నేను చెప్పింది ఒకటి.. రాసింది మరొకటి.. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తా..!
on Oct 3, 2024
ఇటీవల సంచలనం సృష్టించిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల అక్కినేని నాగార్జున కుటుంబం అప్రతిష్టపాలు అయిన విషయం తెలిసిందే. దీనిపై ఎంతో మంది ప్రముఖులు ట్వీట్ల ద్వారా స్పందిస్తే మరికొందరు వీడియో ఇంటర్వ్యూలలో తమ అభిప్రాయాలను తెలియజేశారు. అలా నిర్మాత నట్టి కుమార్ ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై స్పందించారు. అయితే తను మాట్లాడిన మాటలకు సంబంధం లేని హెడ్డింగ్ పెట్టి మంత్రి వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్టుగా కలర్ ఇచ్చారని నట్టికుమార్ ఆరోపిస్తున్నారు.
ఈ విషయం గురించి నట్టికుమార్ మాట్లాడుతూ ‘సమంత గురించి మంత్రి కొండా సురేఖగారు చేసిన వ్యాఖ్యలను నేను సమర్ధించినట్టు ఓ వెబ్‌సైట్‌లో వచ్చిన వార్తను ఖండిస్తున్నాను. నేను ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ రకాల అంశాలను వారు ప్రస్తావించినప్పుడు, నేను బదులిచ్చాను. అయితే మంత్రి కొండా సురేఖగారు సమంతపై చేసిన వ్యాఖ్యలపై స్పందించమని వారు అడిగినపుడు.... మంత్రి చేసిన ఆరోపణలలో వాస్తవాలు నాకు తెలియవని, ఆ విషయం గురించి నేను మాట్లాడను స్పష్టంగా చెప్పాను. ఏమైనా ఆధారాలు ఉంటే వారు లీగల్‌గా చూసుకోవాలని చెప్పాను. అయితే దానిని వక్రీకరించి మేటర్‌కు, హెడ్డింగ్‌కు సంబంధం లేకుండా ఇండియా హెరాల్డ్ గ్రూప్, డైలీ హంట్ అనే వెబ్‌సైట్‌లో సమంతపై మంత్రి చేసిన వ్యాఖ్యలను నేను సమర్ధించినట్లు క్వశ్చన్ మార్క్ పెట్టి మరీ వార్త వచ్చింది. దీనిని నేను ఖండిస్తున్నాను.
నాకు జర్నలిస్టులన్నా, మీడియా వ్యవస్థలన్నా ఎంతో గౌరవం. పొద్దున్న లేచినప్పట్నుంచి మీడియా వారితో కలసి మెలసి ఉండటం, వారికి ఇంటర్వ్యూలు ఇవ్వడం నాకు ఎన్నో ఏళ్లుగా అలవాటు. అయితే నేను ఎప్పుడు ఏ మాటలు అన్నా దానికి కట్టుబడి ఉంటాను. మీడియా వారికీ తెలుసు. అయితే నా మాటలను వక్రీకరించి హెడ్డింగ్ పెట్టడం బాధను కలిగించింది. వెంటనే వారు దానిని తొలగించి, నేను ఖండిరచిన ఈ వార్తను వేయాలి. ఈ విషయంలో నేను సైబర్ క్రైమ్ సెల్ వారికి ఫిర్యాదు చేయడమే కాకుండా లీగల్ చర్యలకు వెనుకాడను. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని వెబ్ సైట్స్‌లో మాట్లాడిన మాటలకు, హెడ్డింగ్‌లకు సంబంధం ఉండటం లేదు. సంచలనం కోసం ఎక్కువ మంది చూడాలనే తపనతో ఇలా వక్రీకరించడం కరెక్ట్ కాదు. మీడియా వారందరినీ నేను అనడం లేదు. అలా వ్యవహరిస్తున్న వారు తమ పద్ధతి మార్చుకోవాలని కోరుతున్నాను’ అన్నారు.