క్యారెక్టర్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ఆర్టిస్ట్ అంటే అతనే!
on Apr 3, 2024
భారతీయ చలనచిత్ర చరిత్రలో మలయాళ పరిశ్రమకు ఒకప్పుడు ప్రత్యేక స్థానం ఇచ్చేవారు. ఎందుకంటే.. మిగతా పరిశ్రమల వారు రకరకాల జోనర్స్‌లో సినిమాలు చేస్తూ కమర్షియల్‌గా మంచి సక్సెస్‌లు సాధిస్తున్న తరుణంలో మలయాళంలో మాత్రం ఎక్కువ శాతం కళాత్మక చిత్రాలు, అవార్డు సినిమాలు రూపొందేవి. అప్పుడు కూడా యాక్షన్ సినిమాలు ఉన్నాయి, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ కూడా ఉన్నాయి. కానీ, ఆ పరిశ్రమ సినిమాను కళాత్మక దృష్టితోనే చూసేది. అందుకే ఆ భాషలో అవార్డు సినిమాలు ఎక్కువగా వచ్చేవి. ఆ తర్వాత వారిలోనూ మార్పు వచ్చింది. కళాత్మకంగా ఉంటూనే కమర్షియల్‌గా కూడా వర్కవుట్ అయ్యే సినిమాలపై దృష్టి పెడుతున్నారు. కమర్షియల్‌గా తాము కూడా పెద్ద సక్సెస్‌లు ఇవ్వగలం అని ప్రూవ్ చేస్తున్నారు. ఈమధ్యకాలంలో అలాంటి బ్లాక్‌బస్టర్స్ మలయాళంలో చాలా వచ్చాయి.
తాజాగా పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా బ్లెస్సీ దర్శకత్వంలో రూపొందిన ‘ది గోట్ లైఫ్’(ఆడు జీవితం) చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మాలీవుడ్ చరిత్రలోనే అత్యంత వేగంగా రూ.100 కోట్ల గ్రాస్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ చిత్రంలో పృథ్విరాజ్ పెర్‌ఫార్మెన్స్‌కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. క్యారెక్టర్ కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టే ఆర్టిస్టులు కొంతమందే ఉంటారు. వారిలో పృథ్విరాజ్ ఒకరు అని ప్రూవ్ చేస్తున్నాడు. ఈ సినిమాలోని క్యారెక్టర్ కోసం అతను చేసిన కృషి, పడిన కష్టం మామూలుగా లేవు అనే విషయం సినిమా చూస్తే అర్థమవుతుంది. 16 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ప్రయాణం ఎన్నో కష్టాలను, సమస్యలను దాటుకొని థియేటర్లలో రిలీజైంది. దాదాపు ఆరేళ్ల పాటు దుబాయ్ ఎడారిలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఇక ఇందులో నజీబ్ పాత్ర కోసం దాదాపు 31 కిలోలు బరువు తగ్గానని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ సినిమాలోని నజీబ్ పాత్ర కోసం పృథ్వీ చేసిన రిస్క్ గురించి సినిమాటోగ్రాఫర్ సునీల్ కె.ఎస్. తెలియజేస్తూ ‘ఇందులో ఒక నగ్న సన్నివేశం ఉంది. అలా నటించేందుకు పృథ్వీ మూడు రోజులు ఉపవాసం ఉన్నారు. ఆ సీన్ తీసే ముందు రోజు కూడా ఆయన కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. షూటింగ్ చేసే రోజున తన బాడీని డీహైడ్రేడ్ చేసుకునేందుకు 30ఎంఎల్ వోడ్కా తాగారు. ఆయన లొకేషన్‌కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మేమే ఆయన్ని కుర్చీలో కూర్చో బెట్టుకొని అక్కడికి తీసుకెళ్లాం. షాట్ తీసే ముందు ఆయన్ని మేమే కుర్చీలో నుంచి లేపాల్సి వచ్చింది’ అంటూ తను పృథ్వీని తను ఏ పరిస్థితిలో చూశాడో తెలిపాడు.
సునీల్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ పాయింట్ అయింది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. క్యారెక్టర్‌పై పృథ్వీకి వున్న డెడికేషన్ గురించి అందరూ కామెంట్స్ పెడుతున్నారు. పృథ్విరాజ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక మలయాళీలు ‘మీలాంటి యాక్టర్ మలయాళీ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం’ అంటూ పోస్టులు పెడుతున్నారు.
Also Read