నా ఆత్మలోని ప్రతి బిందువులోనూ నువ్వే.. స్నేహకు భర్త ప్రసన్న ఎమోషనల్ బర్త్‌డే విషెస్
on Oct 12, 2020
తెలుగు, తమిళ భాషా చిత్రసీమల్లో పాపులర్ అయిన నటి స్నేహ సోమవారం తన 39వ బర్త్‌డే జరుపుకుంది. ఈ స్పెషల్ డేకి అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. స్నేహ భర్త, నటుడు ప్రసన్న సైతం తన ప్రియమైన భార్యకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ, తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఓ అందమైన మెసేజ్ కూడా షేర్ చేసుకున్నాడు.
స్నేహ బర్త్‌డే సెలబ్రేషన్ పిక్చర్‌ను షేర్ చేసిన ప్రసన్న, "సంవత్సరాలు త్వరగా గడిచిపోతుండవచ్చు కానీ నా లోకం మాత్రం మనం కలుసుకున్న, ప్రేమలో పడ్డ క్షణం దగ్గరే ఆగిపోయింది. దానికంటే అమూల్యమైంది ఎప్పటికీ ఏదీ ఉండదు. ఇన్నేళ్లుగా నీకు నేను చెప్తూ వచ్చిన ప్రతిదీ నీపై నా ప్రేమ అనే సముద్రంలో చిన్న బిందువు అంతకూడా ఉండదు. నా ఆత్మలోని ప్రతి బిందువులోనూ నువ్వే ఉన్నావు. నా లోపాలు, నా ప్రకోపాలను తట్టుకుంటూ వచ్చిన నీకు ఎప్పటికీ థాంక్‌పుల్‌గా ఉంటాను. నువ్వే నా శ్వాస. నువ్వు కోరుకున్న ప్రతిదీ దక్కేలా ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. హ్యాపీ బర్త్‌డే కన్నమ్మ" అని హృదయాన్ని టచ్ చేసే పోస్ట్ పెట్టాడు.
2009లో 'అచ్చముండు అచ్చముండు' సినిమాకి కలిసి పనిచేసేటప్పుడు ఆ ఇద్దరి మధ్యా చిగురించిన స్నేహం, క్రమేణా ప్రేమగా మారడంతో.. ఇద్దరూ 2012లో పెళ్లి చేసుకున్నారు. వారికి విహాన్ అనే కొడుకు, ఆద్యంత అనే కూతురు ఉన్నారు.
Also Read