'ఆర్ఆర్ఆర్'కు కరోనా కష్టం! షూటింగ్ నిలిపివేత!!
on Apr 20, 2021
టాలీవుడ్‌పై మరోసారి కరోనా పంజా విసురుతోంది. గతేడాది లాక్డౌన్ కష్టాలు కళ్లముందు ఇంకా పచ్చిగా భయపెడుతుండగానే, మరోసారి అవే కష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నాలుగు నెలల నుంచీ షూటింగ్‌లు యథావిధిగా జరుగుతూ, థియేటర్లు తెరుచుకొని కార్మికులకు, సిబ్బందికి తిరిగి ఉపాధి లభిస్తోందనే ఆనందం అంతలో ఆవిరయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయి.
ఇప్పటికే ముంబైలో థియేటర్లు మూతపడి, షూటింగ్‌లు నిలిచిపోవడంతో అక్కడి చిత్రసీమలో తీవ్ర ఆందోళన నెలకొంది. కొంతమంది అక్కడి సినీ, టీవీ నిర్మాతలు తమ సినిమాల, టీవీ షోల షూటింగ్‌లను గోవా, హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు. దీనివల్ల కొంతమందికైనా ఉపాధి లభిస్తోంది. అయితే కరోనా ఎఫెక్ట్ హైదరాబాద్‌పైనా తీవ్రంగా పడుతుండటంతో ఇప్పుడు టాలీవుడ్‌కు మరోసారి కష్టాలు పునరావృతమవుతున్నాయి.
యూనిట్ సభ్యులకు కొవిడ్-19 పాజిటివ్ రావడంతో ఇప్పటికే మహేశ్‌బాబు సినిమా 'సర్కారువారి పాట', నాగచైతన్య 'థాంక్ యూ' సినిమాల షూటింగ్‌లు అర్ధంతరంగా ఆగిపోయాయి. లేటెస్ట్గా రాజమౌళి మాగ్నమ్ ఓపస్ 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ కూడా నిలిచిపోయిందని సమాచారం. యూనిట్‌లోని కీలక సభ్యుడికి కొవిడ్ అని స్పష్టం కావడంతో, ఆలస్యం చేయకుండా షూటింగ్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. అక్టోబర్ 13న దసరా సందర్భంగా 'ఆర్ఆర్ఆర్'ను విడుదల చేయాలని నిర్మాత డీవీవీ దానయ్య సంకల్పించారు. ఈలోగా కరోనా పంజా దెబ్బకు షెడ్యూల్స్ దెబ్బ తింటున్నాయి. ఈ సినిమానే కాకుండా చిరంజీవి 'ఆచార్య' షూటింగ్ కూడా ఇదే కారణంతో ఆగినట్లు వినిపిస్తోంది. చూస్తుంటే 2020 పరిస్థితులు మళ్లీ తలెత్తుతున్నాయనే భయం టాలీవుడ్లో కనిపిస్తోంది.