ENGLISH | TELUGU  

రాజమౌళీ నాన్నగారి గురించి తెలీని విషయాలు!

on Sep 14, 2017


అనగనగా ఓ విజయేంద్రప్రసాద్ అనమాట. ఆయనేమో కథలు తయారు చేయడంలో దిట్ట అన్నమాట. అతని పెన్నుకు అన్ని వైపులా పదునేనన్నమాట.  ఫ్యామిలీ అంటే.. ‘బంగారు కుటుంబం’ అంటాడు. మాస్ అంటే... ‘సమరసింహారెడ్డి’ అంటాడు. అందరికోసం అంటే... ‘బాహుబలి’అంటాడు. ఇలా ఎలాంటి కథనైనా రాసేస్తాడు.. కలంతో కదంతొక్కేస్తాడు. అదన్నమాట. పిరియాడికల్ డ్రామాలను కూడా వదలలేదండోయ్... ‘రాజన్న’ సినిమా రాసి, తీసి.. శభాష్ అనిపించేసుకున్నాడు. తెలుగులో చాలదన్నట్టు.. బాలీవుడ్ లోనూ జెండాను రెపరపలాడించేస్తున్నాడు. ఓ వైపు కథకునిగా, మరో వైపు దర్శకునిగా, ఇంకో వైపు దేశం గర్వించే దర్శకునికి తండ్రిగా... విభిన్న పాత్రల్ని రియల్ లైఫ్ లో పోషిస్తున్న విజయేంద్ర ప్రసాద్ గురించి తెలీని కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతా. సరదాగా వినండి.

‘సింహాద్రి’ సినిమాలో నాజర్ అంటాడు. ‘పదిమంది చల్లగా ఉండడం కోసం.. నేను చావడానికైనా.. ఒకడ్ని చంపడానికైనా సిద్ధం’  అని.. ఆ మాటే అందులో ఎన్టీయార్ ని ప్రభావితం చేస్తుంది. ఆ కథ నడిపించేది కూడా ఆ డైలాగే. సేమ్ టూసేమ్.. అలాగే... ఓ మాట... విజయేంద్రప్రసాద్ జీవితాన్ని ప్రభావితం చేసింది.  ఆ మాట అన్నది ఎవరో కాదు.. ఆయన తండ్రి గారే. విజయేంద్రప్రసాద్ పుట్టింది.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు. ఆయన తండ్రిగారు అప్పట్లోనే నంబర్ వన్ కాంట్రాక్టర్. ఆ రోజుల్లోనే... ఏడాదికి లక్ష రూపాయలు ఆదాయపు పన్ను కట్టేవారు. ఓ రోజు ఆడిటర్ గారు..‘నెలకు లక్ష.. పన్నులకు కట్టడం సరికాదు. మీ వ్యాపారంలో పిల్లల్ని కూడా భాగస్వాముల్ని చేయండి. ఆటోమేటిగ్గా పన్నుల భారం తగ్గుతుంది’అని సలహా ఇచ్చాడట. అప్పుడు ఆయన ఆ ఆడిటర్ కి సూటిగా ఇలా సమాధానం ఇచ్చారు ‘నా వ్యాపారంలో వాళ్లెందుకు భాగస్వాములు అవ్వాలి. వాళ్లేమైనా నాలాగా కష్టపడుతున్నారా? నా ఫ్యామిలీని పోషించాలి కాబట్టి సంపాదిస్తున్నా. అలాగే... ప్రభుత్వం కూడా ఓ కుటుంబమే. అది మనందర్నీ పోషించాలి. సో... మోసం చేయకూడదు’. ఆ మాట విజయేంద్రప్రసాద్ మనసులో సూటిగా నాటుకుపోయింది. నిజాయితీగా బతకడమే నిజమైన ఆనందమని ఆయన ద్వారా తెలిసింది. నిజానికీ... ఈ పాయింట్ తో కూడా ఓ కథ తయారు చేయొచ్చండోయ్. విజయేంద్రుడు.. కాస్త పెరిగాకా... విజయవాడ లయోలాలో చదువుకు ముగింపు కలికాకా.. వ్యాపారాలు మొదలుపెట్టాడట. ప్రతి చోటా చేతులు కాల్తూనే ఉన్నాయ్. దేవుడు ఒకటి తలచినప్పుడు.. అది కాకుండా  మనం ఏది తలపెట్టినా అది  జరగదు... జరగదు గాక జరగదు. అందుకే ఏమీ జరగలా. చివరకు మద్రాసు రైలెక్కాడు. అన్నయ్య శివశక్తి దత్తాను కలిశాడు. ఆయన దర్శకునిగా ప్రయత్నాల్లో ఉన్నారు. పైగా కె.రాఘవేంద్రరావు ఆప్తుడు. ఇంకే... ప్లాట్ ఫాం దొరికేసినట్టే.. వారితో పాటు కథా చర్చల్లో కూర్చోవడం మొదలుపెట్టాడు. కథలు రాయడంలో మెళకువలు నేర్చాడు. పుస్తకాలు చదవడం ఆరంభించాడు.

ముందు కొసరుగా... శివశక్తి దత్తతో కలిసి ‘జానకి రాముడు’ కథ ఇచ్చాడు. ‘మూగమనసులు’ గుర్తొచ్చిందన్నారంతా.

అక్కినేనికీ... ‘బంగారు కుటుంబం’ అనే సూపర్ హిట్ కథ ఇచ్చాడు. ఎవరీ విజయేంద్రప్రసాద్ అని తిరిగి చూశారంతా.
 
బాలకృష్ణకు ‘బొబ్బిలి సింహం’ కథ ఇచ్చాడు. వారెవ్వా... విజయేంద్రప్రసాద్ అని కొనియాడారంతా..

నాగార్జునకు ‘ఘరానా బుల్లోడు’ కథ ఇచ్చాడు... ప్రముఖ కథారచయితగా ప్రమోషనిచ్చేశారంతా.

బాలకృష్ణకు ‘సమరసింహారెడ్డి’ కథ రాశాడు... కొన్నాళ్లు అదే దోవలో కథలు రాసేయడం మొదలుపెట్టారంతా.  

విజయేంద్రప్రసాద్ జీవితంలో పెద్ద ట్విస్ట్.. వాళ్ల అబ్బాయ్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడవ్వడం. ఇక వేరే దర్శకులకు కథలిచ్చే సమయం కూడా లేకపోయింది పాపం. సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, బాహుబలి 1,2... వీటన్నింటికీ విజయేంద్రప్రసాదే కథా రచయిత. బాలీవుడ్ బంపర్ హిట్  ‘భజరంగీ భాయ్ జాన్’కీ,  షూటింగ్ జరుపుకుంటోంన్న క్రిష్ ‘మణికర్ణిక’కూ ఆయనే కథకుడు.

ఈ శుక్రవారం విజయేంద్రప్రసాద్ దర్శకుడిగా ‘శ్రీవల్లీ’ అనే సినిమా వస్తోంది. శ్రీకృష్ణ 2006, రాజన్న తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. స్వీయ దర్శకత్వం.. మరి ఎలాంటి కథ రాసుకున్నారో? ఎలా తీశారో? తెలుసుకోవాలంటే... శుక్రవారం దాకా ఆగాలి
మరి. బెస్ట్ ఆఫ్ లక్ విజయేంద్రప్రసాద్ గారూ...

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.