ప్రకాశ్‌రాజ్ రాజీనామా ఒక డ్రా'మా'! కాదంటారా?!
on Oct 13, 2021
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 2021 ఎన్నికలు ఎంత రసవత్తరంగా, ఎంత కాంట్రవర్షియల్‌గా, ఎంత రచ్చరచ్చగా జరిగాయో చూశాం. మెగా బ్రదర్స్ మద్దతు పుష్కలంగా లభించిన ప్రకాశ్‌రాజ్ 'మా' అధ్యక్షుడిగా ఈజీగా గెలుస్తాడనుకుంటే, మారిన పరిణామాల మధ్య తెలుగు నటుల్లో అత్యధికులు ఒక్కటై మంచు విష్ణుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించారు. ఇది ప్రకాశ్‌రాజ్‌కే కాకుండా మెగా బ్రదర్స్‌కు కూడా షాక్‌ను కలిగించింది. ముఖ్యంగా నాగబాబు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు. విష్ణు గెలిచాడనే ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే 'మా' సభ్యత్వానికి రిజైన్ చేశారు.
ఆ తర్వాత రోజు ప్రకాశ్‌రాజ్ కూడా అదే పని చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ప్రాంతీయవాదం ఆధారంగా జరిగాయనీ, అందుకే తాను 'మా' సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. అయితే తెలుగు సినిమాల్లో నటించడం కొనసాగిస్తానని ఆయన చెప్పారు. "మా అసోసియేషన్ కు నాయకులుగా తెలుగువాళ్ళు మాత్రమే ఉండాలన్నారు. దానిని మా మెంబెర్స్ ఆమోదించి, తెలుగువాడినే ఎన్నుకున్నారు. దానిని నేను స్వీకరించాలి. కానీ ఒక కళాకారుడిగా నాకంటూ ఒక ఆత్మగౌరవం ఉంటుంది. అందుకే 'మా' సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. నాకు సినీ పరిశ్రమకు ఉన్న బంధం, నాకు ప్రేక్షకులకు ఉన్న బంధం ఇలాగే కొనసాగుతుంది. కానీ నేను ఒక అతిథిగానే ఉండాలంటే మాత్రం మా అసోసియేషన్ లో మెంబర్ గా ఉండలేను.. అందుకే మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను." అని ప్రకటించారు ప్రకాశ్‌రాజ్.
తన రాజీనామా విషయాన్ని మంచు విష్ణుకు ఒక మెసేజ్ రూపంలో ప్రకాశ్‌రాజ్ తెలిపారు. తన రాజీనామాను యాక్సెప్ట్ చెయ్యమని రిక్వెస్ట్ చేశారు. అందుకు మంచు విష్ణు, "డియర్ అంకుల్, థాంక్యూ. మీ నిర్ణయంతో నేను హ్యాపీగా లేను. మీరు నాకంటే చాలా పెద్దవారు. సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి ఒకే నాణేనికి ఉండే రెండు సైడ్లు. ఆ రెండింటినీ మనం సమానంగానే చూడాలి. దయచేసి ఎమోషనల్ కావద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. 'మా' ఫ్యామిలీలో మీరు అంతర్గత భాగం. మీ ఐడియాస్ నాకు అవసరం, మనిద్దరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాకు రిప్లై ఇవ్వవద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. త్వరలో మిమ్మల్ని కలుస్తాను, మనం మాట్లాడుకుందాం. ఐ లవ్ యూ అంకుల్, దయచేసి తొందరపడకండి." అని రిప్లై ఇచ్చాడు.
ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన తన ప్యానల్ మెంబర్స్ 11 మంది చేతా ప్రకాశ్‌రాజ్ వారి పదవులకు రాజీనామా చేయించారు. అయితే ఆ 11 మంది 'మా' సభ్యత్వానికి రాజీనామా చేయకపోవడం గమనించాలి. 'మా' మెంబర్ అయితేనే రేపు మంచు విష్ణు శిబిరం చేసే పనులపై ప్రశ్నించే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ అవకాశం ఉండదు. ఒకవేళ ప్రశ్నించినా దానికి విలువ ఉండదు. ప్రకాశ్‌రాజ్‌కీ ఇది వర్తిస్తుంది. ఇది ఆయనకు బాగా తెలుసు. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తే, దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదని విష్ణు అంటాడనీ ఆయనకు తెలుసు. అదే ఆయనకు కావాల్సింది. అప్పుడు తిరిగి 'మా' సభ్యత్వానికి చేసిన రాజీనామాను ఉపసింహరించుకుంటున్నానని చెప్పి, తిరిగి 'మా' సభ్యుడిగా కొనసాగవచ్చు. రేపట్నుంచి తిరిగి తన గళాన్ని వినిపించవచ్చు, తన వ్యూహానికి తగ్గట్లు విష్ణు శిబిరానికి తలనొప్పులు కలిగించవచ్చు.
ఆయన వ్యూహానికి తగ్గట్లుగానే విష్ణు స్పందించాడు. ఇద్దరం కలిసి పనిచేద్దామని కోరాడు. 'ఐ లవ్ యూ అంకుల్' అని కూడా అన్నాడు. దీన్ని సాకుగా తీసుకుని, "నేను నా 'మా' ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ఇచ్చాను. 'మా' ప్రెసిడెంట్ విష్ణు గారు ప్రకాశ్‌రాజ్ రాజీనామాను స్వీకరించనని అన్నారు. ఒప్పుకుంటా. నా రాజీనామాను తిరిగి తీసుకుంటా. కానీ ఒక కండిషన్. మై డియర్ ప్రెసిడెంట్ విష్ణుగారూ.. రేపు మీరు బైలాస్‌లో తెలుగువాడు కానివాడు పోటీ చేయడానికి వీల్లేదు అని మార్చకపోతే నా రాజీనామాను వాపస్ తీసుకుంటా. ఒకవేళ మారిస్తే, ఓటెయ్యడానికో, గెలిపించడానికో మాత్రమే మెంబర్ అవడం నాకిష్టం లేదు. 'ఎవరైనా పోటీ చేయొచ్చు, భాష సమస్య లేదు, ఔట్‌సైడర్-ఇన్సైడర్ అనేది లేద'ని మీరు మాటిస్తే నా రాజీనామాను తిరిగి తీసుకుంటా." అని చెప్పారు ప్రకాశ్‌రాజ్.
బైలాస్ మారుస్తానని విష్ణు చెప్పలేదు. తెలుగువాళ్లు మాత్రమే 'మా' ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అనే నిబంధనను బైలాస్‌లో పెట్టాలని విష్ణు అనుకోవట్లేదు. అలాంటి నిబంధన తెస్తే, అది తీవ్ర విమర్శలకు దారి తీస్తుందనే జ్ఞానం ఆయనకు ఉంది. అది తెలుసు కాబట్టే, "రేపు మీరు బైలాస్‌లో తెలుగువాడు కానివాడు పోటీ చేయడానికి వీల్లేదు అని మార్చకపోతే నా రాజీనామాను వాపస్ తీసుకుంటా." అన్నారు ప్రకాశ్‌రాజ్. సో.. యథావిధిగా ఆయన 'మా' మెంబర్‌గా కొనసాగనున్నారు. ఈ ఎపిసోడ్ అంతా చూసినవాళ్లకు ఆయన రాజీనామా వ్యవహారం ఒక ఫార్సుగా, ఒక డ్రామాగా అనిపించక మానదు. ఎంతైనా ఐదు సార్లు యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ పొందినవారు కదా! ఆ మాత్రం డ్రామా పండించకపోతే ఏం బావుంటుంది!!
Also Read