‘అతిథి’ వెబ్ సిరీస్ రివ్యూ
on Sep 20, 2023
వెబ్ సిరీస్ : అతిథి
నటీనటులు: వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా, అదితి గౌతమ్, రవి వర్మ, వెంకటేశ్ కాకమాను తదితరులు
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
సినిమాటోగ్రఫీ: మనోజ్ కాటసాని
మ్యూజిక్: కపిల్ కుమార్
నిర్మాతలు: ప్రవీణ్ సత్తారు
దర్శకత్వం: భరత్ వై జి
ఓటిటి: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు సినిమాలతో ఎంతగానో పాపులారిటీ తెచ్చుకున్న హీరో వేణు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతగానో దగ్గరైన వేణు తొట్టెంపూడి. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ 'అతిథి' కథతో ముందుకొచ్చాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోని ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూసేద్దాం...
కథ:
ఒకతను చీకట్లో పరుగెత్తుకుంటూ వెళ్తుంటాడు. అయితే తనని ఎవరో వెంబడిస్తున్నట్టుగా కంగారుపడుతుంటాడు. అప్పుడే అతనికి ఒక ఫోన్ వస్తుంది. ఆ అమ్మాయి ఉందా అని అడుగగా ఉందని అవతలి వ్యక్తి చెప్తాడు. సరే అలాగే ఉంచు నేనొచ్చాక దాని పనిచెప్తా అని ఇతను అనగానే ఒక అతీత శక్తి వచ్చి తనని చంపేసినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత యూట్యూబర్ సవారి తన ఛానెల్ పాపులారిటీ కోసం దెయ్యాలు లేవని చెప్తూ 'దయ్యాల మిట్ట' అనే ప్రదేశానికి వెళ్ళాలనుకుంటాడు. అయితే అక్కడికి వెళ్ళడానికి దగ్గరలో ఉన్న ఒక టీ షాప్ లో ఇద్దరిని అక్కడ నిజంగా దెయ్యాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటాడు. అయితే అక్కడ వాళ్ళు దెయ్యం గురించి చెప్పిన కథ నిజమా? కాదా అని తెలుసుకోవడానికి సవారి అక్కడికి వెళ్తాడు. ఇక మరొకవైపు సంధ్య నిలయంలో రవివర్మ అనే రచయిత తన భార్యతో కలిసి ఉంటాడు. రవివర్మ విభిన్న కథలని రాస్తుంటాడు. అయితే వాటిని చదివిన వాళ్ళావిడ ఇవన్నీ పాతగా అనిపిస్తున్నాయి. బయటకెళ్ళి చూసి రాయండి కొంచెం కొత్తగా రాయండి అనగానే.. ఒక హర్రర్ కథ రాయడానికి సిద్దమవుతాడు రవివర్మ. ఒక వర్షం కురిసిన రాత్రి అందమైన అమ్మాయి అని ఒక హర్రర్ కథ రాస్తుండగా.. అతను రాసినట్టుగానే బయట నిజంగా ఇంటి డోర్ చప్పుడు అయి, ఒక అమ్మాయి వస్తుంది. తనని చూసిన రవివర్మ షాక్ అవుతాడు. అయితే రవివర్మ కథలోని అమ్మాయే ఆ ఇంటికి వచ్చిందా? యూట్యూబర్ సవారీ దయ్యాన్ని కనిపెట్టాడా? అసలు రవివర్మ నిజంగా రచయితేనా తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడనే ఆలోచనే వస్తే అతను చనిపోతాడన్నట్టుగా మొదటి సీన్ చూపించిన తీరుతో కథ మీద ఆసక్తిని పెంచాడు డైరెక్టర్ భరత్. ఆ తర్వాత యూట్యూబర్ సవారీ ( వెంకటేశ్ కాకమాను) దెయ్యాలు లేవని చెప్తూ చేసే వీడియో కోసం అతను చేసే ధైర్యం మెప్పిస్తుంది. అయితే తన యూట్యూబ్ ఛానెల్ కి వ్యూస్ కోసం అతను చేసే ప్రతీ పని వినోదాన్ని పంచింది.
మొదటి ఎపిసోడ్ ' స్ట్రేంజ్ బ్యూటీ' . ఇందులో కథలోని క్యారెక్టర్లని పరిచయం చేస్తూ స్క్రీన్ ప్లే స్లోగా వెళ్తుంది. ఇక యూట్యూబర్ సవారీ రవివర్మ ఇంటికి వచ్చాక ఎపిసోడ్ వేగం పుంజుకుంటుంది. ఇక ఎపిసోడ్ ముగుస్తుందనేలోపు ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత సెకండ్ ఎపిసోడ్ ' టూ షార్ట్ స్టోరీస్' అంటూ రచయిత రవివర్మ రాసుకున్న రెండు విభిన్న కథలని చెప్పే సీక్వెన్స్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. అయితే ఈ ఎపిసోడ్ చివరలో మరో ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్ భరత్. మూడవ ఎపిసోడ్ ' ది మర్డర్' లో నిజంగా దెయ్యం ఉందా అనేంతలా మాయా పాత్ర ప్రతీ ప్రేక్షకుడిని కన్విన్స్ చేసేలా మలిచాడు డైరెక్టర్. ఇక నాల్గవ ఎపిసోడ్ ' బ్యాక్ అండ్ ఫోర్త్' లో అసలు కథేంటనేది రివీల్ చేస్తూ మరింత ఆసక్తిని పెంచాడు.
అయిదవ ఎపిసోడ్ ' ది కీ ఫ్యాక్టర్' లో రవివర్మ ( వేణు తొట్టెంపూడి) విభిన్నమైన పాత్రలో కన్పించి సస్పెన్స్ ని క్రియేట్ చేస్తాడు. ప్రతీ మనిషి ధన, కామ, క్రోధ, మోహం, లాంటి వాటిని అదుపులో పెట్టుకోవాలని చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఒక తొందరపాటు క్షణం చాలు మనిషిని నాశనం చేయడానికి అనే చిన్న అంశాన్ని గతంలో జరిగిన వాస్తవ పాత్రలకి కనెక్ట్ చేశాడు డైరెక్టర్ భరత్. ఆయితే ఇందులో తీసుకున్న ప్రతీ పాత్రకి ఒక ప్రత్యేకతను చూపిస్తూ కథని ఆసక్తికరంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు.
ఇక చివరి ఎపిసోడ్ ' అరిషడ్వర్గ'.. ఇందులోని పాత్రలు, ప్రొసీడింగ్స్ అన్నీ పాత రాజుల కాలాన్ని లింక్ చేస్తూ ముందుకెళ్తుంటుంది. చివరివరకు ఫుల్ ఎంగేజింగ్ గా సాగుతుంది ఈ ఎపిసోడ్. కామం, క్రోధం, మోహం, మదం, మాత్సర్యం వల్ల మనిషి ఎలా పతనమవుతాడన్నది ఈ ఎపిసోడ్ లో స్పష్టంగా తెలియజేశాడు భరత్. అయితే సరిగ్గా ప్రెజెంట్ చేయడంలో విఫలమయ్యాడు. స్లోగా సాగే మూడు, నాలుగు ఎపిసోడ్ లు పర్వాలేదనిపించే ఒకటి, రెండు ఎపిసోడ్‌లు ఈ వెబ్ సిరీస్ కి పెద్ద మైనస్ అనే చెప్పాలి. అయిదు, ఆరు ఎపిసోడ్ లలో కథ మొత్తాన్ని లింక్ చేశారు మేకర్స్. రవి వర్మ పాత్ర చుట్టూ కథని నడిపించిన తీరు బాగుంది. చివరి ఎపిసోడ్ లో.. ' ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే' అని ముగిస్తూ సీజన్-2 ఉంటుందనే హింట్ ఇచ్చి వదిలేశారు మేకర్స్. కపిల్ కుమార్ ఇచ్చిన బిజిఎమ్ ఈ వెబ్ సిరీస్ కి ప్లస్ అయింది. మనోజ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటింగ్ పర్వాలేదు. స్లో సీన్లని కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
వేణు తొట్టెంపుడి రవివర్మ పాత్రలో లీనమయ్యాడు. ఒక సైకోకిక్ కిల్లర్ తరహాలో ఆకట్టుకున్నాడు. అవంతిక మిశ్ర తన అందంతో ఆకట్టుకుంది. యూట్యూబర్ సవారి పాత్రలో వెంకటేశ్ కాకమాను ఈ వెబ్ సిరీస్ కి ప్రాణం పోసినట్టుగా ఉంది. ఇక మిగిలిన వాళ్ళు వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
వేణు తొట్టెంపుడి ఈజ్ కమ్
బ్యాక్ గా అనిపించే ఈ హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని ఒకసారి చూడొచ్చు. దెయ్యాలంటే భయపడేవాళ్ళు చూడకపోవడమే బెటర్. ఎందుకంటే ఒకటి రెండు చోట్ల ఇబ్బందిగా ఉంటుంది.
రేటింగ్: 2.75 / 5
✍🏻. దాసరి మల్లేశ్
Also Read