘మిస్సమ్మ’లో కమెడియన్‌గా ఎందుకు చేశారు?’’ అని. దానికాయన సమాధానం చెబుతూ ‘‘అది నా అంతట నేను అడిగి చేశాను. నాగిరెడ్డిగారు, చక్రపాణిగారు చాలా క్లోజ్ కాబట్టి ‘మిస్సమ్మ’ కథ చెప్పారు. అప్పుడు నేను ఆ క్యారెక్టర్ చేస్తానని అడిగితే ‘బుద్దుందా నీకు. నీ ఫ్యాన్స్ మమ్మల్ని కొడతారు’ అన్నారు. కాదండీ, ‘దేవదాసు’ తర్వాత నాకు వచ్చే కథలన్నీ తాగుబోతు కథలే. నా ఇమేజ్ మార్చుకోకపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది’ అని చెప్పాను’’ అన్నారు. పెద్ద హీరో అయినా కామెడీ క్యారెక్టర్ చెయ్యడానికి ఆయనపై ఆయనకు ఉన్న కాన్ఫిడెన్స్‌కి చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపించింది. వృత్తి పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, మమకారం, పర్సనల్‌గా దేవుడిపై నమ్మకం లేకపోయినా భక్తిరస పాత్రల్లో మెప్పించిన తీరు అద్భుతం. ఎన్నో విషయాల్లో ఆయన నాకు ఇన్‌స్పిరేషన్. మనందరికీ కూడా ఆయన ఇన్‌స్పిరేషన్. ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అక్కినేని నాగేశ్వరరావుగారి విగ్రహాన్ని ఎంతో అద్భుతంగా మలిచిన శిల్పులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.